Education-Article
డిజైనింగ్‌కు డెస్టినేషన్‌ ఎన్‌ఐడి

ఆటోమోబైల్‌, దుస్తులు, పాదరక్షలు, వాచీ, హ్యాండ్‌బ్యాగ్‌ సహా ఏదైనా సరే, ఒక వస్తువుకు ఉండాల్సిన సాధారణ లక్షణాలు దెబ్బతినకుండా అందంగా, ఆధునికంగా మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడాన్నే డిజైనింగ్‌ అంటాం. ఈ అంశానికి సంబంధించి మన దేశంలో అత్యున్నత శిక్షణ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడి) అహ్మదాబాద్‌. తరవాతి రోజుల్లో విజయవాడ సహా కురుక్షేత్ర, భోపాల్‌, జోర్హాట్‌లలో కూడా ఎన్‌ఐడి దేనికదిగా ఏర్పాటై గ్రాడ్యుయేట్‌ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి. వీటన్నింటికి కలిపి అడ్మిషన్లకు ప్రకటన విడుదలైంది. అలాగే మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులకూ నోటిఫికేషన్‌ విడుదలైంది. 

 

కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వతంత్ర సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడి). ఇండస్ట్రియల్‌, కమ్యూనికేషన్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ ఐటి ఇంటిగ్రేటెడ్‌ (ఎక్స్‌పెరిమెంటల్‌) డిజైన్‌కు సంబంధించి అత్యున్నత స్థాయి విద్య, పరిశోధన సంస్థగా పేరొందింది. డిజైన్‌ ఎడ్యుకేషన్‌, సంబంధిత పరిశోధనలో గ్లోబల్‌ లీడర్‌గా అవతరించాలన్నది ఎన్‌ఐడి లక్ష్యం. విభిన్న డొమైన్లు ఇక్కడ ఉన్నాయి. ‘మైండ్‌ టూ మార్కెట్‌’కు సంబంధించి మౌలిక సదుపాయాలన్నింటినీ బలోపేతం చేయడం ద్వారా తమ విద్యార్థుల ఆలోచనలు నేరుగా మార్కెట్లోకి చేరుతాయని బలంగా విశ్వసిస్తుంది. ప్రొడక్ట్స్‌, సర్వీసులు, అనుభవాలన్నింటా హద్దులు చెరిపేయడమే ధ్యేయంగా ఇక్కడి కార్యకలాపాలు ఉంటాయి. 


సారాభాయ్‌ ఫౌండేషన్‌ అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐడిని స్థాపించింది. అతిపెద్ద కళాసంస్థ ‘బాహోస్‌’ ఈ సంస్థకు విద్యా విధానాన్ని రూపొందించింది. అత్యున్నత స్థాయి విద్యా విధానాలతో అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎన్‌ఐడి మెయిన్‌ క్యాంపస్‌ ఉంది. అదనంగా గాంధీనగర్‌లో పీజీ క్యాంపస్‌, బెంగళూరులో ఆర్‌ అండ్‌ డి క్యాంపస్‌ ఏర్పాటు చేశారు.þ గడచిన దశకంలో దేశంలో మరికొన్ని చోట్ల కూడా ఎన్‌ఐడి ఏర్పాటయ్యాయి. 


అహ్మదాబాద్‌లోని మెయిన్‌ క్యాంపస్‌ సకల హంగులతో అలరారుతోంది. లైబ్రరీ, రీసెర్చ్‌ సెంటర్‌ డిజిటల్‌ సర్వీసె్‌సతో నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఉంది. అవసరమైన అన్ని పుస్తకాలకు తోడు ఆడియో- విజువల్‌ మెటీరియల్‌ ఈ సెంటర్లో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పుస్తకాలు ఉన్నాయి. అవసరమైన  జర్నల్స్‌ అన్నీ తెప్పిస్తారు. బ్యాక్‌ వాల్యూమ్స్‌ అదనం. ఐటి సెంటర్‌ ప్రత్యేకం. డిజైన్‌ విజన్‌ సెంటర్‌, క్రాఫ్ట్‌ సెంటర్‌, ఫొటో స్టుడియో ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. డిజైనింగ్‌లో అత్యున్నత స్థాయి విద్య, శిక్షణకు ఇవి ఎంతగానో తోడ్పడుతుంటాయి. 


ఆచరణకు అనువుగా..

అదేవిధంగా ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు అనువైన కరికులమ్‌ ఉంటుంది. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌కు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారు. నిజ జీవితంలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రాజెక్టులు ఉంటాయి. కోర్సు పూర్తయ్యేనాటికి సంబంధిత పరిశ్రమలో ఇమిడిపోయే వ్యక్తిగా విద్యార్థిని తీర్చిదిద్దుతారు. నేర్చుకునేందుకు ప్రత్యేకించి మోడల్‌ మేకింగ్‌ స్ట్టుడియో ఉంది. తేలికపాటి హ్యాండ్‌ టూల్స్‌, బేసిక్‌ మెటీరియల్‌ అందుబాటులో ఉంటుంది. వాటిని ఉపయోగించి విద్యార్థులు మోడల్స్‌ రూపొందిస్తారు. 


కోర్సు తీరు తెన్నులు

ఎన్‌ఐడిలో నిర్ణీత కాలవ్యవధి కలిగిన కోర్సులే ఉన్నాయి. అయితే నిర్దేశిత కాలంలో కొందరు కోర్సులు పూర్తి చేయలేరు. ఏదోలా కోర్సు పూర్తి చేసేందుకు ఎన్‌ఐడి అంగీకరించదు. సంపూర్ణ పరిజ్ఞానం, అవగాహన పొందిన తరవాతే అభ్యర్థికి డిగ్రీ ఇస్తుంది. కోర్సులో భాగంగా రెండు ప్రాజెక్టులు ఉంటాయి. ఒకటి ప్రీ డిప్లొమా ప్రాజెక్టు. దాని తరవాత ఉండేది, డిప్లొమా ప్రాజెక్టు. కోర్సులో భాగంగా  బేసిక్‌ యానిమేషన్‌, కేరక్టర్‌ డిజైన్‌ వరకు యానిమేషన్‌కు సంబంధించిన వివిధ అంశాలు ఉంటాయి. హిస్టరీ ఆఫ్‌ డిజైన్‌, డిజైన్‌ ప్రాసెస్‌ మాత్రమే చదివే సబ్జెక్టులు. ఈ రెండూ కూడా ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌తో కలగలిసి ఉంటాయి. మిగతాదంతా పూర్తిగా ప్రాక్టికల్‌ ఓరియెంటెడ్‌. ప్రాజెక్టుల విషయానికి వస్తే, గైడ్‌ ఆధ్వర్యంలో  చేస్తారు. కాన్సెప్ట్‌ ఓకే చేయించుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. అదయితే, ప్రొడక్షన్‌ వర్క్‌ కొద్దిగా సులువే. ఒక కాన్సె్‌ప్టను గుర్తించడంతో మొదలుపెట్టి దానికి ఒక రూపు ఇవ్వడం వరకు ప్రతి దశలో గైడ్‌ని అర్థవంతంగా ఒప్పించాల్సి ఉంటుంది.


అలాగే గైడ్‌ సూచనల మేరకు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనిని మెరుగుపర్చుకోవాలి. గైడ్‌ అంగీకరించిన తరవాతే ప్రీ ప్రొడక్షన్‌ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ వరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఐడిలో పరీక్షించేందుకు ఒక కమిటీ ఉంటుంది. దాన్ని జ్యూరీ అంటారు. కోర్సు బోధించిన ప్రొఫెసర్లకు తోడు అనుబంధ విభాగాల అధ్యాపకులూ అందులో ఉంటారు. మరో విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సెమిస్టర్లో నేర్చుకున్న ప్రతి అంశాన్నీ అక్కడ అడుగుతారు. మనం నేర్చుకున్నది సంతృప్తికరంగా వారికి వివరించాలి. ఆ చెప్పే యత్నంలో భాగంగానే లోపాలు ఏవైనా ఉంటే జ్యూరీ సభ్యులు తెలియజేస్తారు. వాటిని ఎలా అధిగమించాలో కూడా చెబుతారు. కోర్సు పూర్తయ్యేలోపు వాటిని సవరించుకోని పక్షంలో కోర్సు గట్టెక్కడం దాదాపుగా అసాధ్యం. విద్యార్థులు సాఽధారణంగా ఒక్కొక్కరు ఈ జ్యూరీ  ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.


ఒక్కోసారి బహిరంగ జ్యూరీ జరుగుతుంది. అలాంటి సమయాల్లో, నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యార్థులు తలొంచుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇంకొద్ది రోజుల్లో కోర్సు పూర్తవుతుందనుకునే విద్యార్థులను బైటకి పంపేసిన  సంఘటనలు కూడా ఉన్నాయని సీనియర్లు చెబుతూ ఉంటారు. కోర్‌ వాల్యూస్‌ అలాగే కాన్సెప్ట్యుల్‌ పర్ఫెక్షన్‌లో తమ విద్యార్థి పర్ఫెక్ట్‌గా ఉండాలన్నది ఎన్‌ఐడి మౌలిక లక్ష్యం. అందుకు అనుగుణంగానే అక్కడి కరికులమ్‌ ఉంటుంది. అందుకే ఇతరచోట్ల యానిమేషన్‌ కోర్సు చేసిన విద్యార్థులు యానిమేటర్లుగా మిగులుతారు. ఎన్‌ఐడి విషయానికి వస్తే, యానిమేషన్‌ ఫిల్మ్‌ మేకర్లుగా రూపొందుతారు. స్ర్కిప్ట్‌తో మొదలుపెట్టి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ వరకు అన్నింటా ఆరితేరుతారు.ఎన్‌ఐడిలో ఏ కోర్సు చేసే విద్యార్థికైనా ఇదే వర్తిస్తుంది.


బీ డిజైన్‌

సీట్లు: అహ్మదాబాద్‌ క్యాంప్‌సలో 125 సీట్లు; ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 75 సీట్లు ఉన్నాయి. విదేశీ విద్యార్థుల కోసం అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 19 సీట్లు, మధ్యప్రదేశ్‌ క్యాంప్‌సలో 11 సీట్లు ఉన్నాయి.

అర్హత: అభ్యర్థులు 2002 జూలై 1 తరవాత జన్మించి ఉండాలి. సీబీఎస్‌ఈ/ ఐబీ/ ఐసీఎ్‌సఈ/ ఇతర గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 2022 మే/జూన్‌ నాటికి సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ గ్రూప్‌లతో ఇంటర్‌/పన్నెండో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

డీఏటీ వివరాలు: ప్రిలిమ్స్‌ను పేపర్‌ - పెన్సిల్‌/ పెన్‌ విధానంలో నిర్వహిస్తారు. టెక్ట్స్‌, విజువల్స్‌ అంశాల నుంచి ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో అడుగుతారు. పరీక్ష వ్యవధి వివరాలను అడ్మిట్‌కార్డ్‌లో తెలియజేస్తారు.


ఎం డిజైన్‌

విభాగాలు - సీట్లు: అహ్మదాబాద్‌ క్యాంప్‌సలో యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 19 సీట్లు; సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌లో 12 సీట్లు ఉన్నాయి. గాంధీనగర్‌ క్యాంపస్‌లో ఫొటోగ్రఫీ డిజైన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఆటొమొబైల్‌ డిజైన్‌, న్యూ మీడియా డిజైన్‌, స్ట్రాటజిక్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్‌, అప్పారెల్‌ డిజైన్‌, లైఫ్‌ స్టయిల్‌ యాసెసరీ డిజైన్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 19 సీట్లు; టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్‌లో 12 సీట్లు ఉన్నాయి. బెంగళూరు క్యాంప్‌సలో యూనివర్సల్‌ డిజైన్‌, డిజిటల్‌ గేమ్‌ డిజైన్‌, ఇన్ఫర్మేషన్‌ డిజైన్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌, డిజైన్‌ ఫర్‌ రిటైల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 19 సీట్లు ఉన్నాయి.   

అర్హత: అభ్యర్థులు 1992 జూలై 1 తరవాత జన్మించి ఉండాలి. ఇంటర్‌ తరవాత మూడేళ్లు/ నాలుగేళ్ల వ్యవధిగల ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజైన్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో నాలుగేళ్ల డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులే. 

డీఏటీ వివరాలు: ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో కామన్‌ డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, స్పెసిఫిక్‌ టెస్ట్‌ ఉంటాయి. వీటిలో ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు రూ.3,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500; విదేశీ విద్యార్థులకు రూ.5,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

డీఏటీ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: డిసెంబరు 23 నుంచి

ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ

డీఏటీ ప్రిలిమ్స్‌ తేదీ: 2022 జనవరి 2 

వెబ్‌సైట్‌: admissions.nid.edu


Tags :