Education-Article
రిస్క్‌ లెక్కింపులో కీలకం యాక్చూరియల్‌ సైన్స్‌

కొవిడ్‌ సంక్షోభంలో ప్రస్తావనకు వస్తున్న మరో అంశం ఇన్సూరెన్స్‌. హెల్త్‌ పాలసీ ఉన్న వ్యక్తులు నేరుగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. పాలసీ ఉన్నందున వారి చికిత్సకు అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్‌ కంపెనీ భరిస్తుంది. అయితే ఇన్సూరెన్స్‌కు తోడు పలు ఆర్థిక సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలకు రిస్క్‌ విషయంలో సలహాలు ఇచ్చే వృత్తి నిపుణులే యాక్చూరీలు. సీఏ, సీఎంఎస్‌, సీఎస్‌ మాదిరిగానే సంబంధిత కోర్సు నిర్వహణ, వృత్తిపరమైన అంశాలపై అజమాయిషీ చేసే సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చూరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ). ఈ సంస్థ నిర్వహించే యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏసెట్‌) రాయాలి. తద్వారా కోర్సు చేసే అవకాశం కలుగుతుంది. ఈ ప్రకటన ఏటా రెండు సార్లు వెలువడుతుంది. జూన్‌ సెషన్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది.


చిన్నప్పటి నుంచి లెక్కల్లో చురుగ్గా ఉన్న యువత ఈ కోర్సులో తదుపరి వృత్తిలో బాగా రాణిస్తారు. అయితే, ఇంటర్‌ తరవాత యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సు చేయడం చాలా మంచిది. ప్రధానంగా దేశ విదేశాల్లో ఆర్థిక గణకులకు అలాగే యాక్చూరీలకు మంచి డిమాండ్‌ ఉంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడటానికి కార్పొరేట్‌ కంపెనీలు సైతం యాక్చూరీల సలహాలను తీసుకుంటాయి. భారీ ప్యాకేజీలను కూడా ఆఫర్‌ చేస్తుంటాయి. 


అర్హతలు

ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న వారూ దరఖాస్తు  చేసుకోవచ్చు. మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులపై పట్టున్నవారు యాక్చూరియల్‌ సైన్స్‌ను సులువుగా అర్థం చేసుకుంటారు.


రాతపరీక్ష వివరాలు

ఈ పరీక్షను ఆన్‌లైన్‌ హోమ్‌ బేస్డ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా టెక్నికల్‌ పరికరాలు    (హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌) కలిగి ఉండాలి. అంటే పరీక్షకు అవసరమైన ఇంటర్నెట్‌, వెబ్‌ కెమెరా, విండోస్‌ 10/8/7 వెర్షన్‌ తదితర సౌకర్యాలు ఉంటేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంగ్లీష్‌, డేటా ఇంట్రప్రెటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం మూడు గంటలు. మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సెక్షన్‌-ఏలో ఒక మార్కు ప్రశ్నలు 45, సెక్షన్‌-బిలో రెండు మార్కుల ప్రశ్నలు 20, సెక్షన్‌-సీలో మూడు మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. సబ్జెక్టుల వారీగా మేథ్స్‌ (30 మార్కులు), స్టాటిస్టిక్స్‌ (30 మార్కులు), డేటా ఇంట్రప్రెటేషన్‌ (15మార్కులు), ఇంగ్లీష్‌ (15మార్కులు), లాజికల్‌ రీజనింగ్‌ (10మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షలో నెగెటివ్‌ మార్కులు ఉండవు. అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు వస్తే అర్హత సాధించినట్టు పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో  హైదరాబాద్‌,  విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 24 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.


వివిధ దశలు

కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు యాక్చూరీ ఫెలో అయ్యేందుకు మొత్తం 13 పేపర్లను పూర్తి       చేయాల్సి ఉంటుంది. స్టేజ్‌కోర్‌ ప్రిన్సిపల్స్‌లో 7, స్టేజ్‌కోర్‌ ప్రాక్టీసె్‌సలో 3 పేపర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. ఈ రెండు దశలను పూర్తిచేసిన వారిని అసోసియేట్‌గా పరిగణిస్తారు. స్టేజ్‌ స్పెషలిస్ట్‌ ప్రిన్సిపల్స్‌లోని 8 పేపర్లలో అభ్యర్థులు తమకు నచ్చిన రెంటిని ఎంపిక చేసుకొని పూర్తిచేయాలి. స్టేజ్‌ స్పెషలిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌లో ఏదైనా ఒక పేపరు పాసవ్వాలి. ఈ క్రమంలో ఏ స్టేజ్‌ పాసైనా ఉద్యోగం లభించడం ఖాయం. 


పరీక్షలో మొత్తం అయిదు విభాగాలకు చెందిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.


మేథ్స్‌:  గణితంపై పట్టు ఉండాలి. పరీక్షలో ఈ టాపిక్‌ నుంచి అడిగే  ప్రశ్నలు కొద్దిగా కఠినంగా ఉన్నప్పటికీ సాధన చేస్తే సులభమే. ఈ విభాగంలో నొటేషన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఫంక్షన్స్‌, న్యూమరికల్‌ మెథడ్స్‌, ఆల్‌జీబ్రా, డిఫరెన్షియేషన్‌, ఇంటిగ్రేషన్‌, వెక్టర్స్‌, మాట్రిసెస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

స్టాటిస్టిక్స్‌: పర్మిటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌, టైప్స్‌ ఆఫ్‌ డేటా నుంచి స్టాటిస్టికల్‌ డయాగ్రమ్స్‌, బార్‌ చార్ట్‌, హిస్టోగ్రామ్‌, డాట్‌ ప్లాట్‌, స్టెమ్‌ అండ్‌ లీఫ్‌, బాక్స్‌ ప్లాట్‌ నుంచి అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అలాగే మేజర్స్‌ ఆఫ్‌ లొకేషన్‌, మెజర్స్‌ ఆఫ్‌ స్ర్పెడ్‌కు సంబంధించి మీన్స్‌, మీడియన్‌, మోడ్‌, రేంజ్‌, ఇంటర్‌ క్వార్ట్‌టైల్‌ రేంజ్‌, స్టాండర్డ్‌ డీవియేషన్‌, వేరియెన్స్‌తోపాటు ప్రాబబిలిటీస్‌, అడ్వాన్స్‌డ్‌ ప్రాబ బిలిటీస్‌ డిస్ర్కీట్‌ రాండమ్‌ వేరియబల్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.


ఇంగ్లీష్‌: దీనిలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఇది హైస్కూల్‌ స్థాయిలోనే ఉంటుంది. ఇంగ్లీష్‌ గ్రామర్‌ నియమాలు తెలిస్తే సమాధానాలను గుర్తించవచ్చు. ఒకాబులరీ, గ్రామర్‌కు సంబంధించిన అంశాల నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఒకాబులరీలో సినానిమ్స్‌, ఆంటోనిమ్స్‌, మీనింగ్స్‌ ఆఫ్‌ వర్డ్స్‌, సెకండరీ షేడ్స్‌ ఆఫ్‌ మీనింగ్‌, యూసేజ్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ నుంచి అడుగుతారు. గ్రామర్‌లో సెంటెన్స్‌ కరెక్షన్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెట్స్‌, ఖాళీలు పూరించడం, ప్యాసేజ్‌లు ఇస్తారు. ఆంగ్ల పత్రికలు చదవడం ద్వారా భాషపై పట్టు పెరిగి ఎక్కువ మార్కులు సాధించవచ్చు. వెర్బల్‌ రీజనింగ్‌లో పదాలు, వాక్యాల సమూహాల్లో సంబంధాలు, నమూనాలను గుర్తించాలి. 

డేటా ఇంట్రప్రెటేషన్‌: ఈ విభాగంలో ప్రశ్నలు పట్టికల రూపంలో ఉంటాయి. ఇందుకోసం గణిత అంశాలు, సూత్రాలపై దృష్టి పెట్టాలి. టేబుల్స్‌ స్క్వేర్‌, స్క్వేర్‌ రూట్స్‌ గుర్తుంచుకోవడం ముఖ్యం. కాలమ్‌ గ్రాఫ్‌, బార్‌ గ్రాఫ్స్‌, లైన్‌ చార్ట్స్‌, పై చార్ట్స్‌, వెన్‌ డయాగ్రమ్‌, కేస్‌లెట్స్‌ నుంచి అడుగుతారు. నమూనా ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నలు ఎలా వస్తున్నాయో అర్థమవుతాయి. సమస్యలపై సైద్ధాంతిక భావనలను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి.


లాజికల్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో లాజికల్‌గా ఆలోచించి సమాధానాలు కనిపెట్టాల్సి ఉంటుంది. అభ్యర్థుల తార్కిక ఆలోచన విధానాన్ని పరిశీలిస్తారు. నంబర్స్‌ అండ్‌ లెటర్‌ సిరీస్‌, కాలెండర్‌, క్లాక్స్‌, క్యూబ్స్‌, వెన్‌ డయాగ్రామ్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, లాజికల్‌ సీక్వెన్స్‌, మ్యాచింగ్‌, సిలోజియం, బ్లడ్‌ రిలేషన్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే ఏదైనా ప్యాసేజ్‌ ఇచ్చి అందులో నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానం గుర్తించాలి. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించాలంటే సాధనే కీలకం. వీలైనన్ని షార్ట్‌కట్స్‌ ఉపయోగించి ప్రశ్నలను సాధిస్తే సమయం మిగులుతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 2 

పరీక్ష(ఏసెట్‌) తేదీ: జూన్‌ 26

వెబ్‌సైట్‌: www.actuariesindia.org/index.aspx

Tags :