Education-Article
విదేశీ విద్యార్థుల కోసం 25% అదనపు సీట్లు

వర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: దేశవ్యాప్తంగా ఉన్నతవిద్య సంస్థల్లో (హెచ్‌ఈఐ) 25 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) శుక్రవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను గత నెలలోనే ప్రజల సమీక్ష కోసం అందరికీ అందుబాటులో ఉంచింది. ఇక, విదేశీ విద్యార్థుల అడ్మిషన్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా వర్సిటీలు జాగ్రత్తలు వహించాలని తాజా మార్గదర్శకాల్లో యూజీసీ స్పష్టం చేసింది.


‘‘సంబంధిత హెచ్‌ఈఐలు మార్గదర్శకాలకు లోబడి మౌలికవసతులు, సిబ్బంది వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ 25 శాతం సీట్లను సృష్టించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థుల అర్హతల ఆధారంగా వారికి సీటు కేటాయించాలి. వారి అర్హతను యూజీసీ లేదా యూజీసీ గుర్తింపు కలిగిన ఏదైనా సంస్థ నిర్ణయిస్తుంది’’ అని యూజీసీ స్పష్టం చేసింది. అడ్మిషన్‌ విషయంలో వర్సిటీలు వాటి సొంత విధానాలను ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తున్నట్లు యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. విదేశీ విద్యార్థులకు ఎటువంటి ప్రవేశ పరీక్షలను యూజీసీ నిర్ణయించలేదని ఆయన వివరించారు. ఇక.. అంతర్జాతీయ విద్యార్థుల మార్పిడి, అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందాలు(ఎంఓయూ) ఈ 25శాతం సీట్ల కోటా కిందకు రావని యూజీసీ మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చింది. అండర్‌గ్యాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఈ సీట్లు కేటాయించాలని, పీహెచ్‌డీ సీట్లకు సంబంధించి యూజీసీ ఎప్పటికప్పుడు జారీ చేసే నిబంధనలను అనుసరించాల్సి ఉంటుందని సూచించింది. 25శాతం కోటాలో మిగిలిపోయిన సీట్లను అంతర్జాతీయ విద్యార్థులకే తప్ప ఇతరులకు కేటాయించరాదని తేల్చిచెప్పింది. అన్ని ఉన్నత విద్య సంస్థల్లోనూ అంతర్జాతీయ విద్యార్థుల కార్యాలయం ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలను ఈ కార్యాలయమే నిర్వహించాల్సి ఉంటుందని యూజీసీ వివరించింది.

Tags :