Education-Article
రాష్ట్రంలో ఉన్నతవిద్య చదువుతోంది 36%

దేశంలో తెలంగాణకు 10వ స్థానం 

నీతి ఆయోగ్‌ - ఐరాస నివేదికలో వెల్లడి


హైదరాబాద్‌, జూన్‌8 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 74 శాతం మంది విద్యార్థులు 12వ తరగతి తర్వాత ఉన్నత చదువులకు దూరంగా ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. నీతి ఆయోగ్‌, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020-21 పేరుతో రూపొందించిన నివేదికను కేంద్రం మంగళవారం విడుదల చేసింది. దేశంలో అధికశాతం విద్యార్థులు పాఠశాల విద్యవరకే పరిమితమవుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. విద్య, ఆరోగ్యం, పేదరికం, పరిశ్రమలు, పర్యావరణంతోపాటు మొత్తం 17రకాల అంశాలపై రాష్ట్రాలవారీగా వివరాలను నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలో 87శాతం మంది విద్యార్థులు ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుంటున్నారు. జాతీయ స్థాయి కంటే మెరుగ్గా తెలంగాణలో 93.67శాతం మందికి ప్రాథమిక విద్య లభిస్తోంది. దేశవ్యాప్తంగా 50శాతం మంది విద్యార్థులు మాత్రమే 12వ తరగతి వరకు చదువుతుండగా.. తెలంగాణలో ఇది 56శాతంగా ఉంది. అలాగే ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్య చదివే విద్యార్థుల సంఖ్య దేశవ్యాప్తంగా 26శాతం ఉండగా.. ఇది తెలంగాణలో 36శాతంగా ఉంది. 

Tags :