Education-Article
టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేయాలి

కేఏ పాల్‌ నిరాహార దీక్ష 

సిరిపురం (విశాఖపట్నం), ఏప్రిల్‌ 29: ‘‘రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఈ సమయంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించడం సరికాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు’’ అని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ అన్నారు. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ గురువారం విశాఖలోని పాల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ తాను వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిందన్నారు. శుక్రవారం వాదనలు జరుగుతాయని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలను రెండు నెలలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నట్టు పాల్‌ తెలిపారు. 


పరీక్షలపై 2న అఖిలపక్షం: సీపీఐ

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): కరోనా, పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై మే 2న విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, మేధావులతో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇతర విషయాలను పక్కనపెట్టి కరోనా నియంత్రణే ఏకైక ఎజెండాగా పెట్టుకోవాలని సూచించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దైన్యం రాజ్యమేలుతోందని, ఎటు చూసినా కరోనా విలయ తాండవం చేస్తోందని, వైద్యం అందక, బెడ్లు, ఆక్సిజన్‌ దొరకక రోగులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. మెడికల్‌ మాఫియాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కరోనా విలయం సృష్టిస్తుంటే 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామనే మొంకిపట్టుతో ప్రభుత్వం ముందుకు సాగడం విచారకరమన్నారు. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఆక్షేపించారు. విద్యార్థులకు గ్రేడింగ్‌ ఉండి, ప్రాణాలు లేకపోతే ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. ‘లక్షలాది విద్యార్థుల ప్రాణాలకు ప్రభుత్వం భద్రత కల్పించగలదా? అందుకు బాధ్యత వహిస్తుందా?’ ఈ ప్రశ్నలకు సీఎం, విద్యామంత్రి  సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరీక్షల నిర్వహణ వల్ల రానున్న మహా విపత్తును ఇప్పటికైనా గుర్తించి 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని కోరారు.

ఇంటర్‌ బోర్డు వద్ద ఎస్‌ఎ్‌ఫఐ ధర్నా 

విజయవాడ(రామలింగేశ్వరనగర్‌), ఏప్రిల్‌ 29: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, రెండవ సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విజయవాడలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం వద్ద సంఘం నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్న కుమార్‌ మాట్లాడారు. కరోనా విషమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షలు ముఖ్యమా, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఎస్‌ఎ్‌ఫఐ విద్యార్థులు బోర్డు కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వబోతే కార్యాలయంలో ఉండి కూడా కమిషనర్‌ తీసుకోలేదని విమర్శించారు. విద్యార్థుల పట్ల కమిషనర్‌ రామకృష్ణ తీరు సరిగా లేదని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎన్‌.కోటి, రాష్ట్ర కమిటి సభ్యురాలు పూర్ణచంద్రిక తదితరులు పాల్గొన్నారు.

Tags :