Education-Article
Dasara సెలవుల్లో మార్పు లేదు!

పాఠశాలలకు 26 నుంచి వచ్చే నెల 9 వరకు

జూనియర్‌ కళాశాలలకు 2 నుంచి 9 దాకా సెలవులు

స్పష్టం చేసిన ప్రభుత్వం


హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు దసరా సెలవు(Dasara holidays)ల్లో ఎలాంటి మార్పు లేదు. ముందు నిర్ణయించిన మేరకు ఈ నెల 26 నుంచి సెలవులు ప్రారంభమై వచ్చే నెల 9 వరకు కొనసాగనున్నాయి. అలాగే.. ఇంటర్మీడియట్‌ కాలేజీల(Intermediate Colleges)కు వచ్చే నెల 2 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ(Education Department) అధికారులు బుధవారం స్పష్టత ఇచ్చారు. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్‌  ప్రకారం.. పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9 వరకు దసరా సెలవులను ఇవ్వాల్సి ఉంది. కానీ, భారీ వర్షాలు, జాతీయ సమైక్యతా దినోత్సం సందర్భంగా స్కూళ్లకు ప్రత్యేక సెలవులను ప్రకటించారు. దీంతో అకడమిక్‌ క్యాలెండర్‌లో 7 రోజుల వరకు పనిదినాల నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చడానికి వీలుగా దసరా సెలవులను కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ రాధారెడ్డి పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. దసరా సెలవులను 26 నుంచి కాకుండా, వచ్చే నెల 1 నుంచి 9 వరకు పరిమితం చేయాలని సూచించారు. అయితే.. ఉపాధ్యాయ సంఘాలు  సెలవులను కుదించవద్దని డిమాండ్‌ చేశాయి. స్పందించిన ప్రభుత్వం  దసరా సెలవులు యథాతథంగా ఉంటాయని తెలిపింది.

Tags :