Education-Article
‘ఉక్కు’ పాఠశాలల్లో భోజనం బంద్‌

సీఎస్‌ఆర్‌ నిధులతో మూడేళ్లుగా సరఫరా

అక్షయపాత్రతో ఒప్పందం

ఒప్పంద కాల పరిమితి ముగియడంతో నిలిచిన పంపిణీ

ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు


విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీ నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.


ఉక్కుటౌన్‌షిప్‌/గాజువాక, ఆగస్టు 4: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం(Visakhapatnam Steel Plant) ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం(lunch) పంపిణీ నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌  టౌన్‌షిప్‌లో విశాఖ విమల విద్యాలయం, బీసీ రోడ్డులో వీవీవీ పాఠశాల నడుస్తున్నాయి. టౌన్‌షిప్‌లోని స్కూల్‌లో 1,900 మంది, బీసీ రోడ్డులోని పాఠశాలలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో పేద విద్యార్థులను గుర్తించి స్టీల్‌ప్లాంట్‌ స్కూల్‌లో 800 మందికి, బీసీ రోడ్డు పాఠశాలలోని 400 మందికి మధ్యాహ్న భోజనాన్ని 2019 నుంచి ప్లాంట్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ద్వారా అందిస్తోంది. అయితే బుధవారం నుంచి తదుపరి సమాచారం వచ్చేంత వరకు మధ్యాహ్న భోజనాన్ని అందించలేమని పేర్కొంటూ అక్షయపాత్ర నుంచి ఆయా పాఠశాలలకు సమాచారం అందినట్టు తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు బుధవారం నుంచి మధ్యాహ్న భోజనం తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాగా ఉక్కు కర్మాగారం, అక్షయపాత్ర ఫౌండేషన్‌ మధ్య కుదిరిన ఒప్పంద కాల పరిమితి ముగియడం వల్లే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాళ్లను సంప్రతించాలని యత్నించగా వారు అందుబాటులో లేరు. 


అత్యధికులు పేద విద్యార్థులే..

ఈ రెండు పాఠశాలల్లో చదువుతున్న వారిలో అత్యధిక శాతం మంది పేద విద్యార్థులే(Poor students) ఉన్నారు. ఉక్కు యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తుండడం, ఫీజులు తక్కువ కావడం, ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగా ఇక్కడ కూడా మధ్యాహ్న భోజనం అందిస్తుండడంతో నిరుపేదలు తమ పిల్లలను ఈ పాఠశాలల్లోనే చేర్పిస్తుంటారు. ఇప్పుడు ఒక్కసారిగా మధ్యాహ్న భోజనం నిలిపివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. టౌన్‌షిప్‌ పాఠశాలలో చదివే విద్యార్థులైతే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరిలో చాలామంది మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయంపై ఉక్కు యాజమాన్యం తగిన చర్యలు తీసుకుని మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Tags :