Education-Article
టెక్‌లో ఉద్యోగ నియామకాల జోరు.. 2022 ట్రెండింగ్‌ కోర్సులు ఇలా..!

టెక్‌ ఆధారిత ఉద్యోగ నియామకాల జోరు 2022 లోనూ కొనసాగునుందని మాస్టర్‌ డాట్‌ కామ్‌ తాజా నివేదికలో అంచనా వేసింది. ఇలాంటివే చాలా నివేదికలు టెక్‌ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను పరోక్షంగా తెలియజేస్తున్నాయి. కొవిడ్‌ సహా మరేవీ ఈ దిశగా జరుగుతున్న పురోభివృద్ధికి ఆటంకం కాబోవని పదేపదే స్పష్టమవుతోంది. వాస్తవానికి కాలంతో పోటీపడితేనే మనుగడ, అలాగే ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్‌ను పరిశీలిస్తే టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ నుంచి కింది స్థాయిలో ఉన్న  కాలేజీల్లో సీఎస్‌ఈ తదితర ఐటీ సంబంధిత కోర్సులకు ఉన్న డిమాండ్‌ కూడా అవగతమవుతుంది. ఈ నేపథ్యంలో  టెక్నాలజీ పరంగా ఈ ఏడాది ఎంచుకోదగ్గ కోర్సులు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పిఎ)

ఎఐ, మెషీన్‌ లెర్నింగ్‌ మాదిరిగానే ఆర్‌పిఎ కూడా మరో టెక్నాలజీ. జాబ్స్‌ ఆటోమేటింగ్‌కు దోహదపడుతుంది. వివిధ సాంకేతిక అప్లికేషన్స్‌ ఇంట్రప్రెటేషన్‌, ప్రాసెసింగ్‌ ట్రాన్సాక్షన్స్‌, డేటా డీలింగ్‌ ఉంటాయి. ప్రజలు పదేపదే చేసే పనులను రిపీట్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీని ప్రభావం ఇప్పుడున్న వర్క్‌ఫోర్స్‌లో తొమ్మిది శాతంపై చూపనుందని ఫారెస్టర్‌ రీసెర్చ్‌ ఎన్నడో అంచనా వేసింది. మెకన్సే పరిశీలన ప్రకారం కనీసం అయిదు శాతం ఉద్యోగాలు ఈ టెక్నాలజీతో ఆటోమేషన్‌కు గురికానున్నాయి. డెవలపర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సహా పలు ఉద్యోగాలు ఈ సాంకేతికత ఆధారంగా లభిస్తాయి. 

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఒటి)

ఈ రోజుల్లో చాలా విషయాలు వైఫైతో అంటే ఇంటర్నెట్‌తో అనుసంధానం కలిగి ఉంటున్నాయి. నెట్‌ సహాయంతో పనులు చేయడం అంతా దీని పరిధిలోకి వస్తుంది. ఇంట్లో ఉపయోగించే పరికరాలు మొదలుకుని కారు నడపడం తదితరాల వరకు వినియోగం నెట్‌ సహకారంతోనే జరగడం ఊపందుకుంటే ఐఒటి ప్రాధాన్యం మరింతగా పెరుగుతుంది. రాబోయే పదేళ్ళలో  50 బిలియన్‌ డాలర్ల మేర ఐఒటి సంబంధ పరికరాలే వినియోగంలో ఉంటాయని అంచనా. 

5జి

ఐఒటిని అనుసరించే మరో సాంకేతికత 5జి. బ్రాండ్‌విడ్త్‌ పెంపుతో యూట్యూబ్‌ వీక్షణ మొదలుకుని వివిధ అవసరాల్లో 5జి సర్వీసుతో మన జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. వెరిజాన్‌, టిమొబైల్‌, ఆపిల్‌, నోకియా కార్పొరేషన్‌, క్వాల్‌కామ్‌ తదితరాలు 5జి అప్లికేషన్స్‌పైనే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ముప్పయ్‌ దేశాల్లో యాభై మంది ఆపరేటర్లతో 5జి సర్వీసులు ఆరంభం  కానున్నాయి. హైదరాబాద్‌ సహా పదమూడు నగరాల్లో 5జి నెట్‌వర్క్‌ను పెంచేందుకు చురుకుగా చర్యలు తీసుకుంటున్నారు. 

ఎడ్జ్‌ కంప్యూటింగ్‌

ఇంతకుమునుపు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేది. ఎడబ్యుఎస్‌, మైక్రోసాప్ట్‌ అజ్యూర్‌, గూగుల్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫారం కలగలసి మార్కెట్‌ను ఆక్రమించుకునేవి. ఈ ట్రెండ్‌ ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. అయితే మరిన్ని వ్యాపార కార్యకలాపాలు క్లౌడ్‌ పరిధిలోకి వస్తుండటంతో  అందులోని లోపాలను సవరించుకునేందుకు లేదా సమస్యల పరిష్కారం కోసం ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ అవసరమవుతోంది. మినీ డేటా సెంటర్‌గా ఇది పనిచేస్తుంది.  రాబోయే రెండేళ్ళలో దీని మార్కెట్‌ 6.72 బిలియన్లు కానుంది.

వర్చ్యువల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్‌ రియాలటీ

వర్చ్యువల్‌ రియాలిటీ అండ్‌ ఆగ్‌మెంట్‌డ్‌ రియాలిటీ అలాగే ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ అనూహ్యంగా దూసుకువస్తున్న టెక్నాలజీలు. ఇందులో మొదటిది సదరు ప్రక్రియలో పాల్గొనేందుకు, రెండో సాంకేతికత మరింత మంచి అనుభవం పొందేందుకు ఉపకరిస్తాయి. ఉదాహరణకు గేమింగ్‌లో కనిపించేవి ఇవే. నేవీ, ఆర్మీ, కోస్ట్‌గార్డ్‌లో సైతం వర్చ్యువల్‌  షిప్‌లో  సిమ్యులేషన్‌ సాఫ్ట్‌వేర్‌గా శిక్షణకు ఉపయోగపడుతోంది. ఈ ఏడాది మరింతగా ఈ టెక్నాలజీ మన జీవితాలతో మమేకం కానుందని నిపుణులు చెబుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ మార్కెటింగ్‌, పునరావాసం తదితర రంగాల్లోకి జొచ్చుకువస్తోంది. 

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌

గడిచిన దశాబ్ద కాలంలోనే ఈ రెంటికీ ఊపు వచ్చింది. ఇప్పటికీ ఈ రెండూ సరికొత్త టెక్నాలజీలుగానే నిలుస్తున్నాయి. ఇమేజ్‌ అండ్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌, నేవిగేషన్‌ యాప్స్‌, స్మార్ట్‌ఫోన్‌ పర్సనల్‌ అసిస్టెంట్స్‌, రైడ్‌-షేరింగ్‌ యాప్స్‌లో ఎఐ ప్రాధాన్యం తెలిసిందే. వాస్తవిక అంశాలను పరిగణన లోకి తీసుకుని వివిధ నిర్ణయాలను తీసుకోవడంలో ఉపయోగపడుతోంది. దీని మార్కెట్‌ 2025 నాటికి 190 బిలియన్‌ డాలర్లు కానుందని అంచనా వేస్తున్నారు. దీని వ్యాప్తి ఫలితంగా డెవల్‌పమెంట్‌, ప్రోగ్రామింగ్‌, టెస్టింగ్‌, సపోర్ట్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ తదితర విభాగాల్లో పరిశ్రమను అనుసరించి సరికొత్త జాబ్స్‌ ఉనికిలోకి రానున్నాయి. దీనికి సబ్‌సెట్‌గానే మెషీన్‌ లెర్నింగ్‌ ఉంటుంది. ఎఐ, మెషీన్‌ లెర్నింగ్‌ కలిపి ఒక్క యూఎ్‌సలోనే రానున్న అయిదేళ్ళల్లో తొమ్మిది శాతం మేర కొత్త ఉద్యోగాల కల్పనకు వీలుకల్పిస్తాయని భావిస్తున్నారు. గరిష్ఠ వేతనం  కొద్దిగా అటూఇటూగా  మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌కు లక్ష పాతికవేలు, ఎఐ ఆర్కిటెక్ట్‌కు లక్ష నలభై అయిదు వేలు ప్రస్తుతం లభిస్తున్నాయి.

బ్లాక్‌ చైన్‌

బిట్‌కాయిన్‌కే ఇది పరిమితం కాదు. వాస్తవానికి ఇది అనేకానేక విధాలుగా భద్రతను కల్పిస్తుంది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఈ ప్రక్రియలో డేటాను అనుసంధానించడమే తప్ప నిక్షిప్తమైన సమాచారంలో ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసే వీలు ఉండదు. వ్యవహారాల మార్పిడిలో మూడో పార్టీ మీద నమ్మకం ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. పలు పరిశ్రమలు ఈ సాంకేతికను వినియోగించుకుంటున్నాయి. ఇందులో సమర్థంగా పని చేయలంటే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, ఊప్స్‌ ఫండమెంటల్స్‌ తదితరాలపై పట్టు చాలా అవసరం.

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌

గుర్తించదగ్గ మరో సాంకేతికత క్వాంటమ్‌ కంప్యూటింగ్‌. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అలాగే వాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. డేటా ఏదైనా సమన్వయపర్చడం నుంచి విశ్లేషణ, సమర్థ వినియోగం వరకు అన్ని దశల్లో ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాల్లో  పనికొస్తుంది. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లోనూ ఫ్రాడ్‌ను కనిపెట్టేందుకు వాడుకోవచ్చు. రెగ్యులర్‌ కంప్యూటర్లతో పోల్చుకుంటే, క్వాంటమ్‌ కంప్యూటర్లు చాలా రెట్ల వేగంతో పనిచేస్తాయి. 2029 నాటికి దీని మార్కెట్‌ 2.5 బిలియన్‌ డాలర్లను మించుతుందని అంచనా. ఇందులో ఎవరైనా తమదైన గుర్తింపు పొందాలంటే క్వాంటమ్‌ మెకానిక్స్‌, లీనియర్‌ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, ఇన్ఫర్మేషన్‌ థియరీ, మెషీన్‌ లెర్నింగ్‌పై పట్టు సాధించి ఉండాలి.

సైబర్‌ సెక్యూరిటీ

సాఫ్ట్‌వేర్‌ సంబంధ సాంకేతికత పెరుగుదల ఫలితమే సైబర్‌ సెక్యూరిటీ ఉన్నతికి తోడ్పడుతోంది. అనుచితంగా డేటా తస్కరణ, అనైతికంగా హ్యాకింగ్‌ నుంచి రక్షణకు సైబర్‌ సెక్యూరిటీ చాలా అవసరం. ఒకరకంగా సైబర్‌ సెక్యూరిటీ అనేది, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌తో అనుసంధానమై ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఆరంకెల జీతానికి వీలుకల్పించే సాంకేతికతగానూ అభివర్ణించవచ్చు.

Tags :