Education-Article
ఆలిండియా ప్రీ మెడికల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

వైద్య విద్యనభ్యసించే ప్రతిభావంతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్ధేశించిన ‘ఆలిండియా ప్రీ మెడికల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (సెకండరీ) 2021’ నోటిఫికేషన్‌ వెలువడింది. ఎంబీబీఎస్‌ సహా డెంటల్‌, హోమియో, యునానీ, ఆయుర్వేద విభాగాల్లో మెడికల్‌ డిగ్రీ కోర్సులు చేసే అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.  ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ కాలేజీల్లో ప్రవేశం పొందినవారికి ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ప్రకారం విడివిడిగా స్కాలర్‌షిప్పులు అందిస్తారు. 


అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా అర్హులే.  అభ్యర్థులు 1995 అక్టోబరు 1(ఈ తేదీ సహా) తరవాత జన్మించి ఉండాలి. ‘నీట్‌’లో అర్హత సాధించి గుర్తింపు పొందిన వైద్య కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి.


పరీక్ష వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ ప్రొఫిషియెన్సీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌/ పన్నెండో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం మార్కులు 800. రుణాత్మక మార్కులు ఉన్నాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే  కేటాయించిన మార్కుల్లో పావు వంతు అంటే 1 మార్కు కోత విధిస్తారు. మొబైల్స్‌, క్యాలిక్యులేటర్లు, లాగ్‌ టేబుల్స్‌, నోట్‌బుక్‌ తదితరాలను ఎగ్జామినేషన్‌ హాల్‌లోకి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డు సహా వ్యక్తిగత గుర్తింపు పత్రం (డ్రైవింగ్‌ లైసెన్స్‌/ పాస్‌పోర్ట్‌/ పాన్‌ కార్డ్‌/ ఓటర్‌ ఐడీ/ ఆధార్‌ కార్డ్‌/ స్కూలు లేదా కాలేజ్‌ ఐడీ కార్డు)తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.


స్కాలర్‌షిప్‌ వివరాలు: ‘నీట్‌’లో అర్హత పొందిన అభ్యర్థులు ముందుగా మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేసుకోవాలి. దీనికి సంబంధించిన ధృవపత్రాలను ఏఐపీఎంఎ్‌సటీ నిర్వహణ సంస్థకు సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీ విభాగాల్లో ఒక్కోదానిలో 2,600 చొప్పున మొత్తం 7,800 స్కాలర్‌షిప్పులు ఉన్నాయి.


ప్రభుత్వ కాలేజీల్లో చేరినవారికి...: స్కాలర్‌షిప్‌ టెస్టులో 90 శాతానికి మించి మార్కులు వచ్చిన 100 మందికి నాలుగేళ్లపాటు ట్యూషన్‌ ఫీజు ఇస్తారు. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు వచ్చిన 500 మందికి ఏడాదిపాటు ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు.


ప్రైవేటు, విదేశీ కాలేజీల్లో చేరినవారికి...: స్కాలర్‌షిప్‌ టెస్టులో 90 శాతానికి మించి స్కోరు సాధించినవారిని విభాగానికి 100 మంది చొప్పున మొత్తం 200 మందికి ఏడాదిపాటు 50 శాతం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు వచ్చిన వారిని విభాగానికి 500 చొప్పున మొత్తం 1000 మందికి ఏడాదిపాటు 25 శాతం ట్యూషన్‌ ఫీజు ఇస్తారు.


స్కాలర్‌షిప్‌ టెస్టులో 75 నుంచి 80 శాతం మధ్య మార్కులు వచ్చినవారిని విభాగానికి 2000 మంది చొప్పున మొత్తం 6,000 మందికి స్టాండర్డ్‌ ల్యాప్‌టాప్‌ బహూకరిస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1275; దివ్యాంగులు, మహిళలకు రూ.1075

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 22

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడింగ్‌: జూన్‌ 3 నుంచి

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌.

ఏఐపీఎంఎ్‌సటీ తేదీలు: జూన్‌ 12, 19, 26, 29

ఫలితాలు విడుదల: జూలై 5

ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌: జూలై 8, 12

వెబ్‌సైట్‌: aipmstsecondary.co.in


Tags :