Education-Article
మాతృభాష, మాతృదేశం పట్ల భక్తిభావన ఉండాలి

గురువు హనుమాజ్జానకీరామ శర్మతోనే తెలుగు పట్ల మక్కువ

కోవెల సుప్రసన్నాచార్యకు అవార్డు ప్రదానంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య


అఫ్జల్‌గంజ్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజల భాషలో పాలన, బోధన, న్యాయ వ్యవహారాలు సాగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి.. ఇలా అందరూ మాతృభాషాభిమానులని, వారి స్ఫూర్తితో మాతృభాషాభిమానాన్ని సగర్వంగా అలవర్చుకోవాలని ఉద్బోధించారు. ఏపీ నెల్లూరులోని వీఆర్‌ కళాశాలలో డిగ్రీలో వెంకయ్యకు తెలుగు బోధించిన గురువు పోలూరి హనుమాజ్జానకీరామ శర్మ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రత్యేక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్తు ఆడిటోరియం హాల్‌లో ఈ పురస్కారాన్ని ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు వెంకయ్య ప్రదానం చేశారు. అవార్డు కింద 25 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగించారు. గురువుల స్ఫూర్తితో మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం పట్ల భక్తిభావన అలవర్చుకోవాలని సూచించారు. తమ గురువు హనుమాజ్జానకీరామశర్మ తనకు తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల మక్కువను పెంచారన్నారు.


రాజకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల స్వతహాగానే అవగాహన పెంచుకోగలిగినా వాటిని గురించి ధాటిగా మాట్లాడగలిగే నేర్పు వారి ప్రేరణతోనే వచ్చిందని పేర్కొన్నారు. ఇవాళ సారస్వత పరిషత్తులో అవార్డును ఏర్పాటు చేసి అందజేయడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. పురస్కార గ్రహీత ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ఆధునిక సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారని ప్రశంసించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్య రచించిన కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు గ్రంథాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. 

Tags :