Education-Article
ఐఐటీ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రితో కలిసి నిర్వహణ

దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 12


కంది, ఆగస్టు 4: ఐఐటీ హైదరాబాద్‌, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి కలిసి మెడికల్‌ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ కోర్సును ప్రారంభించాయి. మెడికల్‌ ఫిజిక్స్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందించడం ద్వారా స్పెషలిస్ట్‌లను తయారుచేయడం ఈ కొత్త కోర్సు లక్ష్యం. ఈ మేరకు గురువారం రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్టు ఐఐటీ-హెచ్‌ అధికారులు ప్రకటించారు.  ఈ కోర్సు వ్యవధి 3 సంవత్సరాలు. దీనికి అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్‌ అనుమతి ఉంది. 2022 సెప్టెంబరు నుంచి కోర్సు ప్రారంభం కానుంది. కోర్సుకు అవసరమైన క్లినికల్‌ శిక్షణను బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సహకారంతో అందిస్తారు. వ్యాధి నివారణ, రోగ నిర్థారణ, చికిత్స రంగాల్లో కెరీర్‌ను ఆశించేవారికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి వెల్లడించారు. ఫిజిక్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు. ఐఐటీ-హెచ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆగస్టు 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :