హైదరాబాద్‌లో బీటెక్ దొంగలు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
హైదరాబాద్‌లో బీటెక్ దొంగలు
ఉన్నత చదువు కోసం నగరానికి వచ్చి జల్సాల కోసం దోపిడీలు
పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి
తల్లిదండ్రులనుమోసం చేస్తున్న ప్రబుద్ధులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువు కోసం నగరానికి వచ్చిన కొంతమంది ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తుండగా.. మరికొంతమంది చెడు సహవాసాలు, వ్యసనాలకు బానిసలై చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. కళాశాలకు వెళ్లకుండా, పరీక్షలు రాయకుండా తల్లిదండ్రులను మోసం చేస్తూ.. సినిమాలు, షికార్లు, ప్రేమ, పబ్బులు, క్లబ్‌లు అంటూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. జల్సాల కోసం దొంగలుగా మారి పోలీసులకు చిక్కుతున్నారు. జైల్లో కటకటాలు లెక్కిస్తూ భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఈ నెల 8న రాచకొండ పోలీసులకు చిక్కిన బీటెక్‌ విద్యార్థుల దొంగల ముఠా ఉదంతమే ఇందుకు నిదర్శనం.
 
ఇంజనీరింగ్‌ విద్య కోసం నగరానికి వచ్చి చదువును గాలికొదిలేసి వార్షిక పరీక్షల్లో ఫెయిలై జల్సాలు, సిగరెట్‌, గంజాయి, మద్యం లాంటి చెడు వ్యసనాలకు బానిసలై వాటికోసం దొంగతనాలు చేస్తూ ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఇటీవల చిక్కి కటకటాల పాలయ్యారు కొంతమంది బీటెక్‌ విద్యార్థులు. నలుగురు సభ్యులున్న ఈ ముఠాలో ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు కాగా.. ఒకరు పాలిటెక్నిక్‌ కోర్సు చేస్తున్నాడు. వారి భవిష్యత్‌ కోసం తల్లిదండ్రుల శ్రమ అంతా ఇంతా కాదు. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.
 
కూలి పనిచేసి చదివిస్తున్న తండ్రి
బీటెక్‌ దొంగల ముఠాలో మొట్టమొదటి ముద్దాయి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, హనుమాన్‌కు చెందిన చావన్‌ సూరజ్‌. ఇతడి తండ్రి రోజువారీ కూలీ. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేస్తూ ఇంటికి పెద్దవాడైన సూరజ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలో ఇంజనీరింగ్‌ చదివిస్తున్నారు. బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అతడు మన్సూరాబాద్‌లో ఉంటున్నాడు. చెడు స్నేహాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడి సరదాలు తీర్చుకోవడానికి, లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి కళాశాలకు వెళ్లడం మానేశాడు. పరీక్షల్లో ఫెయిలయ్యాడు. జల్సాల మోజులో పడి మరికొంతమంది స్నేహితులతో కలిసి ముఠా ఏర్పాటుచేసి దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు చేయడం మొదలు పెట్టాడు. తండ్రి అనారోగ్యంతో ఇటీవల మంచాన పడినా పట్టించుకోలేదు. ఇంటికి పెద్దదిక్కుగా ఉండి కుటుంబ భారాన్ని మోయాల్సింది పోయి దొంగగా మారాడు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
 
బొగ్గుగని కార్మికుడి కొడుకు...
ఈ ముఠాలోని రెండో ముద్దాయి కొమ్ము పవన్‌కుమార్‌. భూపాలపల్లి జిల్లా, రాజీవ్‌నగర్‌కు చెందిన ఇతడు సూరజ్‌కు చిన్నప్పటి నుంచి స్కూల్‌మెట్‌. పవన్‌కు ఇద్దరు అక్కలు, అన్న ఉన్నాడు. తండ్రి సింగరేణి బొగ్గుగనిలో కార్మికుడు. అందరిలో చిన్నవాడైన పవన్‌ను ఇంజనీరింగ్‌ చదువుకోసం నగరానికి పంపాడు తండ్రి. మన్సూరాబాద్‌లో ఉంటూ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి వద్దకు సూరజ్‌ వచ్చాడు. మద్యం, జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడి చోరీలు చేయడం మొదలు పెట్టాడు. బొగ్గు గనిలో పనిచేస్తూ చిన్న కొడుకును ప్రయోజకుడిని చేయాలనుకున్న తండ్రి ఆశయాన్ని తుంగలో తొక్కాడు.
 
తండ్రి పోలీస్‌..కుమారుడు దొంగ
ఈ ముఠాలో ఉన్న మరో విద్యార్థి మామిడి రోహిత్‌కుమార్‌. తండ్రి ఖమ్మంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన రోహిత్‌ను ప్రయోజకుడిని చేయాలని ఇంజనీరింగ్‌ చదువు నిమిత్తం నగరానికి పంపించాడు. ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న రోహిత్‌ మాత్రం తండ్రి ఆశయాన్ని పెడచెవిన పెట్టాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాడు. మద్యం, గంజాయి, సిగరెట్లు అంటూ వ్యసనాలకు బానిసయ్యాడు. చదువు అటకెక్కింది. పరీక్షల్లో ఫెయిలై డిటెండ్‌ అయ్యాడు. అయినా అతడిలో మార్పు రాలేదు. వ్యసనాలను మానుకోలేక దొంగగా మారాడు. మహిళలు, వృద్ధుల మెడలోని నగలను దోచుకోవడం మొదలుపెట్టాడు. పోలీసులకు పట్టుబడి జైలుపాలయ్యాడు.
 
పాలిటెక్నిక్‌ చదువు ఆపేసి చోరీలు
ఈ ముఠాలోని మరో నిందితుడు హైదరాబాద్‌ పూల్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఒవైసీ అహ్మద్‌. ఇతడు పాలిటెక్నిక్‌ విద్యార్థి. తండ్రి ఫంక్షన్‌హాల్లో డెకొరేషన్‌లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంపాదన అంతంత మాత్రమే. కొడుకు బాగా చదువుకొని ఉద్యోగంలో సంపాదిస్తే ఆసరాగా ఉంటాడని తండ్రి ఆరాటం. అహ్మద్‌ అవేమీ పట్టంచుకోలేదు. చదువు మధ్యలోనే ఆపేశాడు. సూరజ్‌, పవన్‌, రోహిత్‌కుమార్‌తో పరిచయం ఏర్పడటంతో వారితోపాటు జల్సాలకు అలవాటుపడ్డాడు. అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. స్నేహితుల వద్ద బైక్‌ తీసుకొని తెల్లవారు జామున, సాయంత్రం సమయంలో కాలనీలో తిరిగేవారు. ఒంటరిగా వెళుతున్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని చైన్‌స్నాచింగ్‌లు చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. మొత్తం 18 చోరీలు చేశారు. నిందితుల నుంచి పోలీసులు 540 గ్రాముల బంగారు నగలు, నాలుగు ద్విచక్రవాహనాలుసహా మొత్తం రూ. 17 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
 
పిల్లలను తల్లిదండ్రులు గమనించాలి
నగరంలో చదువుతున్న తమ పిల్లలను గ్రామాల్లో ఉంటున్న తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారు చదువుతున్న కళాశాలలకు ఫోన్‌ చేసి ఎలా చదువుతున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే నగరానికి వచ్చి వారు చేస్తున్న పనులను కనిపెట్టాలి. ఈ మధ్య కొంతమంది యువతులు కూడా సిగరెట్లు, మద్యం, గంజాయికి అలవాటుపడుతున్నారు. అలాంటి వారిపట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
- పృథ్వీధర్‌రావు, ఏసీపీ ఎల్‌బీనగర్‌