Education-Article
గ్రూప్‌-1 అభ్యర్థులకు మోడల్‌ ఇంటర్వ్యూలు

ఏపీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహణ 

అమరావతి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ఏపీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్‌ మోడల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఏపీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యు.వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.సునీత, ఐజీ శ్రీకాంత్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌, ఎస్వీ యూనివర్సిటీ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ కృష్ణమూర్తి, బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏపీ స్టడీ సర్కిల్‌ చరిత్రలో గ్రూప్‌-1 మెయిన్స్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు మోడల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడం ఇదే మొదటిసారని ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీత తెలిపారు. రానున్న కాలంలో స్టడీ సర్కిల్‌ అన్ని రకాల పోటీ పరీక్షల అభ్యర్థులకు సహకారమందించేందుకు ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. నాలుగు రోజుల పాటు ఈ మోడల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, మొదటి రోజు ఆరుగురు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశామని ఏపీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యు.వెంకటేశ్వర్లు చెప్పారు. ఇంటర్వ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కోరింగ్‌ కోసం తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags :