Education-Article
ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

98.60 శాతం మంది ఉత్తీర్ణత 

త్వరలో కౌన్సెలింగ్‌ తేదీల ప్రకటన: కన్వీనర్‌ 


విశాఖపట్నం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌-2021లో 98.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎడ్‌సెట్‌ ఫలితాలను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.విశ్వేశ్వరరావు మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినమ్‌ జూబ్లీ గెస్ట్‌హౌ స్‌లో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, సెప్టెంబరు 21వ తేదీన 69 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 13,619 మంది హాజరైనట్టు ఆయన వెల్లడించారు. వీరిలో 13,428 మంది  ఉత్తీర్ణత సాధించారన్నారు.


విభాగాల వారీగా.. బయోలాజికల్‌ సైన్సె్‌సలో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం లూటుకుర్రుకు చెందిన పి.మణితేజ, ఇంగ్లీష్‌ మెథడాలజీలో అదే జిల్లా ద్రాక్షారామానికి చెందిన ఎ.వరప్రసాద్‌, మేథమెటిక్స్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఎస్‌.హిమబిందు, ఫిజికల్‌ సైన్స్‌లో గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన బి.రాజశేఖర్‌, సోషల్‌ సైన్సె్‌సలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వి.దిలీప్‌ సూర్యతేజ మొదటి స్థానంలో నిలిచారు. గత ఏడాది డేటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు తెలిపారు. కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలోనే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటిస్తుందన్నారు.

Tags :