Education-Article
7 నెలలుగా ఆగని చదువులు

సతారా, జనవరి 23: కరోనా మహమ్మారి విజృంభనతో దాదాపు రెండేళ్లుగా విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో తెరచుకోవడం లేదు. చాలా వరకు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌ బోధననే కొనసాగిస్తున్నాయి. మహారాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత డిసెంబరు 1న పాఠశాలలను తెరచుకున్నాయి. అయితే, ఇదే రాష్ట్రంలోని సతారా జిల్లాలో ఓ పాఠశాల ఏడు నెలలుగా నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. జిల్లాలోని మారుమూల పల్లెలో ఉన్న ఈ ఏకోపాధ్యాయ బడిలో టీచర్‌ బాలాజీ జాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు.. సుమారు 38 మంది విద్యార్థులకు వరండాలో, పాఠశాల ఆవరణలోని చెట్టు కింద చదువు చెబుతున్నారు. మరోవైపు, విద్యార్థులూ క్రమం తప్పకుండా వస్తున్నారు. తమ బడికి వచ్చే పిల్లల్లో చాలా మంది సంచార జాతులకు చెందిన వారు ఉన్నారని, అందువల్ల వారికి ప్రత్యక్షంగా పాఠాలు బోధించాలని నిర్ణయించామని టీచర్‌ బాలాజీ జాదవ్‌ తెలిపారు. ఈయన ఇప్పటికే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో పాటు ఇన్నోవేటివ్‌ టీచర్‌ అవార్డును అందుకున్నారు.

Tags :