వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లలో షురూ
1వ తరగతికి ముందు కొంతకాలం ప్రత్యేక తరగతి!
తెలుగు మీడియం మాత్రం తప్పనిసరి
ఉన్న టీచర్లకు శిక్షణ, కొత్తవారి నియామకం
కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలే కీలకం
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినా.. తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉండనుంది! అలాగే.. వచ్చే ఏడాదినుంచి రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో దీని అమలుపై విద్యా శాఖ అధికారుల్లో చర్చలు మొదలయ్యాయి. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినా.. తెలుగు మీడియం తరగతులు కూడా అందుబాటులో ఉంచాల్సిందేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మాతృభాషలో విద్యాబోధనపై కేంద్రంతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని నూతన విద్యా విధానంలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియం క్లాసులను కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో సుమారు 26 వేల పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు వచ్చే ఏడాది నుంచి ఆ బడులన్నింటిలో ఒకేసారి ప్రారంభించాల్సి ఉంది. మొదటి ఏడాది ఒకటో తరగతి, తర్వాత సంవత్సరం రెండవ తరగతి, ఇలా రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ల కాలంలో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియం అమలులోకి వచ్చే వీలుంది. ఏ మీడియంలో చేరాలనే నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులదే. కాగా సక్సెస్ స్కూళ్ల పేరిట ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 8 వేల స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో 6 వేలదాకా ప్రైమరీ స్కూళ్లు ఉండగా, మిగతావి హైస్కూళ్లు. అయితే... సక్సెస్ స్కూల్ విధానంలో 6వ తరగతి నుంచి మాత్రమే ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. కింది తరగతులకు ఈ అవకాశం లేదు.