Education-Article
ఇంట్లోనే ‘బడి’

అరచేతిలో పుస్తకం 

కరోనాతో మారిన విద్యావిధానం

సరైన సాంకేతికత ఉంటే 

ఆన్‌లైన్‌లోనూ మెరుగైన ఫలితాలు

200 శాతం పెరిగిన ఎడ్‌ టెక్‌ వేదికలు 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌7, (ఆంధ్రజ్యోతి): నూతన విద్యా సంవత్సరం ఆరంభమవుతోంది. గత సంవత్సరం మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ నాటి నుంచి పరిస్థితులు విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపాయి. తరగతి బోధనకు దూరమైన విద్యార్థులకు గుడ్డిలో మెల్ల చందాన పూర్తిగా విద్యాసంవత్సరం కోల్పోకుండా తోడ్పాటునందించింది ఎడ్‌ టెక్‌ స్టార్టప్స్‌. ఈ ఏడాది ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేశాయి. అత్యధిక శాతం పాఠశాలలు, కాలేజీలు ఇప్పుడు తమ క్లాస్‌లను నిర్వహించడానికి వర్ట్యువల్‌ వేదికల వైపు దృష్టి సారించాయి. గుగూల్‌ క్లాస్‌ రూమ్‌లు, జూమ్‌ క్లాస్‌లకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. పాఠశాలలు విభిన్న మాధ్యమాల ద్వారా  బోధన చేయడానికి ప్రయత్నిస్తుంటే, తమదైన రీతిలో విద్యను అందించడానికి బైజూస్‌, ప్రాక్టికల్లీ, అన్‌అకాడమీ, లీడ్‌, వేదాంతు... ఇలా ఎన్నో సంస్థలూ సిద్ధమయ్యాయి. గత ఏడాది నుంచి దేశంలో ఎడ్‌ టెక్‌ ప్రొడక్ట్స్‌ వినియోగం రెండు రెట్లు పెరిగిందని ఈవై అధ్యయనం వెల్లడిస్తోంది. కేవలం కే 12 విభాగంలోనే 260 మిలియన్‌ల మంది విద్యార్థులు ఉంటే, టెస్ట్‌ ప్రిపరేషన్‌ విభాగంలో అదనంగా మరింత మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇక 21కే స్కూల్‌ లాంటి సంస్థలు ఆన్‌లైన్‌ అభ్యాస ఉపకరణాల వినియోగం తర్వాత తమ చిన్నారుల విద్యా ప్రదర్శన గణనీయంగా పెరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారని  వెల్లడించడంతో  ఎడ్‌టెక్‌ల పట్ల మరింత మంది ఆసక్తి కనబరుస్తున్నారు.


కొవిడ్‌ వచ్చింది... తలుపులు తెరిచింది...

లాంగ్వేజ్‌  యాప్స్‌, వర్ట్యువల్‌ ట్యూటరింగ్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ టూల్స్‌, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌వంటి వాటికి కొవిడ్‌ -19 తర్వాత విపరీతమైన ఆదరణ కలిగింది. కరోనా కారణంగా ఒక్కసారిగా ఆన్‌లైన్‌ యాప్‌లకు ఆదరణ పెరగడంతో కొన్ని సంస్ధలు పూర్తి ఉచితంగానే తమ సేవలను కొంతమేరకు అందిస్తున్నాయి. బైజూస్‌ సైతం తమ థింక్‌, లెర్న్‌ యాప్‌లపై ఉచిత లైవ్‌ క్లాసెస్‌ అందిస్తోంది.  కరోనా తర్వాత తమ నూతన విద్యార్థుల సంఖ్య పరంగా 200 శాతానికి పైగా వృద్ధి నమోదయిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తుండటం విశేషం. 

ప్రణాళిక లేకుండా, అప్పటికప్పుడు అంటూ ఆన్‌లైన్‌ అభ్యాసం వైపు మళ్లడం, సరైనశిక్షణ లేకపోవడం, బ్యాండ్‌విడ్త్‌ తగినంత లేకపోవడం, సరైన సంసిద్ధత లోపించడం వల్ల గత సంవత్సరం చాలా వరకూ పాఠశాలలు తమ విద్యార్థులకు సరైన అనుభవాలను అందించలేకపోయాయి కానీ ఈ విద్యాసంవత్సరంలో  ఆ లోపాలు సరిదిద్దుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.


ఆఫ్‌లైన్‌కు ప్రత్యామ్నాయమా ?

కరోనా కాలంలో స్మార్ట్‌ఫోన్‌, విద్యారంగంలో అపూర్వమైన మార్పులు తీసుకువచ్చింది. దానితో పాటుగా ఎడ్‌టెక్‌ సంస్థలకు భారీ అవకాశాలనే అందించింది. విద్యారంగంలో ఇంటరాక్షన్స్‌ పెరగడానికీ దోహదపడింది. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు,  టీచర్లతో ఇంటరాక్ట్‌ కావడానికి అభ్యాస యాప్‌లు మరిన్ని అవకాశాలు  కల్పిస్తున్నాయి. అలాగే తమ పిల్లల వృద్ధి ఎలా ఉందో తల్లిదండ్రులు తెలుసుకునేందుకుకూడా తోడ్పడుతున్నాయి. అదే సమయంలో నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు అభ్యసించేందుకు అపూర్వమైన అవకాశాలూ అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బుక్స్‌, టెస్ట్‌ పేపర్లు లాంటివి ఎన్నో అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు మరింతగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఎడ్‌టెక్‌ వేదికలపై ఖర్చు కూడా కాస్త తక్కువ అవుతుంది. అదే సమయంలో వాస్తవ సమయంలో తమ ప్రతిభను తెలుసుకునే అవకాశమూ విద్యార్థికీ చిక్కుతుందంటున్నారు పలు యాప్‌ల ప్రతినిధులు.


అయితే ఆన్‌లైన్‌ విద్య ప్రభావవంతమైనదేనా అని అంటే, భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సరైన సాంకేతికతలు లభ్యమైతే, ఆన్‌లైన్‌ అభ్యాసం ఎన్నో విధాలుగా ప్రభావవంతంగా ఉంటుందంటున్నాయి అధ్యయనాలు. దాని ప్రకారం క్లాస్‌రూమ్‌ అభ్యాసంలో 8 నుంచి పది శాతం మాత్రమే గుర్తుంచుకునే విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌ అభ్యాసంలో 25 నుంచి 60 శాతం గుర్తుంచుకునేందుకు అవకాశం ఉంది. కాకపోతే సరైన సాంకేతిక విధానంలో ఈ అభ్యాసం కొనసాగాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో విద్యార్థులు వేగంగా నేర్వగలరు. సంప్రదాయ క్లాస్‌ రూమ్‌తో పోలిస్తే ఈ -లెర్నింగ్‌కు 40 నుంచి 60 శాతం తక్కువ సమయం సరిపోతుందని కూడా ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యమంటే తమదైన సొంత వేగంతో విద్యార్థులు నేర్చే అవకాశంతో పాటుగా క్లాస్‌లను కావాల్సినప్పుడు వినే అవకాశం, తమకు కావాల్సిన నేపథ్యాలను మరల మరల చూసుకోవడం కూడా తోడ్పడుతుందని అవి వెల్లడిస్తున్నాయి. ఇటీవల లీడ్‌ స్కూల్‌ నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. అయితే ఆన్‌లైన్‌ అభ్యాసంతో అందరూ నేర్చుకుంటారని చెప్పలేం. 

తల్లిదండ్రులే సహాయపడాలి...

ఎడ్‌టెక్‌ రంగంలోకి మరింత మంది వస్తున్నారు. అత్యున్నత శ్రేణి ప్రొఫెషనల్స్‌ సైతం ఈ రంగంలోకి వస్తుండటంతో జనరల్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌, ప్రొడక్ట్‌ స్కిల్స్‌, టెక్‌ స్కిల్స్‌, మార్కెటింగ్‌ స్కిల్స్‌ను సైతం నేర్చే అవకాశం లభిస్తుంది. ఆన్‌లైన్‌ విద్యకు ప్రధాన అవరోధాలంటే మన దేశంలో 70 శాతం కుపైగా విద్యార్థులు టియర్‌ 2 పట్టణాలలోనే ఉన్నారు. అక్కడ వారికి నాణ్యమైన విద్య లభించడం లేదు. ఈ కారణం చేతనే ఇండియా మరియు భారత్‌ నడుమ విద్యార్థుల్లో అభ్యాసపరంగా తేడాలను చూస్తున్నాం. విద్యలో సాంకేతికత రంగప్రవేశం భారత్‌లోని చిన్నారులకు అత్యుత్తమ వనరులు, అత్యంత అందుబాటు ధరలో పొందేందుకు తోడ్పడుతుంది. 

- సుమీత్‌ మెహతా, కొ-ఫౌండర్‌ అండ్‌ సీఈఓ, లీడ్‌


సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపైనే ఆసక్తి

ఇంటరాక్టివిటీ అనేది చాలా స్కూల్స్‌లోనే కాదు, అవి అందించే ఆన్‌లైన్‌ తరగతులలోనూ లేదు. కానీ ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ అవకాశం తొలినుంచి ఉంది. డౌట్‌ సాల్వింగ్‌, పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌, మెంటార్‌షిప్‌ వంటివి అన్‌అకాడమీలో లభిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు అతిపెద్ద సవాల్‌గా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ నిలుస్తుంది. మరీ ముఖ్యంగా టియర్‌ 2, టియర్‌ 3 నగరాలలో  బేసిక్‌ స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు  క్లాసె్‌సకు హాజరుకావొచ్చనే భరోసా తాము కల్పిస్తున్నాము. ఆన్‌లైన్‌ విద్యలో  సౌకర్యం ఎక్కువ. మరీముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారో పర్యవేక్షించడానికి తోడ్పడుతుంది.  హైదరాబాద్‌లో ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఏపీపీఎ్‌ససీ, టీఎ్‌సపీఎ్‌ససీ)  ఎంచుకుంటున్నారని అన్‌ అకాడమీ అంటుంది. వీటితో పాటుగా గేట్‌, ఈఎ్‌సఈ, జెఈఈ లాంటి కోర్సులను కూడా ఎక్కువ మంది ఇక్కడ తీసుకుంటున్నారు.

- అన్‌అకాడమీ అధికార ప్రతినిధి

5-7 రెట్లు వృద్ధి 

ఈ-లెర్నింగ్‌తో సవాల్‌ అంటే స్ర్కీన్‌ టైమ్‌. కానీ నిర్మాణాత్మక విధానంలో అభ్యాసం కొనసాగితే ప్రయోజనాలే అధికంగా ఉంటాయి. హైదరాబాద్‌లో మా ప్లాట్‌ఫామ్‌పై 5వేల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. గత సంవత్సర కాలంగా వీరంతా ఎంపవర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్నారు. ఇప్పుడు నూతన విద్యాసంవత్సరం ఆరంభం కావడంతో రాబోయే 1-2 నెలల్లోనే ఈ సంఖ్య 5-7 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.

- జెరాల్డ్‌ చగస్‌ పెరీరా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎం-పవర్‌

ప్రభావవంతమైన బోధన కోసం..

తల్లిదండ్రులు, పిల్లలు ఒకే ఫోన్‌ వాడటం కూడా సవాల్‌గా నిలుస్తుంది. ప్రాక్టికల్లీని గత సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల చేశాం. దాదాపు 3.3 లక్షల డౌన్‌లోడ్స్‌ జరిగాయి. ఇండియాలో 200కు పైగా పాఠశాలతో పాటుగా 18వేల మంది టీచర్లు వాడుతున్నారు. అనుభవపూర్వక అభ్యాసం అందించడంతో పాటుగా అనుమానాల నివృత్తి కోసం పలు బోధనాంశాలలో నిపుణులను అందుబాటులో ఉంచడం, లైవ్‌ క్లాసెస్‌ వంటివి చిన్నారులకు తోడ్పడుతున్నాయి.

- చారు నోహారియా, కో-ఫౌండర్‌ అండ్‌ సీఓఓ, ప్రాక్టికల్లీ

Tags :