Education-Article
వికటించిన మధ్యాహ్న భోజనం.. ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత

నల్లగొండ జిల్లా ముషంపల్లి పాఠశాలలో

ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత


నల్లగొండ రూరల్‌, జైపూర్‌, బాసర ఆగస్టు 4:ప్రభుత్వ పాఠశాల(Government school)ల్లో అందిస్తున్న ఆహారం వికటించి విద్యార్థులు(students) ఆస్పత్రి పాలవుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గురువారం రెండు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరిగాయి. మధ్యాహ్న భోజనం(lunch) వికటించడంతో నల్లగొండ జిల్లా, ముషంపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆస్వస్థతకు గురయ్యారు. అదే విధంగా సాయంత్రం అల్పాహారంగా అందించిన బిస్కెట్లు తిని మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. నల్లగొండ మండలంలోని ముషంపల్లి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 84 మంది విద్యార్థులు ఉండగా గురువారం 61 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో వీరికి  దొండకాయ కూర, సాంబారు వడ్డించారు.


భోజనం తిన్న పది నిమిషాలకే ఆరుగురు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు.. ప్రమాదమేం లేదని తెలిపారు. పాడైన కూరగాయలతో చేసిన వంటల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోపక్క, మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు గురువారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని 7, 8, 9 తరగతులకు చెందిన 80 మంది విద్యార్థులకు స్నాక్స్‌గా సాయంత్రం బిస్కెట్లు ఇచ్చారు. వాటిని తిన్న కాసేపటికే తమకు కడుపులో నొప్పిగా ఉందని తొమ్మిది మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ప్రిన్సిపాల్‌ బాలభాస్కర్‌ తెలిపారు. 


బాసరలో ‘మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌’ కలకలం 

బాసర ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌ అయిందని, 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. అయితే, అవన్నీ వదంతులేనని వర్సిటీ సిబ్బంది స్పష్టం చేశారు. వైరల్‌ జ్వరాలు రావడంతో ఆరుగురు విద్యార్థులు  ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇటీవల ఆహారంలో పురుగులు వచ్చి విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో విద్యార్థులకు భరోసా కల్పించేందుకు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ గురువారం రాత్రి వారితోనే కలిసి భోజనం చేశారు. 

Tags :