Education-Article
ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేశాం

హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం..  విచారణ జూన్‌ 2కి వాయిదా

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు, న్యాయస్థానం సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల రేపటి(మే 5) నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించిందని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు వివరించారు. మళ్లీ పరీక్ష నిర్వహణకు ఏమైనా తేదీలు ఖరారు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. లేదని ఏజీ సమాధానం ఇచ్చారు. కరోనా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి షెడ్యూల్‌ ప్రకటనకు ముందు విద్యార్థులకు తిగిన సమయం ఇస్తారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీ బదులిస్తూ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. అదేసమయంలో పదోతరగతి పరీక్షలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వివరించారు. 


పరీక్షల నిర్వహణకు ఇంకా నాలుగువారాల సమయం ఉన్నందున అప్పటికి ఉన్న పరిస్థితులను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం విచారణను జూన్‌ 2కి వాయిదా వేసింది. ఆ లోపు ప్రభుత్వ చర్యలపై పిటిషనర్లకు ఏమైనా అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ను పరిగణించకుండా టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థి పొట్లూరి దర్శత్‌, పదవ తరగతి విద్యార్థి ఎస్‌. వేణుమాధవ్‌, ముళ్లపూడి రమేశ్‌ చౌదరి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. 2020-21 ఏడాది టెన్త్‌, ఇంటర్మీడియల్‌ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై సోమవారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 


Tags :