Education-Article
పరస్పర బదిలీలకు సగం మంది వెనకడుగు!

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): సీనియారిటీని వదులుకోవాలన్న నిబంధన కారణంగా పరస్పర బదిలీల విషయంలో సగం మంది టీచర్లు వెనకడుగు వేశారు. ఈ నిబంధనను అంగీకరిస్తూ అండర్‌టేకింగ్‌ ఇచ్చిన 2,558 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. మరో 90 మందికి బదిలీ ఉత్తర్వులను జారీచేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. బదిలీ అయిన టీచర్లు నేడు (బుధవారం) కొత్త పోస్టింగ్‌లో చేరాలి. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అండర్‌టేకింగ్‌ ఇచ్చినవారిని మాత్రమే ప్రస్తుతం బదిలీ చేస్తున్నారు. మరోవైపు... అండర్‌టేకింగ్‌ ఇచ్చిన కొంతమంది పేర్లు గల్లంతైనట్టు ఉపాధ్యాయ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. జనగామ జిల్లాలో 106 మంది ఉపాధ్యాయులు పరస్పర బదిలీలను కోరుకుంటే... అందులో 45 మంది పేర్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ఇలా పలు జిల్లాల్లో బదిలీ కావాల్సినవారి పేర్లు కనిపించడం లేదంటున్నారు. కాగా, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలపై కసరత్తు మొదలైంది. కోర్టు కేసులున్న నేపథ్యంలో పదోన్నతులను పక్కన పెట్టి, కేవలం ఉపాధ్యాయుల బదిలీలను మాత్రమే చేపడితే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు సమాచారం. 

Tags :