Education-Article
దివ్యాంగులకు సాక్షమ్‌ Scholarship

ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(All India Council for Technical Education) (ఏఐసీటీఈ) - ‘సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌ స్కీం’(Saxham Scholarship Scheme)ను ప్రకటించింది. కనీసం 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు దీనిని ఉద్దేశించారు. వీరికి టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌పై ఆసక్తిని కలిగించి ఉన్నతవిద్యలో ప్రోత్సహించేందుకు తగిన ఆర్ధిక సహకారం అందిస్తారు. డిప్లొమా, డిగ్రీ కేటగిరీలలో స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. నాన్‌ టెక్నికల్‌ కోర్సుల్లో చేరినవారికి, డ్యూయెల్‌ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌ తీసుకొన్నవారికి, పీజీ అభ్యర్థులకు ఈ స్కీం వర్తించదు.


అర్హత: కనీసం 9.5 సీజీపీఏతో పదోతరగతి/ ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడేళ్ల వ్యవధిగల టెక్నికల్‌ డిప్లొమా లేదా నాలుగేళ్ల వ్యవధిగల ఇంజనీరింగ్‌ డిగ్రీ మొదటి సంవత్సర ప్రవేశం పొంది ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కళాశాలలో చేరి ఉండాలి. ఐటీఐ/ డిప్లొమా కోర్సులు పూర్తిచేసి లేటరల్‌ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరినవారు కూడా అర్హులే. పదో తరగతి తరవాత డిప్లొమాలో చేరడానికి; ఇంటర్‌ / డిప్లొమా తరవాత ఇంజనీరింగ్‌ డిగ్రీలో చేరడానికి మధ్య వ్యవధి రెండేళ్లకు మించరాదు. తల్లిదండ్రుల వార్షికాదాయం ఎనిమిది లక్షలకు మించకూడదు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుకు జతచేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; ఏఐసీటీఈ స్పాన్సర్‌ చేస్తున్న ఇతర స్కాలర్‌షిప్‌లు పొందుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు. 

ఎంపిక: డిప్లొమా కేటగిరీలో పదో తరగతి మార్కుల ఆధారంగా; డిగ్రీ కేటగిరీలో ఇంటర్‌/ పన్నెండో తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

స్కాలర్‌షిప్‌: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.50,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థులకు మూడేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు నాలుగేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు. లేటరల్‌ ఎంట్రీకైతే డిప్లొమా అభ్యర్థులకు రెండేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్లపాటు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఏటా అభ్యర్థుల బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తారు. ఇందుకోసం బ్యాంక్‌ అకౌంట్‌, ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి. ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్‌ తదితర ఖర్చుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఏటా చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తరవాతి సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31 

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: ఐటీఐ/పదోతరగతి/ ఇంటర్‌/ డిప్లొమా సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; స్టడీ/ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌; ఆదాయ ధృవీకరణ పత్రం; రెన్యువల్‌ సందర్భంలో ప్రమోషన్‌ సర్టిఫికెట్‌

ఇన్‌స్టిట్యూట్‌ వెరిఫికేషన్‌: నవంబరు 15 వరకు

వెబ్‌సైట్‌: scholarships.gov.in


Tags :