Education-Article
ఇకపై పక్కాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. బోగస్‌ అని తేలితే కఠిన చర్యలు

20 ఏళ్ల సర్టిఫికెట్లన్నీ డిజిటలైజేషన్‌

ఉన్నత విద్యా మండలి, పోలీసుశాఖ భేటీలో అధికారులు

వర్సిటీలతో కలిసి పనిచేయాలని నిర్ణయం


హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బోగస్‌ సర్టిఫికెట్ల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించి, ప్రతి సర్టిఫికెట్‌ను డిజిలాకర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశ, విదేశాల్లో ఎక్కడైనా సర్టిఫికెట్‌ను వెరిఫై చేసుకోవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు జారీ చేసే ప్రతి సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు ఈ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్‌ చేసుకునే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బోగస్‌ సర్టిఫికెట్ల నియంత్రణ, ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై సోమవారం ఉన్నత విద్యా మండలి కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, డీజీపీ మహేందర్‌రెడ్డి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ, ఉస్మానియా, జేఎన్టీయూ వైస్‌ చాన్సలర్లు కరుణాకర్‌రెడ్డి, రవీందర్‌, కట్టా నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బోగ స్‌ సర్టిఫికెట్ల కట్టడి విషయంలో సీఎం కేసీఆర్‌ సమర్థంగా చ ర్యలు తీసుకోవాలనుకుంటున్నారని డీజీపీ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బోగస్‌ సర్టిఫికెట్లు బయటపడ్డ సమయంలో  వర్సిటీ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

బోగస్‌ సర్టిఫికెట్ల నియంత్రణకు పోలీసు విభాగం కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సర్టిఫికెట్ల డేటాను నవీకరించడానికి, ఆన్‌లైన్‌ ధ్రువీకరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలుగా విశ్వవిద్యాలయాలు సహకరించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి కోరారు. కాగా, సర్టిఫికెట్ల డిజిటలైజేషన్‌పై సమావేశంలో చర్చించారు. ప్రతి సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వాటి వెరిఫికేషన్‌ కూడా సులభం అవుతుందని అంచనా వే శారు. ఇందుకోసం ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  

విదేశీ వర్సిటీల విధానాన్ని పరిశీలించాలిసర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం, వాటి వెరిఫికేషన్‌లో సులువైన పద్ధతిని అమలు చేసే విషయంలో సింగపూర్‌లోని నాన్యాంగ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం వంటి విదేశీ వర్సిటీలు అనుసరిస్తోన్న విధానాన్ని పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. సర్టిఫికెట్ల డిజిటలైజేషన్‌ కోసం అన్ని విశ్వవిద్యాలయాల్లో డిజిలాకర్‌ వాడకాన్ని బలోపేతం చేయాలని అధికారులు అన్నారు. ఇందుకోసం నేషనల్‌ అకడమిక్‌ డిపోజిటరీ (ఎన్‌ఏడీ)తో కలిసి పని చేయాలని, వీలైనంత త్వరగా  డేటాను అప్‌లోడ్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. డేటా ఉత్పత్తి, ఆటోమేటిక్‌ డేటా క్యాప్చర్‌ కోసం రాష్ట్ర స్థాయిలో ఒక సర్వర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల మధ్య డేటా మార్పిడికి ఇది ఉపయోగపడుతుందని అంచనా వేశారు. కాగా, దశల వారీగా సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు. గత 20 సంవత్సరాల నుంచి అమలులో ఉన్న సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో పొందుపరచనున్నారు.
Tags :