బీసీ గురుకులాల్లోనే 450 జూనియర్ అసిస్టెంట్లు
బోధన సిబ్బందితో కలిపితే పది వేలకు పైనే
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో మరో వెయ్యి పోస్టులు భర్తీ కానున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పోస్టుల్ని నోటిఫై చేసిన ప్రభుత్వం త్వరలో ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీచేసి భర్తీ ప్రక్రియ చేపడతారు. బీసీ గురుకులాల్లోనే అత్యధికంగా 450 పోస్టులు ఉన్నాయి. ఈ సొసైటీల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు కూడా ఉన్నాయి. అయితే, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేసి, నిర్ణీత కాలవ్యవధి తర్వాత సీనియార్టీ, రిజర్వేషన్ ఆధారంగా వారికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. గురుకుల సొసైటీల్లో 9,096 బోధనా సిబ్బంది నియామకాలకు ఆర్థికశాఖ ఇదివరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో కలిపితే గురుకులాల్లో భర్తీ కానున్న పోస్టుల సంఖ్య పది వేలు దాటిపోతుంది.