Education-Article
సర్వదర్శన టోకెన్లకు పోటెత్తిన భక్తులు

ఉదయం 8 గంటలకే కౌంటర్లు బంద్‌


తిరుపతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లకు భక్తులు పోటెత్తారు. కరోనా కేసులు అధికమవుతున్నాయనే కారణంతో ఏప్రిల్‌ 11 నుంచి టోకెన్ల జారీని నిలిపివేసిన టీటీడీ.. బుధవారం నుంచి టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది.  ప్రయోగాత్మకంగా రోజుకు రెండు వేల టోకెన్ల చొప్పున చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ఇస్తామని తెలిపింది. ఈ టోకెన్ల కోసం బుధవారం తెల్లవారుజాము నుంచే తిరుపతి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌కు భక్తులు క్యూ కట్టారు. రెండు వేల టోకెన్లు మాత్రమే ఇస్తామని ప్రకటించినా వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఉదయం ఐదున్నర నుంచి టోకెన్ల జారీ ప్రారంభమైంది. సర్వర్లు మొరాయించడంతో  టోకెన్ల జారీకి కొంతసేపు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఉదయం ఎనిమిది గంటలకే టోకెన్లు ఇవ్వడం పూర్తయ్యింది. గురువారం కూడా టోకెన్ల జారీ కొనసాగనుంది.

Tags :