Education-Article
నకిలీ హోంగార్డులను సులువుగా గుర్తించడం కోసం.. పోలీసు శాఖ ఏం చేయబోతుదంటే..

హోంగార్డుల లెక్క.. ఇక పక్కా!

వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న పోలీసు శాఖ

హెచ్‌ఆర్‌ఎంఎస్‌ డేటాబేస్‌లో నమోదు

నకిలీలను గుర్తించేందుకే: ఉన్నతాధికారులు


హైదరాబాద్‌: రాష్ట్రంలోని హోంగార్డుల వివరాలను పోలీసు శాఖ పక్కాగా సేకరిస్తోంది. మొత్తం హోంగార్డుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే హోంగార్డుల విద్యార్హతలు, పదవీవిరమణ తేదీ, కుటుంబసభ్యుల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లోని మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ(హెచ్‌ఆర్‌ఎంఎస్‌) డేటాబేస్‌లో నమోదు చేస్తోంది. ఇప్పటికే కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకూ వివరాలు హెచ్‌ఎంఆర్‌ఎంస్‌లోకి చేరాయి. సర్వీసుకు సంబంధించిన ఇంక్రిమెంట్లు, పురస్కారాలు, పదోన్నతులు, సెలవులు తదితర అంశాలన్నింటినీ డేటాబేస్‌లో పొందుపరిచారు. దాని ద్వారా ఏ స్టేషన్‌లో ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. పోలీసులు అధికారుల వద్దకు వెళ్లకుండానే.. తమ సెలవులను హెచ్‌ఎంఆర్‌ఎస్‌ డేటాబేస్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


తాజాగా హెచ్‌ఎంఆర్‌ఎస్‌ పరిధిలోకి హోంగార్డులను తీసుకురావాలని ఇటీవల జరిగిన సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘‘పోలీసు శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 17 వేల మంది హోంగార్డులు ఉన్నారు. అయితే.. వారి సంఖ్య కచ్చితంగా ఎంత అన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. హెచ్‌ఎంఆర్‌ఎస్‌ డేటాబేస్‌ ద్వారా ఒక్క క్లిక్‌తో హోంగార్డుల పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. స్టేషన్‌లు/విభాగాల వారీగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుస్తుంది. నకిలీ హోంగార్డులను సులువుగా గుర్తించవచ్చు’’ అని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tags :