Education-Article
విద్య, వైద్యానికి అధిక నిధులివ్వండి.. ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అధిక మొత్తంలో నిధులను కేటాయించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావుకు లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయని, పిల్లలు చెట్ల కింద చదువుకుంటున్న దృశ్యాలు చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని.. డాక్టర్లు, మందులు లేక ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని వివరించారు. ప్రజల బాగోగులతో ముడిపడి ఉన్న ఈ రెండు రంగాలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. రైతుబంధు పథకాన్ని సాగులో ఉన్న 10 ఎకరాలలోపు భూమికి మాత్రమే వర్తింపజేయాలని సూచించారు. 10 కంటే ఎక్కువ హెచ్‌పీ మోటార్లు ఉన్నవారి నుంచి చార్జీలు వసూలు చేయాలన్నారు.  పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని కోరారు.

Tags :