ఏపీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు
ఆ వివరాలు సమర్పించాలని ఆదేశం
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్ల విచారణ
ఇంటర్వ్యూ ఫలితాల ప్రకటనను ఆపండి
ధర్మాసనం ఎదుట అప్పీలుదారుల అభ్యర్థన
ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను కొనసాగించుకోవచ్చని సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఇంటర్వ్యూలో ఎంపిక కాబోతున్న అభ్యర్థులకు పోస్టిం గ్ ఇచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? తదితర వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయం టూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతి ఇచ్చారు. అయితే కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి అభ్యర్థుల ఎంపిక ఫలితాలు ఉంటాయని ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మాన్యువల్ మూల్యాంకనంలో అర్హత సాధించని కొందరు అభ్యర్థులు ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు అప్పీళ్లు వేయగా, బుధవారం విచారణకు వచ్చాయి. అప్పీలుదారుల తరఫున సీనియర్ న్యాయదులు బి.ఆదినారాయణరావు, జంధ్యాల రవిశంకర్, ఎ.సత్యప్రసాద్, కేఎ్‌స.మూర్తి, న్యాయవాది కంభంపాటి రమే్‌షబాబు వాదనలు వినిపించారు. ‘‘జవాబుపత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసినప్పుడు 326 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు తిరిగి మ్యాన్యువల్ విధానంలో(చేతితో) దిద్దినప్పుడు ఆ 326 మందిలో 202మంది(62 శాతం) ఇంటర్వ్యూకు అర్హత సాధించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థులు డిజిటల్ మూల్యాంకనంలో 42శాతం మంది అర్హత సాధిస్తే, మాన్యువల్ మూల్యాంకనంలో వారి సంఖ్య 10 శాతం లోపే ఉంది. డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లు తయారు చేసి జవాబు పత్రాలకు జతచేశారు. అందుకోసం డేటా టెక్ సంస్థకు రూ.8లక్షలు చెల్లించారు. సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన తరువాత గతేడాది డిసెంబరులో మ్యాన్యువల్ విధానంలో ఓసారి జవాబుపత్రాలను దిద్దారు. ఆ ఫలితాలు ప్రకటించకుండా తొక్కిపెట్టి ప్రస్తుత చైర్మన్ నియామకం తరువాత ఏపీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి జవాబుపత్రాలను మూల్యాంకనం చేయించింది. అనర్హులతో జవాబుపత్రాలను మూల్యాంకనం చేయించారు. వాటి మూల్యాంకనానికి 3-4 నెలలు పడుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. కానీ, 35 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేశారు. ఒకే జవాబుపత్రంలో భిన్నమైన చేతిరాతలున్నట్లు మూల్యాంకనం చేసినవారు గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. నచ్చిన వారిని ఎంపిక చేసుకొనేందుకే ఏపీపీఎస్సీ అక్రమాలకు పాల్పడింది. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు ఎంపికైన 326 మంది, మాన్యువల్ మూల్యాంకనంలో ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలను కోర్టు ముందుంచేలా ఆదేశించండి. ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఫలితాలు ప్రకటించకుండా ఏపీపీఎస్సీని నిలువరించండి. రిట్ పిటిషన్లపై తుది విచారణకు ఆదేశించండి’’ అని కోరారు.
కోర్టుముందు ఉంచేందుకు సిద్ధం..
ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ‘‘హైకోర్టు ఆదేశాల మేరకు నిబంధనలకు లోబడి మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేశాం. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకా రం అభ్యర్థులు రీకౌంటింగ్ కోరడానికి వీలుంది. కానీ, రీవ్యాల్యుయేషన్ కోరడానికి వీల్లేదు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మూల్యాంకనం జరిగింది. 2021 డిసెంబరులో ఎలాంటి మాన్యువల్ మూల్యాంకనమూ జరగలేదు. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనేది ఆరోపణ మాత్రమే. జవాబుపత్రాలు కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంటర్వ్యూలు ఈనెల 29తో ముగుస్తాయి. ఎంపిక ప్రక్రియ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొనసాగించండి’ అని కోరారు. దీంతో ఇంటర్వ్యూ తరువాత ఫలితాలు ప్రకటించకుండా నిలువరించడం, ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా నిలుపుదల చేయడం వల్ల ఉత్పన్నమయ్చే పరిస్థితులుపై ధర్మాసనం ఆరా తీసింది. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది.