Education-Article
GATE మీ లక్ష్యమా..? అయితే ఇలా చదవండి..!

బీఈ, బీటెక్‌ చేస్తున్న విద్యార్థులు ఉన్నత చదువులు అలాగే మంచి ఉద్యోగం కోసం దృష్టి పెట్టాలి. ఆ క్రమంలో గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఫర్‌ ఇంజనీర్స్‌(గేట్‌)ను తప్పనిసరిగా క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఉండే ఈ పరీక్షను బెంగుళూరులోని ఐఐఎస్సీ సహా ఏడు లీడింగ్‌ ఐఐటీలు కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి. 2021 గేట్‌ని ఖరగ్‌పూర్‌ ఐఐటీ నిర్వహిస్తోంది. ఈ ఏడాది కొత్తగా రెండు సబ్జెక్టులు నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌, జియోమేటిక్స్‌ ఇంజనీరింగ్‌ కలిపారు. దీంతో పరీక్షించే పేపర్ల సంఖ్య 29కి పెరిగింది. 


అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ అగ్రికల్చర్‌ అలాగే పీజీలో సైన్సెస్‌ చదివిన విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానంపై ఉన్న సమగ్ర అవగాహన ఏపాటిదో తెలుసుకునేందుకు ఉద్దేశించిన పరీక్ష గేట్‌. ఇంజనీరింగ్‌, సైన్సెస్‌, హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సె్‌సకు సంబంధించి గ్రాడ్యుయేషన్‌ పరిధిలో సబ్జెక్టు పరిజ్ఞానం, అవగాహన స్థాయిని ఈ ఎగ్జామ్‌లో పరీక్షిస్తారు. వివిధ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల నుంచి లక్షల మంది వివిధ కోర్సులను పూర్తి చేసుకుని బైటకు వస్తున్నారు. వారి కాలిబర్‌ను టెస్ట్‌ చేసేందుకు గేట్‌ వీలుకల్పిస్తోంది. ప్రత్యేకించి తాము చదువుకున్న సబ్జెక్టులో సాపేక్ష ప్రతిభను గేట్‌ స్కోర్‌ వ్యక్తీకరిస్తుంది. 


ఎంఈ/ ఎంటెక్‌ చదివేందుకు తోడు పలు ప్రభుత్వరంగ (ఇండియన్‌ ఆయిల్‌, గెయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం తదితరాలు)కంపెనీల్లో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాల ఎంపికకు తొలి ప్రామాణికం గేట్‌ స్కోర్‌. అదేవిధంగా సిఎ్‌సఐఆర్‌ ఫెల్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌, ఎంఈ/ఎంటెక్‌  చదివేందుకు స్కాలర్‌షిప్స్‌ పొందేందుకు గేట్‌ స్కోర్‌ ఉపకరిస్తుంది. గేట్‌ స్కోర్‌తో కింది ప్రయోజనాలు ఉన్నాయి.


- భారతదేశంలోని ఐఐటీలు సహా ప్రముఖ విద్యా సంస్థల్లో ఎంఈ/ఎంటెక్‌/ ఎమ్మెస్సీలో చేరవచ్చు. 


- మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో స్పెషలైజేషన్‌ చేయవచ్చు. తద్వారా మీకు ఆసక్తి ఉన్న అంశాన్ని లోతుగా ఆకళింపు చేసుకోవచ్చు. అది పరిశోధన/ పిహెచ్‌డికి దారితీయవచ్చు. 


- డొమైన్‌ కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ కోసం సుప్రసిద్ధ సాంకేతిక విద్యా సంస్థలకు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా అక్కడ చదువుకున్న వారికి సబ్జెక్టు ఆధారిత కంపెనీలో పని చేసే అవకాశాన్ని పొందే సౌలభ్యం ఉంటుంది. 


- గ్రాడ్యుయేట్‌తో పోల్చుకుంటే పీజీ చేసిన విద్యార్థులకు ఎక్కువ వేతనంతో వివిధ కంపెనీలు తీసుకుంటాయి. 


- వివిధ విద్యా సంస్థలు, పరిశోధన - అభివృద్ధి సంస్థల్లో ఫ్యాకల్టీ/ రీసెర్చ్‌ పొజిషన్ల కోసం మాస్టర్స్‌ డిగ్రీ తప్పనిసరి.


- మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నప్పుడు ఈ స్కోర్‌తో రూ.12,400 నుంచి రూ.25,000 వరకు స్కాలర్‌షిప్‌ పొందవచ్చు.


- గేట్‌ క్వాలిఫై అయిన వ్యక్తులు సిఎస్ఐఆర్‌ ల్యాబొరేటరీలు, ప్రాయోజిత ప్రాజెక్టుల్లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అందుకోవచ్చు. 


- ప్రభుత్వ రంగ సంస్థ(బిఎఆర్‌సి, ఐఒసిఎల్‌, ఎన్‌టిపిసి, బిహెచ్‌ఈల్‌, పిజిసిఐఎల్‌ తదితరాలు)ల్లో గేట్‌ స్కోర్‌తో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు ఇస్తాయి.


ప్రిపరేషన్‌

పూర్తి స్థాయిలో విశ్వాసం, స్పష్టత ఉన్న సబ్జెక్టులను మొదట ఎంపిక చేసుకోవాలి. చదివింది ఏదైనప్పటికీ అదంతా కాన్సెప్ట్‌గా మార్చుకోగలిగితే చాలు, గేట్‌ పరీక్షలో ప్రశ్నలను సులువుగా అర్థంచేసుకోగలుగుతారు. సమాధానాలనూ సులువుగా రాబట్టుకోగలరు. ఒక టాపిక్‌ అధ్యయనంలో భాగంగా, పటిష్టమైన పునాదిని ఏర్పాటు చేసుకోగలిగితే సదరు అంశంలోని లోతులను తాకవచ్చు. గేట్‌ సిలబస్‌ పరిధిలోని ప్రాథమిక టాపిక్స్‌ అన్నీ మీ స్టడీలో కవర్‌ అయ్యేలా చూసుకోవాలి. భారతదేశంలోని మెజారిటీ యూనివర్సిటీల్లో ముఖ్యంగా మూడు నుంచి ఆరో సెమిస్టర్‌ వరకు గేట్‌ సిలబస్‌ పూర్తిగా కవర్‌ అయి ఉంటుంది. అందువల్ల మూడో సెమిస్టర్‌ సిలబస్‌ నుంచి ప్రిపరేషన్‌ మొదలుపెడితే చాలా మంచిది.


మేథ్స్‌ కాదంటే మరొక సబ్జెక్టు ఏదైనప్పటికీ దాని లోతులు చూడాల్సిందే. ఒకసారి సదరు టాపిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక కాన్సెప్ట్‌లను నేర్చుకోగలిగితే విశ్వాసం దానంతట అదే పెరుగుతుంది. ఆపై మాత్రమే మరింత అడ్వాన్స్‌డ్‌ స్థాయిని అందుకునేందుకు స్టడీ మొదలుపెట్టాలి. సబ్జెక్టులోని కంటెంట్‌పై పూర్తి స్పష్టత ఉండాలి. ఏది, ఎందుకు, ఎలా పనిచేస్తోంది అన్నది తెలుసుకోవాలి. అప్పుడు విజ్ఞాన పరిధి పెరుగుతుంది. దానికి అన్వయ పరిజ్ఞానం తోడవడం ఇంజనీరింగ్‌ కెరీర్‌కు చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో సబ్జెక్టుపై ఆసక్తి తగ్గుతుంది. గేట్‌ వంటి ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌ సమయంలో ఆ సబ్జెక్టు విశ్వాసం తగ్గడానికి అదే దారితీస్తుంది. అప్పుడు మళ్ళీ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకోవాలి. కొత్త సత్తువను సంతరింపజేసుకోవాలి. అప్పుడే అభ్యర్థులు ట్రాక్‌పైకి రాగలుగుతారు. స్టడీలో భాగంగా వెనుకపడితే వెంటనే ఆ పరిస్థితిని అప్లికేషన్‌కు, అపరిమిత అవకాశాలకు అనువర్తింపజేయాలి. 


ప్రాథమిక దశలో ఉంటే కింది విధానం బెస్ట్‌!

అభిలషణీయ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆరంభం నుంచి ఆ దిశగానే కృషి చేయాలి. ఎగ్జామ్‌ విధానం, సిలబస్‌, పరీక్షల్లో కష్ట స్థాయి దిశగా క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోవాలి. 


- ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు పరీక్ష ఏదైనప్పటికీ మొదట అంతకుమునుపు జరిగిన ఎగ్జామ్స్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఎలాంటి ప్రశ్నలను అడుగుతున్నారో గుర్తించాలి. థియరీ నుంచా లేదంటే ఇంకా వేటి నుంచి అడుగుతున్నారో తెలుసుకోవాలి. తదుపరి ఏయే సబ్జెక్టులు, టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయో చూడాలి. అవి డెరివేషన్లా, న్యూమరికల్‌ తరహావా అన్నదీ తెలుసుకోవాలి. 


- ప్రతి సబ్జెక్టుకు మంచి రిఫరెన్స్‌ పుస్తకాన్ని ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు పలు పుస్తకాలు ఫాలో కావడం మంచిది కాదు. పరిమిత సమయంలో వాటన్నింటి అధ్యయనం సాధ్యం కాదు కూడా. అయోమయానికి గురికావడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. 


- కెరీర్‌కు సంబంధించి ఒక సంపూర్ణ ప్లానింగ్‌ చాలా అవసరం. తక్షణ, సుదీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అందుకు అనుగుణంగా ఒక పటిష్టమైన మార్గనిర్దేశనం చేసుకోవాలి. ప్లానింగ్‌, ఎగ్జిక్యూషన్‌పై ఒక ఇంజనీర్‌గా మీకు స్పష్టత చాలా ముఖ్యం.


- వివిధ సబ్జెక్టులను దృష్టిలో పెట్టుకుని ఒక ప్లాన్‌ రూపొందించుకోవాలి. పరీక్ష జరిగే రోజును గమనంలోకి తీసుకుని పరీక్షలోకి వచ్చే వివిధ సబ్జెక్టులను అందుకు అనుగుణంగా విభజించుకోవాలి. అత్యంత ఎక్కువ కటా్‌ఫలు రాజ్యమేలుతున్న ఈ పరిస్థితుల్లో సెలెక్టివ్‌ స్టడీ మంచిది కాదు. సిలబస్‌ ఆసాంతం కవర్‌ అయ్యేలా ప్లానింగ్‌ ఉండాలి. ప్రతి సబ్జెక్టులో అధ్యయనం అన్నది పరీక్షలను దృష్టిలో పెట్టుకుని జరగాలి. పరీక్షకు సరిపోయే విధంగా స్టడీ ఉండాలి. ప్రీవియస్‌ ప్రశ్నపత్రాల్లో సంబంధిత సబ్జెక్టు లేదంటే టాపిక్‌ నుంచి  వచ్చిన ప్రశ్నలను కూడా దృష్టిలో పెట్టుకుని సమాధానాలు రాయగలిగే లేదంటే గుర్తించగలిగే స్థాయిలో ప్రిపరేషన్‌ ఉండాలి. పరీక్షలో వాటిని ఏ రూపంలో అడిగినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రిపరేషన్‌ ఉండాలి. థియరీ, న్యూమరికల్‌ లేదంటే మరేదైనా అది కావచ్చు.  ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకించిన అప్రోచ్‌ అవసరం అవుతుంది. ఉదాహరణకు మేథ్స్‌ తీసుకుంటే ప్రాబ్లెమ్స్‌ను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇంగ్లీష్‌ సబ్జెక్టు అయితే అప్రోచ్‌ మరో విధంగా ఉండాలి. టెక్నికల్‌ సబ్జెక్టులకు అప్రోచ్‌ ఇంకోలా ఉండాలి.  


- ప్రతి సబ్జెక్టులో గేట్‌ అలాగే యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్స్‌ ప్రీవియస్‌ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్న పత్రాలను కనీసం పది నుంచి పదిహేనేళ్ళవి చూడాలి. క్లాస్‌ నోట్స్‌కు సమాంతరంగా వాటికీ తగు సమాధానాలతో బుక్‌ మెయింటైన్‌చేయాలి. ఈ విషయంలో దేన్నీ వాయుదా వేయవద్దు. క్లాస్‌లో టాపిక్‌ లేదంటే దానిపై సొంతగా స్టడీ పూర్తి కాగానే గత ప్రశ్నపత్రాలను పరిశీలించండి. సదరు టాపిక్‌పై ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో గమనించండి. ఇక్కడ రెండు పనులూ సమాంతరంగా సాగాలి. సూక్ష్మస్థాయిలో నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. ప్రిన్సిపల్‌ ఫార్ములా/డయాగ్రమ్స్‌/ కాన్సె్‌ప్టకు ప్రాధాన్యం ఇవ్వండి. అదే సమయంలో ఎక్కడ మీరు స్ట్రాంగ్‌, మరెక్కడ వీక్‌ అన్నది కూడా గుర్తించండి. అసలు ఆ టాపిక్‌లో గుర్తు పెట్టుకోవాల్సినవి ఏది అన్నది కూడా తెలుసుకోండి. సందేహాలను అలాగే ఉంచేసుకోవద్దు, పోగుచేసుకోవద్దు. స్నేహితులతో, ఫ్యాకల్టీతో చర్చించి మీ సందేహాలను పూర్తిగా తొలగించుకోండి. 


- సిలబస్‌ను పూర్తిగా కవర్‌ చేయండి. అయితే ప్రాముఖ్యం ఉన్న అంశాలకు ఎక్కువ సమయం నిర్దేశించుకోండి. ముఖ్యమైన సబ్జెక్టులను మళ్లీ వాటిలో ప్రాముఖ్యం కలిగిన టాపిక్స్‌ను గుర్తించండి. స్కోరింగ్‌, అతి తక్కువ స్కోరింగ్‌ వచ్చే వాటిని విభజించుకోండి. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సబ్జెక్టుల మధ్య స్టడీలో సమతుల్యత పాటించండి. గేట్‌లో మేథ్స్‌, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాలు స్కోరింగ్‌. వివిధ తరహాల్లో అడిగే ప్రశ్నలను ఎక్కువగా సాల్వ్‌ చేయడంపై దృష్టి పెట్టండి. సరికొత్త మెటీరియల్‌నూ పునశ్చరణ కోసం మాత్రమే చూడాలి. స్టడీలో రెగ్యులారిటీ చాలా ముఖ్యం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

Tags :