Education-Article
విద్యార్థుల భద్రత ప్రభుత్వ బాధ్యత

వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నాం

అన్ని సెంటర్ల వద్ద కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలు

పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఆర్‌ఐవోలకు ఆదేశాలు

ఇంటర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఇంటి వద్ద నుంచే తమ సీటూ తెలుసుకోవచ్చు

దీనికోసం ఎగ్జామ్‌ సెంటర్‌ లొకేటర్‌ యాప్‌

ప్రతిరోజూ పరీక్ష  కేంద్రాల శానిటైజేషన్‌: మంత్రి


అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్థుల భద్రత ప్రభుత్వ బాధ్యత ని రాష్ట్ర విద్యాశాఖ  మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని కోరారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 5 నుంచి చాలా జాగ్రత్తగా ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొత్తం 1,452 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సగటున జిల్లాకు 80కిపైగా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్ల వద్ద కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ఈ పనులను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఆర్‌ఐవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఇంటి వద్ద నుంచే పరీక్ష కేంద్రంలోని సీటు తెలుసుకునే ఏర్పాటు చేశామని చెప్పారు. ఐపీఈ ఎగ్జామ్‌ సెంటర్‌ లొకేటర్‌ పేరిట యాప్‌ను రూపొందించామని, ఈ యాప్‌ను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష కేంద్రంలో సీటు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ‘పరీక్ష కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ వినియోగం సహా ఇతర నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షల మెటీరియల్‌ను సంబంధిత కేంద్రాలకు ఇప్పటికే పంపించాం. ప్రశ్నపత్రాలను సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు పంపుతున్నాం’ అని తెలిపారు. 


పాజిటివ్‌ విద్యార్థులకు ఇప్పుడు కాదు..

కొవిడ్ పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు ఇప్పుడు పరీక్షలు రాయకూడదని, వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్‌ చెప్పారు. ‘వారికి రెగ్యులర్‌ పరీక్షల తరహాలోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం. రెగ్యులర్‌ విధానంలో పాసైనట్లుగానే ఆ విద్యార్థులకు ధ్రువపత్రాలు జారీ చేస్తాం’ అని తెలిపారు. కరోనా లక్షణాలున్న విద్యార్థుల కోసం ఐసొలేషన్‌ గదులను ఏర్పాటు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద ఉండే సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తా మని మంత్రి సురేశ్‌ తెలిపారు. ‘జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది కొవిడ్‌ స్పెషల్‌ అధికారులను నియమించాం. కేంద్రాల వద్ద స్క్వాడ్లు, మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు, థర్మల్‌ స్కానర్లు, మాస్కులు అందుబాటులో ఉంచుతాం. ప్రతి రోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయాలని ఆదేశాలిచ్చాం’ అని మంత్రి చెప్పారు. 


Tags :