Education-Article
రేణుక యల్లమ్మ తిరుణాల ప్రారంభం
తిరుణాలకు ముస్తాబైన రేణుక యల్లమ్మ దేవాలయం

రెండేళ్ల తర్వాత ఘనంగా ఏర్పాట్లు

గాలివీడు, మే 30: మండలంలోని నూలివీడు పంచాయతీ నాగూరివాండ్లపల్లె సమీపంలో వెలసిన రేణుక యల్లమ్మ భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం మొలకల పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్య రోజున పుట్టను పూజించడంతో అమ్మవారి తిరుణాల ప్రారంభమవుతుంది. నాగూరువాండ్లపల్లెలో ఉన్న అమ్మవారిని ఊరేగింపుగా గుడి దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ నుంచి ఊరేగింపుగా నూలివీడులోని స్వామి వారి ఇంటి దగ్గర వడియాలు కట్టించుకున్న అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి గ్రామంలోని వివిధ పల్లెల్లో అమ్మవారిని ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని బుధవారం ఉదయానికి సమీపంలోని గుడికి తీసుకువెళ్తారు. ఆ రోజు రాత్రికి అమ్మవారికి భక్తాదులు చాందినీ బండ్లు నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి కోలాటాలు, చెక్కభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక బోనాలు, సాయంత్రం గుడికి సమీపంలోని బావి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిచండంతో తిరుణాల ముగియనుంది. రెండు సంవత్సరాల తర్వాత అమ్మవారి తిరుణాలను ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పూజలందుకుంటున్న అమ్మవారు


Tags :