Education-Article
ట్రబుల్స్‌లో ట్రైబల్‌ వర్సిటీ

ఏళ్లు గడుస్తున్నా నెరవేరని విభజన హామీ

భూ కేటాయింపులో జాప్యం వల్లేనంటున్న కేంద్రం

మాట తప్పింది కేంద్రమేనని ఆరోపిస్తున్న తెలంగాణ

తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం లేఖ

తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న తరగతులు


హైదరాబాద్‌ జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన గిరిజన యూనివర్సిటీ.. ప్రతిపాదనలకే పరిమితమైంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితమే ట్రైబల్‌ యూనివర్సిటీ అందుబాటులోకి రాగా.. తెలంగాణలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. 2022-23 విద్యా సంవత్సరంలోనైనా తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలంటూ తాజాగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది.


ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగానే రెండు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీల ఏర్పాటు ఒకేసారి మొదలు కాలేదని స్వయంగా కేంద్రమే వెల్లడించింది. గత నవంబరు 29న పార్లమెంట్‌కు కేంద్ర విద్యా శాఖ అందజేసిన సమాధానంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అవసరమైన స్థలాన్ని సరైన సమయానికి సమకూర్చకపోవడం వల్లే తెలంగాణలో గిరిజన వర్సిటీ అంశం ఆలస్యమైందని పేర్కొంది. సైట్‌ సెలక్షన్‌ కమిటీ ఆమోదించిన తర్వాత డీపీఆర్‌ రూపొందించి, సంబంధిత ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగానికి చేరినట్లు పేర్కొంది.


అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కేంద్రం అడిగినప్పుడే స్థలాన్ని కేటాయించామని, స్వయంగా కేంద్ర మంత్రే పరిశీలించి.. తరగతుల నిర్వహణకు అనుమతులిస్తామని చెప్పి.. ఆ తర్వాత మాట మార్చారని ఆరోపిస్తోంది. ఏపీలో అద్దె భవనాలున్నప్పటికీ తరగతులకు అనుమతులు ఇచ్చారని, తాము ప్రభుత్వ భవనం కేటాయిస్తామన్నా పట్టించుకోలేదని చెబుతోంది.


స్థల కేటాయింపు ఇలా...

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట వేర్వేరు ప్రాంతాల్లో భూమిని ప్రతిపాదించినా... చివరగా భూపాలపల్లి జిల్లా(ప్రస్తుతం ములుగు జిల్లా)లో 335.09 ఎకరాలు కేటాయించింది. అందులో 169.35 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 115.09 ఎకరాలు అసైన్డ్‌ భూమి, 50.12 ఎకరాలు అటవీ శాఖకు చెందినది. 2018 డిసెంబరులోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ స్థలాన్ని సందర్శించారు. 2019-20 విద్యా సంవత్సరంలో వర్సిటీని ప్రారంభిస్తామని టైం లైన్‌ ప్రకటించారు.


దీంతో యూనివర్సిటీ నిర్వహణ కోసం సమీపంలో ఉన్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఆ తర్వాత ఏమైందో... ఏమో గానీ తరగతులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 2020లో ఒక సారి, 2021లో రెండు సార్లు లేఖలు రాసింది. మంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ వర్సిటీ అంశం గుర్తు చేసి వినతిపత్రాలు సమర్పించినా... ఫలితం మాత్రం దక్కలేదు.


ఏపీలో ఇదీ పరిస్థితి...

ప్రధాని మోదీ అధ్యక్షతన 2018లో సమావేశమైన కేంద్ర కేబినెట్‌.. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని రెల్లి గ్రామంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు తొలిదశలో రూ.400 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, యూనివర్సిటీని మరో ప్రాంతానికి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తేవడంతో యూనివర్సిటీ ఏర్పాటు అంశం నెమ్మదించింది.


ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని గజపతి నగరం, సాలూరు నియోజకవర్గాల మధ్యలో 561 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అద్దె భవనాల్లోనే 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలు పూర్తి చేశారు. వీసీతోపాటు గెస్ట్‌ ఫ్యాకల్టీ, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌లో నియమించారు. స్థల వివాదం కారణంగా కేంద్రం నుంచి ఇప్పటి వరకు పెద్దగా నిధులు రాలేదు. సిబ్బంది వేతనాల చెల్లింపునకు మాత్రమే కేంద్రం నామమాత్రపు నిధులు విడుదల చేసింది.


అనుమతులు ఆలస్యమైతే కష్టమే..

2022-23 విద్యా సంవత్సరంలోనైనా గిరిజన వర్సిటీని అందుబాటులోకి తీసుకురావాలని, సంబంధిత తరగతులు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని జనవరి 10న మంత్రి సత్యవతి రాథోడ్‌.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు లేఖ రాశారు. అయితే, ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి అనుమతులు లభిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


కేంద్రం నుంచి అనుమతులు ఆలస్యమైతే.. 

ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉపయోగం ఉండదన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో అడ్మిషన్ల ప్రక్రియ వచ్చే రెండు, మూడు నెలల్లో ప్రారంభం కానుంది. అన్ని రకాల ప్రవేశాలు పూర్తయిన తర్వాత కొత్తగా గిరిజన వర్సిటీ అడ్మిషన్లు చేపడితే.. విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన ఉండదని, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఆమోదం తెలిపితే మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :