Education-Article
AP News.. కడప జిల్లా: సీఎం జగన్ బంధువుల అరాచకాలు?

కడప (Kadapa): జిల్లాలో సీఎం జగన్ (CM Jagan) బంధువుల (Relatives) అరాచకానికి అంతులేకుండా పోతోంది. భూ కబ్జా (land grab)లకు పాల్పడుతూ బాధితులను బెదిరిస్తున్నారు. బాధితులు అధికారుల చుట్టూ తిరిగి వేసారిన కుటుంబం ఆత్మహత్యకు (Suicide Attempt) యత్నించింది. అయినా అధికారపార్టీ నేత మనసు కరగకపోగా.. పోలీసులతో భయపెడుతున్నారు. దువ్వూరు మండలం, ఎర్రబెల్లి గ్రామ శివారులో 325/1 సర్వే నెంబర్‌లో అక్బర్ బాషా (Akbar Basha) కుటుంబానికి ఎకరా భూమి ఉంది. ఈ భూమిని అక్బర్ భార్యకు ఆమె మేనత్త పెళ్లి కానుకగా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ భూమిని సీఎం జగన్ బంధువు, తిరుపాల్ రెడ్డి (Tirupal Reddy) కుమారుడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు ఆరోపించారు. సాగు చేయనీయకుండా పోలీసులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సీఎం జగన్ అధికారం చేపట్టిన రోజే తిరుపాల్ రెడ్డి మనుషులు ఈ భూమిలోకి అడుగుపెట్టారని బాధితుడు అక్బర్ బాషా చెప్పారు. అప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేని భూమిపై వివాదం సృష్టించారని చెప్పారు. అధికారపార్టీ నేత కావడంతో పోలీసులతో బెదిరించి తమ భూమిలోకి వెళ్లకుండా చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని బాధితులు అధికారులు, వైసీపీ నేతల చుట్టూ తిరిగినా కనికరం చూపలేదని, ఇక ఏమీ చేయలేని స్థితిలో అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయినా తిరుపాల్ రెడ్డి వర్గీయులు తమపై వేధింపులు ఆపలేదని బాధితులు తెలిపారు. 


మళ్లీ కోర్టు ఆర్డర్స్‌తో తమ భూమిలో సాగుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదం కొనసాగుతుండగా అక్బర్ భార్య మేనత్త చెప్పిన మాటలతో వివాదం మలుపు తిరిగింది. తాను అక్బర్ కుటుంబానికి భూమి ఇవ్వలేదని, దొంగ పేపర్లు సృష్టించారని చెప్పింది. తిరుపాల్ రెడ్డి కుటుంబానికి తానే భూమి అమ్మానని తెలిపింది. అయితే అక్బర్ బాషా వాదన మరోలా ఉంది. అదే నిజమైతే కోర్టు ఆర్డర్స్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం జగన్ తమకు న్యాయం చేయాలని లేదంటే రాష్ట్రం విడిచి వెళ్లిపోతామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags :