Education-Article
టీఎస్‌పీఎస్సీలో ఖాళీలు భర్తీ చేయండి

లేదా మూసేసి, భవనం ఖాళీ చేయండి

చైర్మన్‌, సభ్యులను నాలుగు వారాల్లోగా 

నియమించాలి.. హైకోర్టు ఆదేశాలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు చైర్మన్‌, 9 మంది సభ్యులను నాలుగు వారాల్లోగా నియమించాలని లేని పక్షంలో మూసివేసి భవనాన్ని ఖాళీచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చివరి సభ్యుని పదవీ కాలం పూర్తయిన తర్వాత మూసివేస్తే ఆ భవనం మరో అవసరానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించింది. ముఖ్యమైన సంస్థలో ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. టీఎస్‌పీఎస్సీని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోందా? అని నిలదీసింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యులను నియమించాలని కోరుతూ జె. శంకర్‌ అనే నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించారు.


పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి వాదించారు. కమిషన్‌ చైర్మన్‌ పదవీ కాలం నిరుడు డిసెంబరుతో ముగిసిందని, 9మంది సభ్యుల్లో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఉన్నారని, ఆయన పదవీ కాలం ఆగస్టుతో ముగియనున్నదని కోర్టుకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో ఖాళీల భర్తీకి ఏం చర్యలు చేపట్టారని సీజే హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం స్పెషల్‌ జీపీ హరేంద్ర ప్రసాద్‌ను ప్రశ్నించింది. ముఖ్యమైన సంస్థలో ఖాళీలు భర్తీ చేయకపోతే దాని ఉపయోగం ఏమిటని నిలదీసింది.


Tags :