Education-Article
Social Sciencesలో రారాజు ఈ సబ్జెక్టే..!

సోషల్‌ సైన్సెస్‌లో రారాజుగా ఎకనామిక్స్‌ సబ్జెక్టుని పిలవవచ్చు. కెరీర్‌, జీతభత్యాల విషయంలో ఇది సైన్స్‌ సబ్జెక్టులతో పోటీ పడుతుంది. స్థానిక మార్కెట్‌తో మొదలుపెట్టి జాతీయ ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థ వరకు సర్వకాల, సర్వావస్థల్లో ఈ సబ్జెక్టు ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఎకనామిక్స్‌తో గ్రాడ్యుయేషన్‌ చేసిన వ్యక్తులకు విధాన రూపకల్పన, స్ట్రాటజీ, మేనేజ్‌మెంట్‌ కన్సెల్టింగ్‌, డేటా సైన్స్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, యాక్చూరియల్‌ సైన్స్‌ రంగాల్లో అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి.


సోషల్‌ సైన్సెస్‌లో మంచి కెరీర్‌ ఉన్న సబ్జెక్టుల్లో ఎకనామిక్స్‌ ఒకటి. ఈ సబ్జెక్టును అధ్యయనం చేసిన విద్యార్థులకు క్వాంటిటేటివ్‌(మేథమెటికల్‌, స్టాటిస్టికల్‌), అనలిటికల్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అలవడతాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర, కార్పొరేట్‌, డెవల్‌పమెంట్‌, అకడమిక్‌ రంగాలకు ఈ నైపుణ్యాలు చాలా అవసరం. ఆ కారణంగానే ఎకనామిక్స్‌తో గ్రాడ్యుయేషన్‌ చేసిన వ్యక్తులకు విధాన రూపకల్పన, స్ట్రాటజీ, మేనేజ్‌మెంట్‌ కన్సెల్టింగ్‌, డేటా సైన్స్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, యాక్చూరియల్‌ సైన్స్‌ రంగాల్లో అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి.


పాలసీ మేకింగ్‌(విధాన రూపకల్పన)

పరిశోధకులు, విధానకర్తలుగా నెగ్గుకురావాలనే విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఎకనామిక్స్‌ను ఎంచుకుంటారు. ఈ సబ్జెక్టు చదివిన విద్యార్థులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్స్‌ తరహాలో ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీసు(ఐఈస్)ను నిర్వహిస్తుంది. ఐఈస్‌కు ఎంపికైతే పబ్లిక్‌ ఎకనామిక్‌ పాలసీ విధానకర్తలుగా చేరవచ్చు. అకడమీషియన్లు, రీసెర్చర్లగానూ కొనసాగవచ్చు. విధానకర్తలు వీరి సలహాలు కోరుతుంటారు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బిఐ) కూడా వీరిని ఎకనామిస్టులుగా తీసుకుంటుంది.


డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్స్‌(అభివృద్ధి సంస్థలు)

విధానాల రూపకల్పనలో వీరు పరోక్షంగా ప్రభుత్వానికి ఉపయోగపడతారు. థింక్‌ ట్యాంక్స్‌ మొదలుకుని ప్రభుత్వేతర సంస్థలు, ప్రభావపూరిత ఏజెన్సీల్లో పని చేయడం ద్వారా వాటికి సహాయపడతారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి సంస్థలు, విద్య, ఆరోగ్య, వ్యవసాయ, అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలపై పని చేసే సంస్థల్లో చేరవచ్చు. పరిశోధన ప్రధానంగా పిహెచ్‌డి చేస్తే ఐరాస సంస్థలైన వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ తదితరాల్లో మంచి హోదాతో పనిచేయవచ్చు. అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు కూడా వీరి సేవలను పొందేందుకు ఉత్సాహం చూపుతాయి. 


కార్పొరేట్‌ సెక్ట్టార్‌

అనలిటికల్‌ రీజనింగ్‌కు తోడు హ్యూమన్‌ బిహేవియర్‌ను అవగాహన చేసుకునే నైపుణ్యం ఎకనామిక్స్‌లో డిగ్రీ ఉన్న వ్యక్తులకు ఉంటుంది. ఈ నైపుణ్యాలు ఉన్న వారు బ్యాంకింగ్‌, ఈ-కామర్స్‌కు అవసరం. స్థూల ఆర్థిక వాతావరణంపై పరిశోధనకు ఉపయోగపడతారు. బిజినెస్‌ సైకిల్‌ అంతకు మించి పాలసీ మార్పుల్లో వీరి సేవలు కీలకంగా ఉంటాయి. 


మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌

ప్రభుత్వం సహా వివిధ పరిశ్రమలకు చెందిన ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఎకనామిస్టుల సేవలు అవసరమవుతాయి. తమకు ఉన్న అంతర్గత వనరులతో సవాళ్ళను అధిగమించాల్సి వచ్చినప్పుడు కన్సల్టెంట్లను సంప్రదిస్తారు. వారి పరిశోధనాత్మక దృక్పథాన్ని ఆచరణలో పాటిస్తారు. ఏతావతా సమస్యల పరిష్కారానికి  కన్సల్టెంట్లు కృషి చేయాల్సి ఉంటుంది. క్లయింట్ల వ్యాపారం లేదంటే మార్కెట్‌ ఎన్విరాన్‌మెంట్లను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారాలను చూపాల్సి ఉంటుంది. 


ఫైనాన్స్‌

ఎకనామిక్స్‌లో సంబంధిత ప్రాథమికాంశాలను గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనే చదువుతారు. ఎక్కువ మంది విద్యార్థులు ఫైనాన్స్‌ను ఎలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటారు. బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సలో జాబ్స్‌కు ఆ స్టడీ ఉపకరిస్తుంది. హెడ్జ్‌ ఫండ్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ ట్రేడింగ్‌, స్ట్రక్చరింగ్‌ అండ్‌ రీసర్చ్‌, ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజ్‌మెంట్‌, స్టాక్‌ బ్రోకింగ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో అవకాశాలు  ఉంటాయి.


డేటా సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌

ఎకనామిక్స్‌ అధ్యయనం చేసిన వారికి ఇదో కొత్త ఏరియా. పెద్ద ఎత్తున డేటా ఈ రోజున పోగుపడుతోంది. ఆ డేటాను విశ్లేషించేందుకు ప్రోగ్రామింగ్‌, స్టాటిస్టికల్‌ టూల్స్‌ అవసరమవుతాయి. పరిణతి కలిగిన నిర్ణయం తీసుకునేందుకు సదరు డేటాను సమర్థంగా విశ్లేషించాల్సి ఉంటుంది. చిన్న, పెద్ద సంబంధం లేకుండా కార్పొరేషన్లు, కంపెనీలు డేటా ఆధారిత వ్యవహారాలను నడుపుతున్నాయి. ఫలితంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పరిజ్ఞానం కలిగి ఉన్న ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్లను తీసుకుంటున్నారు. 


యాక్చూరియల్‌ సైన్స్‌

ఎకనామిక్స్‌ అందిపుచ్చుకునే రంగాల్లో ఇది కూడా ఒకటి. అచ్చంగా ఇది ఒక ప్రొఫెషనల్‌ కెరీర్‌. అత్యధిక వేతనాలను అందుకోవచ్చు. యాక్చూరీలు నిజానికి రిస్క్‌ను అంచనా వేయడంలో నిపుణులు. ఇన్సూరెన్స్‌లో ఇది మరింత కీలకపాత్ర పోషిస్తుంది. 


ఎకనామిక్స్‌కు తోడు మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫైనాన్స్‌లో లోతైన పరిజ్ఞానం ఈ రంగంలో ఎదిగేందుకు చాలా అవసరం. ఈ రంగంలో గ్రోత్‌ కూడా ఎక్కువే. రాబోయే రోజుల్లో రెండుమూడింతలుగా ఎదిగే అవకాశం ఉన్న రంగం ఇన్సూరెన్స్‌ అని చెప్పవచ్చు.  


ఎంట్రప్రెన్యూర్‌షిప్‌

ఎంట్రప్రెన్యూర్‌ కావాలనుకునే వ్యక్తికి ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం తెలియాలి. ఆర్థిక ఆపై పాలసీ ఎన్విరాన్‌మెంట్‌పై పట్టు ఉండాలి. ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన విద్యార్థికి సంబంధిత అంశాలు లేదా రంగాలపై అవగాహన ఉంటుంది. మార్కెట్‌ షేర్‌లో వ్యూహాత్మకత, ఇన్వెస్టర్‌ వాల్యూ, టాప్‌లైన్‌ - బాటమ్‌లైన్‌ తదితరాలు తెలిసి ఉంటాయి. వీటికి తోడు పటిష్టమైన విశ్లేషణాత్మక, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా ఉంటే నిత్యం సమస్యలతో సతమతం చేసే బిజినెస్‌ వాతావరణంలో నెగ్గుకురావచ్చు. 


ఇక్కడ పేర్కొన్నవి కొన్ని మాత్రమే నిజానికి ఎకనామిక్స్‌ను అధ్యయనం చేసినవారికి అవకాశాలకు కొరతే లేదు. సమకాలీన బిజినెస్‌ ప్రపంచంలో ఎకనామిక్స్‌ చదివినవారి కెరీర్‌ పైపైకి ఎదిగే దిశగానే ఉంది. 


కోర్సులు

తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు యూనివర్సిటీలు ఎకనామిక్స్‌ను పీజీ స్థాయిలో ఒక సబ్జెక్టుగా అందిస్తున్నాయి. ఆపై పరిశోధనకూ అవకాశం కల్పిస్తున్నాయి. పేరెన్నికగన్న సంస్థల విషయానికి వస్తే..

- ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ

- ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా

- ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవల్‌పమెంట్‌ రీసెర్చ్‌, ముంబై

- మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌

- సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ స్టడీస్‌, తిరువనంతపురం, కేరళ

- గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌, పుణె

- హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

- ఇసామియా మిలియా ఇస్లామియా, కొత్త ఢిల్లీ


Tags :