Education-Article
317 జీవో వద్దనడం నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దనడమే

బీజేపీ నేతలవి సోయి లేని మాటలు

కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీనైనా ఎందుకివ్వలేదో  చెప్పాలి: హరీశ్‌ 

రెండు కోట్ల ఉద్యోగాలే ఏమయ్యాయి?:శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘317 జీవో వద్దనడం అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దనడమే. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ 317 జీవో తెచ్చారు. ఈ జీవో ప్రకారం ఉద్యోగులు ఏ జిల్లా వారు ఆ జిల్లాలకు వెళితే, మిగిలిన ఖాళీలను గుర్తించి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తుంటే, సోయిలేని బీజేపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు’’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. ప్రధాని, రాష్ట్రపతి ఆమోదించాకే ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులొస్తాయన్న సోయి కూడా లేకపోతే ఎలా? కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానినే వారు నిందిస్తున్నట్లు లెక్క అని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌, కోయిల్‌కొండల్లో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం హరీశ్‌ ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక 1.35 లక్షల ఉద్యోగాలు భ ర్తీ చేశామని, జిల్లాల కేటాయింపుల తర్వాత 70 వేల ఖాళీలు ఏర్పడతాయని, వాటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పేదలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడుతోన్న బీజేపీ నేతలు కేంద్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.


తెలంగాణకు కేంద్రం ఒక్క పథకాన్నయినా ఇవ్వడంలేదని, ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసిందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 177 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒక్కటీ ఎందుకివ్వలేదని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదో కేంద్రాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు నిలదీయాలని సూచించారు. ఎరువుల ధరలు పెంచారని, డీజిల్‌ ధరలు పెంచుతూ పోతున్నారని, దీంతో వ్యవసాయం భారమవుతోందని వివరించారు. ప్రభుత్వ వైద్యసేవల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్‌ చెప్పిందన్నారు. యూపీ చివరి స్థానంలో ఉండటం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని దౌర్భాగ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.


వైరస్‌ బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలి 
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒమైక్రాన్‌ను తట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి హరీశ్‌ వెల్లడించారు.  వైరస్‌ బాధితులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి సేవలు పొందాలని సూచించారు. శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో నల్లధనం వెనక్కి తెస్తానని, దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ వైపు దేశం చూస్తోందని, ఆయన నాయకత్వాన్ని పొరుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
Tags :