Education-Article
స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి: లోకేశ్‌

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం వద్దు

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులతో చర్చ


అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఈ నెల 17నే సీఎం జగన్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. అయినప్పటికీ.. అనాలోచితంగా పాఠశాలలు ప్రారంభించారని విమర్శించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరిచామని విద్యాశాఖ మంత్రి చెబుతున్నదానికి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేదని లోకేశ్‌ తెలిపారు. ఏపీలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులతో మంగళవారం ఆయన జూమ్‌ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే సెలవులు ప్రకటించాలని, లేకుంటే టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నేతృత్వంలో ఉద్యమిస్తామని చెప్పారు. మరోవైపు ఎంబీబీఎస్‌ పరీక్షలు నిర్వహిస్తామని హెల్త్‌ యూనివర్సిటీ పట్టుదలగా వ్యవహరించడం సరికాదన్నారు.  ఈ నెల 28 నుంచి నిర్వహించతలపెట్టిన ఎంబీబీఎస్‌ పరీక్షలన వాయిదా వేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. 

Tags :