టీఎస్పీఎస్సీ/ పోలీస్ పరీక్షల ప్రత్యేకం/ కరెంట్ అఫైర్స్
తెలంగాణ అంశాలు
నూతన మండలాలు
పాలన సంస్కరణల్లో భాగంగా జూలై 23న నూతనంగా 13 మండలాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుండుమల్, కొత్తపల్లె(నారాయణ పేట), దుడ్యాల్(వికారాబాద్), కౌకుంట్ల (మహబూబ్ నగర్), ఆలూరు, డంకేశ్వర్(నిజామాబాద్), సాలూర్(నిజామాబాద్), సీరోలు (మహబూబాబాద్), గట్టుప్పల్(నల్లగొండ), నిజాంపేట(సంగారెడ్డి), డోంగ్లి(కామారెడ్డి), ఎండపల్లి(జగిత్యాల), బీమారం(జగిత్యాల) మండలాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో తెలంగాణలో 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 607 మండలాలు, 12769 గ్రామ పంచాయితీలు ఉంటాయి.
తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం
దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌరవిద్యుత్(solar power) కేంద్రాన్ని జూలై 30న ప్రధాని మోడి(Prime Minister Modi) వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 100 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించింది. దీని వ్యయం 420 కోట్లు. 500 ఎకరాల జలాశయం నీటిపై నిర్మించారు. ఒక్కో బ్లాక్ సామర్థ్యం 2.5 మెగావాట్లు.
జాతీయ అంశాలు
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
భారత్(India) 15వ రాష్ట్రపతి(President)గా ద్రౌపది ముర్ము(Draupadi Murmu) జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశ చరిత్రలో అతి పిన్న వయసులో(64 ఏళ్లు)రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము స్వరాష్ట్రం ఒడిశా. ఈమె ప్రతిభా పాటిల్(Pratibha Patil) తరవాత రాష్ట్రపతి అయిన రెండో మహిళ.
11వ వ్యవసాయ గణన (2021-22)
దేశంలో చిన్న, ఉపాంత భూములు వాటి పరిమాణం, పంపిణీ, భూమి వినియోగం, కౌలు, పంటల విధానం మొదలైన వాటితో సహా వ్యవసాయ సమగ్ర వివరాల సేకరణకు ఉద్దేశించిన వ్యవసాయ గణన(2021-22)ను జూలై 28న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతి అయిదేళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమం 1970-71లో ప్రారంభమైంది. 2015-16లో జరిగిన గణన ప్రకారం దేశంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు 86.2 శాతం ఉండగా పంట విస్తీర్ణంలో వారి వాటా 47.3 శాతం మాత్రమే. దీని ప్రకారం అత్యధిక భూయాజమాన్యాలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (16 శాతం).
అంతర్జాతీయ అంశాలు
హారున్ సంపన్న మహిళల జాబితా
ప్రముఖ సంస్థ హారున్ - కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ సంయుక్తంగా విడుదల చేసిన దేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ రోష్ని నాడార్ తొలి స్థానంలో నిలిచారు. 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి 84,330 కోట్లకు చేరింది. సొంతంగా ఎదిగిన మహిళల జాబితాలో ఫల్గుణి నాయర్ తొలి స్థానం పొం దారు. ఆమె సంపద 57,520 కోట్లు. తెలుగు రాష్ట్రాల నుంచి తొలి స్థానం పొందిన నీలిమ(దివిస్ ల్యాబ్స్) జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ పొందారు.
పశువులలో సరోగసి విజయవంతం
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి పశువుల్లో అద్దె గర్భం ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, కోరుట్ల పశువైద్య కళాశాల ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్ట్ విజయవంతమైంది. సాహివాల్ దేశీ జాతి గిత్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను ఆవుల్లో ప్రవేశపెట్టగా ఒక ఆవుకు పెయ్య, మరో ఆవుకు కవల దూడలు జన్మించాయి.
రాష్ట్రాల అంశాలు
దేశంలో తొలి ‘హర్ ఘర్ జల్’ జిల్లాగా బుర్హాన్పూర్
2019లో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వంద శాతం మంచినీటిని ఇంటింటికీ అందిస్తున్న జిల్లాగా మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2019 ఆగస్టు 15న ప్రారంభించినప్పటి నుంచి 1,01,905 కుటుంబాలకు మంచినీటి వసతి కల్పించారు. జిల్లాలోని 254 గ్రామాల్లో లక్ష్యం పూర్తయింది.
సెమికండక్టర్ పాలసి ప్రకటించిన తొలి రాష్ట్రం గుజరాత్
దేశంలో సెమికండక్టర్ పాలసీని ప్రకటించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. జూలై 27న గుజరాత్ 2022-27కి ప్రకటించిన సెమికండక్టర్ పాలసీ ప్రధాన లక్ష్యం సెమి కండక్టర్, డిస్ల్పే మాన్యుఫాక్చరింగ్ రంగానికి మద్దతివ్వడం, అయిదేళ్ల వ్యవధిలో రెండు లక్షలకు పైగా కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడం. అహ్మదాబాద్‌లోని ధోలెరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌లో భాగంగా ప్రత్యేక సెమికాన్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీని అమలులో గుజరాత్ స్టేట్ ఎలక్ట్రానిక్ మిషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీనిలో భాగంగా 200 ఎకరాల ప్రాజెక్టులకు 75 శాతం సబ్సిడి, స్టాంప్ డ్యూటీపై వంద శాతం రీయింబర్స్మెంట్ లభిస్తుంది.
మహతాది న్యాయరథ్
మహిళల్లో చట్టపరమైన అవగాహనను కలిగించే లక్ష్యంతో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ రాయ్‌పూర్ నుంచి జూలై 28న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరేలి తిహార్ పండుగ సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమ నినాదం ‘బాత్ హే అభిమాన్ కే, మహిళా మన్ కే సమ్మాన్ కే’. మొదటి దశల్లో దుర్గ్, రాయ్‌పూర్, రాజ్‌నందగావ్, బలోద బజార్ - భటపరా, మహాసముంద్, జంజ్‌గిర్ - చంపా, గరియా బంద్, దమ్తరి, కంకేర్ వంటి తొమ్మిది జిల్లాల్లో అమలు చేస్తారు. మహిళల హక్కులకు సంబంధించిన అంశాలను షార్ట్ ఫిల్మ్, సందేశాలు, బ్రోచర్ ద్వారా గ్రామ గ్రామాన ప్రచారం చేస్తారు. మహిళల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి మహిళ కమిషన్‌కు పంపుతారు.
అవార్డులు
హాల్ ఆఫ్ ఫేమ్‌లో లిటన్ హెవిట్
ప్రపంచ దిగ్గజాలను గుర్తించే ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ 2021 జాబితాలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం లిటన్ హెవిట్‌కు స్థానం లభించింది. ఇతను ఈ జాబితాలో చేర్చిన 34వ ఆస్ట్రేలియన్. 2002లో వింబుల్డన్, 2001 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. కెరీర్ మొత్తంలో 30 ఏటీపీ టూర్ టైటిల్స్ సాధించాడు.
మిసెస్ యూనివర్స్ 2022
దక్షిణ కొరియాలోని యోమ సిటీ వేదికగా జరిగిన మిసెస్ యూనివర్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన పల్లవి సింగ్ గెలుచుకొన్నారు. ఈమె కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)కు చెందినవారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అయిన పల్లవి 2020లో మిసెస్ ఇండియా, 2021లో మిసెస్ ఇండో ఆసియా యూనివర్స్ టైటిళ్లు గెలుపొందారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఐఎన్ఎస్ విక్రాంత్
దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను దాని తయారీ సంస్థ కొచ్చిన షిప్ యార్డ్ లిమిటెడ్ జూలై 24న భారత నౌకాదళానికి అప్పగించింది. దీనిపై మిగ్-29 కె విమానాలు, కమోవ్ హెలికాప్టర్లు, ఎంహెచ్-60 ఆర్ మల్టిరేల్ రాకెట్లు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు దీనిపై మోహరించనున్నాయి. 2009లో ప్రారంభించిన దీని నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చయ్యాయి. దీని గరిష్ఠ వేగం 28 నాట్లు. ఇది 88 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు గ్యాస్ టర్బైన్లతో నడుస్తుంది.
ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్
ఇది భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త మొబైల్ యాప్. ఇది ఆధార్ నెంబర్ హోల్డర్ గుర్తింపును ధ్రువీకరించేందుకు ముఖ ప్రామాణీకరణ ఫీచర్. ఇది జీవన్ ప్రమాణ్, రేషన్ పంపిణీ, కొవిన్ వేక్సినేషన్ యాప్, స్కాలర్షిప్ పథకాలు, పీఎం కిసాన్ వంటి సంక్షేమ పథకాలకు ప్రామాణీకరణం. ఇది ఆధార్ కార్డ్ హోల్డర్ల వేలి ముద్రలను ధ్రువీకరించేందుకు, వారి ఐరి్సను స్కాన్ చేసేందుకు, భౌతికంగా స్థానిక ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
వార్తల్లో వ్యక్తులు
ఈయన జూలై 24న కువైట్ నూతన ప్రధానిగా నియమితులయ్యారు. ఏప్రిల్‌లో రాజీనామా చేసిన షేక్ సబా ఖలీద్ అల్ సబా స్థానంలో ఈ నియామకం జరిగింది.
నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా
ఈయన 2003లో విదేశాంగ మంత్రిగా 2006లో డిప్యూటీ ప్రధానిగా 2020 - 22 మధ్య కాలంలో కువైట్ నేషనల్ గార్డ్ డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరించారు.
ఇండెర్మిట్ గిల్
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రధాన ఆర్థిక వేత్తగా ఇండెర్మిట్ గిల్ అనే భారతీయుడు నియమితులయ్యారు. ఇతని నియామకం సెప్టెం బరు 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లో ఈక్విటబుల్ గ్రోత్, ఫైనాన్స్, ఇన్స్టి ట్యూషన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరి స్తున్నారు. కౌశిక్ బసు(2012-16) తరవాత ఈ పదవి చేపట్టిన రెండో భారతీయుడిగా ఈయన నిలిచారు.
బజ్రామ్ బేగాజ్
ఈయన జూలై 24న రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియాకు ఎనిమిదో అధ్యక్షుడిగా ఇలిర్ మెటా స్థానంలో నూతనంగా నియమితుల య్యారు. ఇతని పదవీ కాలం అయిదేళ్లు. 83 మంది సభ్యులు గల అల్బేనియాలో ఇతనికి 78 మంది మద్దతు లభించింది.
మనీషా రూపేతా
పాకిస్తాన్ పోలీస్ శాఖలో డీఎస్సీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా మనీషా రూపేతా నిలిచింది. ఈమె స్వస్థలం సింధ్ ప్రావిన్స్‌లోని జౌకోబాబాద్.
క్రీడలు
కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం
బ్రిటిష్ పాలిత దేశాలు పాల్గొనే కామన్వెల్త్ క్రీడలు 2022 జూలై 28న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యాయి. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ క్రీడల్లో 72 దేశాలు పాల్గొంటున్నాయి. 20 క్రీడలు, 280 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. భారత్ 16 క్రీడల్లో 2016 మంది క్రీడాకారులతో పోటీపడుతోంది. ఈ క్రీడల్లో మన్‌ప్రీత్‌సింగ్(హాకీ), పీవీ సింధు(బ్యాడ్మింటన్) భారత పతాక ధారులుగా వ్యవహరించారు. ఈ క్రీడల నినాదం 'sports is the beginning of all' కాగా ఈ క్రీడల మస్కట్ 'Meet Perry'. ఈ క్రీడలను 1930లో తొలిసారి హామిల్టన్(కెనడా)లో నిర్వహించారు. భారత్ తరపున తొలి స్వర్ణం మీరాబాయిచాను(వెయిట్ లిఫ్టింగ్) సాధించింది.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2022
పద్దెనిమిదో ‘ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు’ ఈ ఏడాది జూలై 15 నుంచి 24 వరకు అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలోని యూజీన్ నగరంలో జరిగాయి. ఈ క్రీడల నినాదం ’ఊ్ఛ్ఛజూ ్టజ్ఛి ఎజూౌటడ’ . 180 దేశాలు పాల్గొన్న ఈ క్రీడల్లో అమెరికా తొలి స్థానంలో నిలవగా ఇథియోపియా, జమైకా, కెన్యా, చైనా వరసగా తరవాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ ఒక రజతం సాధించి క్రోయేషియా, గ్రీస్, అల్జీరియా, దక్షిణ కొరియా, బురినాఫాసో వంటి దేశాలతో ఉమ్మడిగా 33వ ర్యాంక్ పొందింది. భారత్ తరపున రజతం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా(జావెలిన్ త్రో) ఈ క్రీడా చరిత్రలో పతకం సాధించిన రెండో భారత వ్యక్తిగా నిలిచారు. ఈ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత వ్యక్తి లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజు బాబి జార్జ్ (2003 పారిస్ క్రీడల్లో).
పారిస్ ఒలింపిక్స్ నినాదం
2024లో పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ నినాదం 'Games wide open' అని ప్రకటించారు. 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న ఈ ఒలింపిక్స్‌లో 32 క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. పారిస్, ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. గతంలో 1900, 1924 సంవత్సరాల్లో ఆతిథ్యమిచ్చింది. 2024 నాటికి పారిస్ ఆతిథ్యం ఇచ్చి వంద సంవత్సరాలు పూర్తికాబోవడం మరో విశేషం.
ఫ్రెంచి గ్రాండ్ ప్రి 2022
జూలై 24న జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ 2022 టోర్నీలో రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్స్టాపెన్ విజేతగా నిలిచారు. 2022లో జరిగిన ఫార్ములావన్ టోర్నీలలో సౌది అరేబియన్, ఎమిలియ రొమాగ్నా, మియామి గ్రాండ్ ప్రి, స్పానిష్ గ్రాండ్ ప్రి, అజర్బైజాన్, కెనడియన్ గ్రాండ్ ప్రిలతోపాటు ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిలో కూడా విజయం పొందారు. ఈ ఏడాది జరిగిన 12 రేసుల్లో ఏడు టోర్నీల్లో విజయం సాధించాడు.