Education-Article
రద్దు చేయలేదు: మంత్రి విశ్వరూప్‌

మరింత మెరుగ్గా అమలు చేస్తాం.. 80% బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి చేస్తున్నాం

ఇక బెస్ట్‌ అవైలబుల్‌ బడులెందుకు?

అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్‌ వ్యాఖ్యలు

చంద్రబాబును గిరిజనులు తరిమికొట్టారు

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వ్యాఖ్య


అమరావతి(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం నేతలు విమర్శించినట్లు తాము విదేశీ విద్యను రద్దు చేయలేదని, మరింత మెరుగుపరిచి అమల్లోకి తెస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై జరిగిన చర్చలో మాట్లాడారు. 80శాతం బ్యాక్‌లాగ్‌  పోస్టులు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనాల మరమ్మతులకు నాడు-నేడు పథకం ద్వారా రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద త్వరలో అంబేడ్కర్‌ భవనాలను నిర్మిస్తామని, ఒక్కో భవనానికి రూ.కోటి చొప్పున మంజూరుచేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న క్రమంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు ఎందుకన్నారు. ఎస్సీలకు కార్పొరేషన్‌ రుణాలు రద్దు చేయలేదని.. కార్పొరేషన్‌ ద్వారా 90శాతం సబ్సిడీతో వాహనాలు కొనుగోలు చేసి పౌరసరఫరా ల సంస్థ ద్వారా వారికి జీవనోపాధి కల్పించామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎస్సీల కోసం రూ.33,625 కోట్లు ఖర్చు చేయగా, జగన్‌ ప్రభుత్వం రెండేళ్లలో రూ.36,605 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు ఆర్‌ఓఎఫ్ఆర్‌ పట్టాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. గిరిజనులను చిన్నచూపు చూసిన చంద్రబాబును, బ్రిటిష్‌ వారిని తరిమికొట్టినట్లు గిరిజనులు తరిమికొట్టారన్నారు. 


ప్రభుత్వ సంక్షేమంపై ప్రచారం చేయండి: స్పీకర్‌

ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేలకు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని తెలిపారు. ‘మీరు విస్తృతంగా జిల్లాల్లో పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మండలాల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జిల్లాల పర్యటనపై మంత్రి వెంటనే జాబ్‌చార్ట్‌ ప్రకటించాలి’ అని సూచించారు. కాగా, వరద సహాయక చర్యలు చేపట్టేందుకు పలువురు మంత్రులు వెళ్లడంతో వారికి సంబంధించి న ప్రశ్నలు వాయిదా వేశారు.

Tags :