ప్రైవేటు పాఠశాలల్లో తగ్గిన హాజరు
కేసులను దాచేస్తున్న యాజమాన్యాలు
పరీక్షలు నిర్వహిస్తే కేసులు వెలుగులోకి!
కరోనా థర్డ్ వేవ్ చుట్టుముట్టేస్తోంది. రోజురోజుకూ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వల్ల ప్రాణభయం లేనప్పటికీ.. అది రూపం మార్చుకుంటే ప్రమాదమేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా సెలవులను పొడిగించాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నా, ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీంతో భయం భయంగానే విద్యార్థులు విద్యాలయాలకు వెళుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా వైరస్ సోకింది. అయినప్పటికీ ఆయన పాఠశాలకు వచ్చి మొత్తం కలియదిరగడం ద్వారా వైరస్ వ్యాప్తికి కారకులయ్యారంటూ స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య సోమవారం జిల్లా, మండల విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధాయుడి ద్వారా పిల్లలు, వారి ద్యారా వందల కుటుంబాలు కరోనా బారినపడే ప్రమాదముందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో డీఈవో స్పందించారు. ఆ పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. తరచి చూడాలేగానీ, ఇలాంటి పరిస్థితులు జిల్లా అంతటా కనిపిస్తాయి.