Education-Article
విష్ణుకుండినులు ఎవరు? పోటీ పరీక్షల కోసం!

తెలంగాణ చరిత్ర  సంస్కృతి - ఉద్యమం


కాకతీయులకు పూర్వం తెలంగాణ సామాజిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధులుగా గుర్తింపు పొందిన రాజవంశం విష్ణుకుండినులు. కొన్ని సందర్భాల్లో వీరిని విష్ణుగుండీలు అని కూడా పిలిచేవారు. వీరు ప్రధానంగా  క్రీ.శ.350 నుంచి 569 మధ్య పరిపాలించినట్లు చరిత్రకారులు గుర్తించారు. దాదాపుగా రెండు శతాబ్దాలకు పైగా కొనసాగిన వీరి పాలనలో తెలంగాణ ప్రాంతం అనేక రాజకీయ, ఆర్థిక మార్పులకు గురైంది. దక్షిణ తెలంగాణలో మొదలైన వీరి రాజ్యం క్రమంగా కృష్ణా-గోదావరి నదుల మధ్యకు విస్తరించింది. శాతవాహనుల తరవాత అత్యధికంగా తెలుగు ప్రాంతాలను పాలించిన రాజవంశం విష్ణుకుండినులదే.


పురావస్తు, చారిత్రక సాక్ష్యాల ఆధారంగా వీరి తొలిపాలన ప్రాంతం ప్రస్తుత నాగర్‌ కర్నూలు జిల్లాలో గల మునులూర్‌ కోట. ఇది ఆమ్రాబాద్‌ సమీపంలో ఉంది. ఈ ప్రాంతం నుంచి వీరు క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుత మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట, భువనగిరి జిల్లాలోని తుమ్మలగూడెం లేదా ఇంద్రపాలనవరాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. పల్లవుల అనంతరం, సముద్రగుప్తుని దక్షిణ దేశ దండయాత్రలు ముగిసిన తరవాత విష్ణుకుండినుల రాజ్యం ఏర్పడి స్థిరపడింది. వీరిపై గుప్తుల సంస్కృతీకరణ ప్రభావం ఎక్కువ. విష్ణుకుండినుల కారణంగానే అప్పటివరకు బౌద్దమత ప్రభావంలో ఉన్న తెలంగాణ... వైదికమత పునరుద్ధరణ వైపు ప్రయాణాన్ని ఆరంభించింది.


పురావస్తు ఆధారాలు

విష్ణుకుండినుల చరిత్రను వివరించే క్రమంలో అనేక ఆధారాలను పరిశీలించారు. వీటిలో నాణాలు, శాసనాలు, నిర్మాణాలు ముఖ్యమైనవి.


నాణాలు

పంజా ఎత్తిన సింహం గుర్తుతో ఉన్న నాణాలు విష్ణుకుండినుల కరెన్సీగా గుర్తింపు పొందాయి. వీటిపై బ్రహ్మలిపిలో ‘సత్యాశ్రయ’ అనే అక్షరాలు రాసి ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ నాణాలు లభ్యం అయ్యాయి. అందువల్ల వీరి రాజ్యం తెలంగాణ అంతా వ్యాపించి ఉన్నదనే వాస్తవం అర్థం అవుతుంది. ప్రధానంగా తెలంగాణలోని కీసరగుట్ట, తుమ్మలగూడెం, ఏలేశ్వరం, దొండపాడు, గొల్లగుడి, నేలకొండపల్లి, తెల్లకుంట ప్రాంతాల్లో వీరి నాణాలను గుర్తించారు. 


శాసనాలు

విష్ణుకుండినుల చరిత్ర క్రమాన్ని వీరి శాసనాలు వివరిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైన శాసనాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.


చైత్రపురి శాసనం: ఈ శాసనం ప్రస్తుత హైదరాబాద్‌ నగరంలో దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతమైన చైతన్యపురిలో లభించింది. మూసీనదీ తీరాన ప్రాకృత భాషలో రాసిన ఈ శాసనం బౌద్దమత విహార శాసనంగా గుర్తింపు పొందింది. విష్ణుకుండినులలో బౌద్దమత ఔన్నత్యాన్ని కాపాడి, విస్తరణ, వికాసం కోసం పాటుపడిన మొదటి గోవింద వర్మ కాలానికి చెందిన శాసనమిది. అయితే ఈ శాసనం తెలంగాణ ప్రాంతంలో ఆవిష్కృతమైన తొలి ప్రాకృత శాసనంగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు.

పాలమూరు శాసనం: విష్ణుకుండినుల రాజవంశీయుల క్రమంలో అత్యంత పరాక్రమ వంతుడు రెండో మాధవ వర్మ. ఈ శాసనాన్ని ఈయనే వేసినట్లు తెలుస్తుంది. విష్ణుకుండినుల వంశ క్రమం, వివరాలను అందజేయడం ఈ శాసనం ప్రత్యేకత.

చిక్కుళ్ల శాసనం: విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతం నుంచి క్రమంగా ఆంధ్ర తీరం వైపు రాజ్యాన్ని విస్తరించే క్రమంలో భాగంగా ఈ శాసనాన్ని వేయించారు. రాజు విక్రమేంద్ర వర్మ కాలానికి చెందిన ఈ శాసనంపై అనేక తెలుగు పదాల వినియోగం కనిపిస్తుంది.

తుమ్మలగూడెం శాసనం: యదాద్రి-భువనగిరి జిల్లాలో తుమ్మలగూడెం ఉంది. వాస్తవానికి ఇది విష్ణుకుండినుల రాజధాని. ఈ శాసనకర్త రాజా విక్రమేంద్రవర్మ. ఈ శాసనంలో విష్ణుకుండినుల వివిధ నిర్మాణాలకు చెందిన వివరాలున్నాయి.

కీసరగుట్ట శిలాశాసనం: విష్ణుకుండినుల ప్రత్యేకత రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. వైష్ణవ, శైవ భక్తుల మధ్య సామరస్యాన్ని కాపాడే క్రమంలో వీరు ఈ ఆలయాన్ని నిర్మించారు. కీసరగుట్ట ఆలయం దీనికి ప్రత్యేక సాక్ష్యం. ఈ శాసనం రెండో మాధవ వర్మ కాలానికి చెందిందిగా గుర్తింపు పొందింది.

సలేశ్వరం శాసనం: తెలంగాణ పర్యాటక స్థలాల్లో సలేశ్వరం ప్రత్యేకమైనది. శ్రీశైలం దేవస్థాన పరిసర ప్రాంతాలు, ప్రాజెక్ట్‌ పరిచయం ఉన్నవారందరికీ సలేశ్వరం ప్రకృతి రమణీయతపై  అవగాహన ఉంటుంది. ఇక్కడ విష్ణుకుండినుల శాసనం లభ్యమైంది.

ఖానాపూర్‌ రాగి శాసనం: మహారాష్ట్ర సతార జిల్లాలో లభ్యమైన శాసనం ఆధారంగా విష్ణుకుండినుల రాజ్యం మహారాష్ట్ర వరకు విస్తరించినట్లు తెలుస్తుంది.
నిర్మాణాలు

విష్ణుకుండినుల పరిపాలన కాలంలో నిర్మాణాలు ప్రధానంగా మతపరమైనవి. బౌద్దమత సంబంధిత నిర్మాణాలు, వైదిక మత సంబంధిత నిర్మాణాలు ఈ పరిధిలోనివే. చైతన్యపురి బౌద్దమత విహారం, తుమ్మలగూడెం విహారం మొదటి విభాగానికి చెందినవే కాకుండా, కీసరగుట్టలోని రామలింగేశ్వర ఆలయం, నల్లగొండలోని జడల రామలింగేశ్వర ఆలయం(చెఱువుగట్టు) రెండో విభాగానికి సంబంధించినవి. ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ అభిప్రాయాన్ని అనుసరించి..ఆమ్రాబాద్‌ నుంచి నాగార్జున సాగర్‌ వరకు దాదాపు 240 కి.మీ. పొడవున తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఒక రాతికోటను వీరి కాలంలో నిర్మించారు. దీనినే ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ’గా గుర్తించాలి. ఈ కోటకు సంబంధించిన అనేక శిథిలాలు నేటికీ గుర్తింపు పొందుతూనే ఉన్నాయి. స్థానికులు వీటినే ‘పటల భద్ర కోట’గా పిలుస్తున్నారు. కాకతీయుల కాలంలో ఈ కోట పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరిగినట్లుగా కొన్ని ప్రాథమిక సాక్ష్యాలు తెలుపుతున్నాయి.


లిఖిత సంబంధ ఆధారాలు

విష్ణుకుండినుల చరిత్ర అవగతానికి లిఖిత ఆధారాలు ఎక్కువగా లభ్యం కాలేదు. లభ్యమైన వాటిలో ఒకటి ‘జనాశ్రయ బంధా విచ్ఛితి’ కాగా, మరొకటి ‘సేతు బంధ’గా పిలిచే జైనమత గ్రంథం. ఈ గ్రంథ రచయిత మాధవ వర్మగా చరిత్రకారులు భావిస్తున్నారు. కొంత మంది చరిత్రకారులు మాత్రం అతని ఆస్థానంలోని కవుల రచనగా గుర్తిస్తున్నారు. విష్ణుకుండినుల కాలంలో గోవింద వర్మ కాలం వరకు ప్రాకృత భాషలోనే శాసనాలు వెలువడ్డాయి. అయితే తరవాతి కాలంలో సంస్కృతం రాజభాషగా మారింది. తెలుగు వ్యావహారిక భాషగా స్థిరపడింది. అందుకే అనేక శాసనాల్లో తెలుగు పదాల వినియోగం కనిపిస్తుంది.‘సేతు బంధ’ రచన ద్వారా  జైనమతం అప్పటికే ప్రభావశీలమైన మతంగానే కొనసాతుందని తెలుస్తుంది. గ్రూప్స్‌ పరీక్షల కోసం ప్రీపరవుతున్న అభ్యర్థులు రాజవంశాల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు లభ్యమైన పురావస్తు, చారిత్రక ఆధారాల ప్రాతిపదికగానే విశ్లేషణ చేయాలి. మెయిన్స్‌ పరీక్షలో సందర్భాన్ని బట్టి వీటిని ప్రస్తావించగలగాలి.


విష్ణుకుండినుల రాజకీయ చరిత్ర

విష్ణుకుండినుల భౌగోళిక తెలంగాణ మూలాలపై బి.ఎన్‌.శాస్త్రి విస్తృత పరిశోధనలు చేశారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా లభించిన విష్ణుకుండినుల నాణాలు, వారు నిర్మించిన రామలింగేశ్వర స్వామి దేవాలయాలు వారి తెలంగాణ స్థానికతకు సాక్ష్యాలు. విష్ణుకుండినుల పరిపాలన కృష్ణానదీ పరివాహక ప్రాంతమైన మునులూరు కోట నుంచి ఆరంభమైంది. ఇంద్రవర్మ లేదా మహారాజేంద్ర వర్మ ఈ రాజ్యస్థాపకుడు. ఇంద్రపాల నగరం(ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా తుమ్మలగూడెం) కేంద్రంగా పాలించాడు. ఇతను రామతీర్థ శాసనాన్ని వేయించాడు. ఇంద్రవర్మ తరువాత అతని కుమారుడు మొదటి మాధవ వర్మ రాజయ్యాడు. ఇతనే ఉండవల్లి, భైరవకోన, మొగల్‌రాజపురం గుహలను చెక్కించాడు. అయితే రాజ్యవిస్తరణ ప్రధానంగా గోవింద వర్మ కాలంలో జరిగింది. కృష్ణానదీ తీరం నుంచి గోదావరి తీరంవరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని కాలంలోనే తీరాంధ్ర వరకు రాజ్య విస్తరణ జరిగింది. ఆంధ్ర రాజులు శాలంకాయనులను ఓడించాడు. పల్లవుల రాజ్య విస్తరణను గోవిందవర్మ ఆపగలిగాడు. ఈయన భార్య మహాదేవి బౌద్ద విహారాల స్థాపకురాలు. ఈమె ఇంద్రపురిలో ‘చాతుర్దదశార్య సంఘ బిక్షువు’ల కోసం మహా విహారాన్ని నిర్మించింది. దీని పోషణ కోసం మోత్కూర్‌ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను దత్తతగా ఇచ్చారు. మొదటి గోవిందవర్మ వేయించిన ‘ఇంద్రపాలనగర తామ్ర శాసనం’ తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం. హైదరాబాద్‌ ‘చైతన్యపురి’లో వేయించిన శాసనం తెలంగాణలో లభించిన తొలి ప్రాకృత శాసనం. విష్ణుకుండినుల మొత్తం వంశంలో రెండో మాధవ వర్మ గొప్పవాడు. ఇతను వైదిక మత అభిమాని. పదకొండు అశ్వమేథాలతోపాటు,  రాజసూయ, వాజపేయ వంటి వేయి ఇతర క్రతువులు నిర్వహించాడు. హైదరాబాద్‌కు సమీపంలోని కీసరలో పురుషమేథం అనే యజ్ఞాన్ని నిర్వహించాడు. రెండో మాధవవర్మ వాకాటక చక్రవర్తి రెండో పృధ్వీసేనుడిని ఓడించి ఆయన రాకుమార్తె మహాదేవిని పెళ్లి చేసుకున్నాడు(మహాదేవిని పెళ్లిచేసుకున్న తరవాత బౌద్దాన్ని వదిలి వైదిక మతాన్ని స్వీకరించాడు). వాకాటకులతో వైవాహిక బంధాల కారణంగా వారి ఆర్థిక, సైనిక సహకారం లభించాయి. ఫలితంగా విష్ణుకుండినుల రాజ్యం సామ్రాజ్యపు దిశను చేరింది. నర్మద తీరం ఉత్తర సరిహద్దుగా, తమిళ దేశం దక్షిణ సరిహద్దుగా మారింది. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ వీరి ఆధీనంలోకి వచ్చాయి. విశాల రాజ్యాన్ని వ్యవస్థీకరించుకునే క్రమంలో భాగంగా ఆంధ్రలోని అమరావతి(విజయవాడ), దెందులూరు తరవాతి కాలంలో రాజధానులుగా మార్పు చెందాయి. ఇంద్రపాల నగరంలోని అమరేశ్వరాలయం, రామేశ్వరాలయం, మలిఖార్జునాలయం, నల్లగొండజిల్లా చెర్వుగట్టులోని జడల రామలింగేశ్వరాలయం, షాద్‌నగర్‌ సమీపంలోని ఉత్తర రాజలింగేశ్వరాలయం, పులిగిళ్లలోని రామలింగేశ్వరాలయం రెండో మాధవవర్మ కాలంలో నిర్మితమయ్యాయి. మాధవ వర్మకు  మొదటి రాణి ద్వారా దేవవర్మ అనే కుమారుడు కలగగా, వాకాటక రాకుమారి మహాదేవి ద్వారా విక్రమేంద్ర వర్మ అనే కుమారుడు పుట్టాడు. తరవాత కాలంలో ఈ ఇరువురి వారసుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. అయితే దేవవర్మ వారసులు కొద్ది కాలం రాజ్యం చేసినప్పటికీ విక్రమేంద్ర వర్మ వారసులే ఎక్కువ కాలం అధికారాన్ని కొనసాగించారు. 


రెండో మాధవ వర్మ తరువాత దేవవర్మ, ఆ తరవాత దేవవర్మ కుమారుడు మూడో మాధవ వర్మ అధికారంలోకి వచ్చాడు. ఇతనికి ‘జనాశ్రయ’, ‘అవిసిత వివిధ దివ్య’ అనే బిరుదులు ఉన్నాయి. ఉత్తర భారతాన్ని పాలించిన హర్షుడి సమకాలీకుడు మూడో దేవవర్మ. 


మూడో దేవవర్మ తరవాతి కాలంలో రాజైన ఇంద్ర భట్టారకవర్మ అనేక ఘటకాస్థానాలను(హిందూ విద్యాకేంద్రాలు) నెలకొల్పాడు. ప్రస్తుత మేడ్చెల్‌ మల్కాజిగిరి(పాత రంగారెడ్డి)జిల్లా ఘట్‌కేసర్‌ అలాంటి ఒక ఘటకస్థానమే(విద్యాకేంద్రమే). ఇతనికి ‘సత్యాశ్రయుడు’ అనే బిరుదు కూడా ఉంది. ఇతని 

తరవాత విక్రమేంద్ర భట్టారక వర్మ ఆ తరవాత రెండో గోవింద వర్మ అతని తరవాత నాలుగో మాధవ వర్మ అధికారంలోకి వచ్చాడు. ఇతను మంచి పరిపాలనవేత్తగా గుర్తింపు పొందాడు. నాలుగో మాధవ వర్మ బిరుదు జనాశ్రయుడు. 


విష్ణుకుండినులపై ఎక్కువ పరిశోధనలు నిర్వహించిన బి.ఎన్‌.శాస్త్రి అభిప్రాయాన్ని అనుసరించి...మంచన భట్టారకుడు ఈ వంశంలో చివరి రాజు. క్రీ.శ. 624 వరకు పరిపాలనలో ఉన్నాడు. మంచన భట్టారకుడు మూడో మాధవ వర్మ కుమారుడు. పెద్దగా సమర్ధుడు కాకపోవడం వల్ల చాళుక్యులు తీరాంధ్రను జయించి వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు. చివరకు వీరిని బాదామీ చాళుక్యులు జయించారు.


విష్ణుకుండినులు తమ పరిపాలనలో మౌర్య, గుప్త రాజుల పాలన విధానాన్నే అనుసరించారు. పరిపాలన కోసం రాజ్యాన్ని ‘విభాగాలు’గా వర్గీకరించారు. ఉన్నతస్థాయి సైనికాధికారులను మహాతలవరులు, మహాసేనానిగా పిలిచేవారు. పరిపాలనాధికారులు రాష్ట్రాధికారులుగా, విషయాధికారులుగా గుర్తింపు పొందారు. రాజు సొంత సైన్యాన్ని కలిగి ఉండేవాడు. రాజు పాలనాధికారిగా, న్యాయాధికారిగా ఉన్నత స్థానంలో ఉండేవాడు.


ఆర్థిక స్థితిగతులు

భూమిపై పన్ను ప్రధాన ఆధారం. రాజ్య ఆదాయం దీనిపై ఎక్కువగా ఆధారపడి ఉండేది. అడవులను నరికి వ్యవసాయాన్ని విస్తరించారు. ప్రజలపై పన్నుల భారం అధికం. విదేశీ వాణిజ్యం పరిమితంగా జరిగేది. శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంతో పోల్చితే వీరి కాలంలో విదేశీ వర్తకం తగ్గిందనే చెప్పవచ్చు. అయితే గ్రామాలు స్వయం ఆర్థిక వ్యవస్థలుగా మారాయి. నాణాల వాడకం పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా లభ్యమైన విష్ణుకుండినుల నాణాలు దీనికి నిదర్శనం.


సాంఘిక- సాంస్కృతిక స్థితిగతులు

విష్ణుకుండినుల అధికారానికి ముందు సముద్రగుప్తుని దండయాత్రలు దక్షిణ పథం వైపు జరిగి వైదికమత పునరుద్ధరణ అయ్యింది. విష్ణుకుండినులపై వీరి ప్రభావం ఎక్కువ. వైదిక మతానికి ప్రోత్సాహం లభించింది. శైవం, వైష్ణవం మధ్య సమన్వయం కోసం రాజులు ప్రయత్నాలు చేశారు. ఆలయ నిర్మాణాలకు ఎక్కువగా దానం చేశారు. మరోవైపు విష్ణుకుండినుల తొలితరం రాజులు బౌద్దమతాన్ని ప్రోత్సహించారు. మహాయాన బౌద్దానికి ఎక్కువగా ఆదరణ లభించింది. బౌద్ద విగ్రహారాధన ప్రాభల్యంలో ఉండేది.


అయితే క్రమంగా బౌద్దం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రాకృత భాష ప్రాధాన్యం తగ్గిపోయి సంస్కృతం దాని స్థానాన్ని ఆక్రమించింది. ఈ భాషకు రాజు ఆదరణ దక్కింది. అయితే వ్యవహారిక భాషగా తెలుగు స్థిరపడింది. కానీ, రాజ భాష లేదా పండిత భాష స్థానానికి తెలుగు చేరుకోలేకపోయింది. 


వర్ణ ధర్మం, కుల ధర్మంగా స్థిరపడింది. వృత్తుల వర్గీకరణ నిర్దుష్ట రూపాన్ని సంతరించుకుంది. వృత్తి సంఘాల నిర్మాణం ఉన్నట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. వైదిక క్రతు కాండలకు రెండో మాధవ వర్మ అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. పక్షపాతం లేకుండా న్యాయం అందించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ధర్మ, న్యాయ, సమానత్వం కోసం తన సొంత కొడుకునే శిక్షించినట్లుగా పేర్కొన్నారు. విష్ణుకుండినుల నిర్మాణ ప్రాముఖ్యం గుహాలయాలు. వీటీని కొండపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో చూడవచ్చు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం బౌద్ద స్థూపాలతో పాటుగా, రామలింగేశ్వర స్వామి దేవాలయాలను విరివిగా నిర్మించారు. దేవాలయాల నిర్మాణంలో ఇక్ష్వాకుల శైలిని అనుసరించారు.


ముగింపు

కాకతీయులు కొన్ని సందర్భాల్లో తాము మాధవ వర్మ వారసులుగా చెప్పుకున్నారు. దీనిని బట్టి వీరి ప్రాభల్యం తదుపరి పరిపాలకులను సైతం ప్రభావితం చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థులు విష్ణుకుండినుల రాజకీయ ఎదుగుదల క్రమాన్ని గుర్తించగలగాలి. వీరి పరిపాలన విధానాన్ని అంచనా వేసి నోట్స్‌ రాసుకోవాలి. ప్రధానంగా దక్షిణ భారతదేశంపై గుప్తుల దండయాత్రల ప్రభావాన్ని అవగతం చేసుకోవాలి. వీరి కాలం నుంచే ఉత్తర - దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఏకీకరణ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయనే విషయాన్ని గ్రహించగలగాలి. శాతవాహన, ఇక్ష్వాకుల కాలానికి, కాకతీయుల కాలానికి సంధియుగ నిర్మాతలుగా విష్ణుకుండినులను అవగతం చేసుకోవాలి. -డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ 

డైరెక్టర్‌, 5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌


Tags :