క్యాంపస్‌లో కల్లోలం.. భారీగా పడిపోయిన సెలక్షన్లు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
క్యాంపస్‌లో కల్లోలం.. భారీగా పడిపోయిన సెలక్షన్లు
గతంలో వందల్లో.. ఈసారి పదుల్లో
ముఖం చాటేస్తున్న టాప్‌ ఎంఎన్‌సీలు..
ప్రముఖ కాలేజీల్లోనూ దయనీయ స్థితి
హైదరాబాద్‌, రంగారెడ్డిల్లోనూ అంతంతే..
ఇంజనీరింగ్‌ విద్యలో సంక్షోభం

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కళాశాల. నగరంలోనే కాదు.. రాష్ట్రంలోనే అత్యధికంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు ప్రసిద్ధి. అక్కడ సెప్టెంబరు, అక్టోబరు నుంచే ‘ఆన్‌ క్యాంపస్‌’ హడావిడి మొదలవుతుంది. ప్రముఖ కంపెనీలు టాప్‌ టాలెంట్‌ను జల్లెడ పట్టి భారీ ప్యాకేజీలతో ఎగరేసుకుపోతాయి. ఈ ఒక్క కారణంతోనే ఆ కళాశాలలో ప్రవేశాలకు రాష్ట్రంలోనే ఎనలేని డిమాండ్‌ ఉంది. లక్షల్లో డొనేషన్లు ఇచ్చి మరీ ప్రవేశాలు పొందేవారు. ఇది గతం.. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. తమ కళాశాలను సందర్శించాలని అభ్యర్థిస్తున్నా ప్రముఖ ఎంఎన్‌సీలు పట్టించుకోవడం లేదు. కొన్ని కంపెనీలు వస్తున్నా.. నియామకాలు రెండంకెలకూ (పదిలోపే) చేరుకోవడం లేదు. చిన్న చితకా కంపెనీలే ఆ కళాశాలకు ఇప్పుడు పెద్ద దిక్కుగా తోస్తున్నాయి. హైదరాబాద్‌లోని 30 కాలేజీల్లో గత ఏడాది దాదాపు 20 శాతం క్యాంపస్‌ ద్వారా ఉద్యోగాలు పొందితే.. ఈసారి పది శాతం కూడా దాటలేదు.
 
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 155 ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. గత ఏడాది కొన్ని ప్రముఖ కాలేజీల్లో ఒకేసారి వందమందికి పైగా నియామకాలు జరగగా, ఈసారి 5-10ని మించలేదు! గత విద్యా సంవత్సరంలో 8 వేల మందికిపైగా ఉద్యోగాలు పొందగా.. ఈసారి 4 వేలకు మించలేదు. హైదరాబాద్‌, రంగారెడ్డిల్లో పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన పట్టణాల్లో పరిస్థితి మరింత దయనీయం!
 
చదువు పూర్తికాకముందే కొలువు కొట్టాలన్న విద్యార్థుల లక్ష్యం నీరుగారుతోంది. వారిపై గంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులను తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆటోమేషన్‌ ప్రభావం.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. అమెరికాలో ట్రంప్‌ ప్రకటనల ప్రకంపనలు.. పారిశ్రామిక అవసరాలను గుర్తించడంలో విద్యార్థుల వైఫల్యం.. ఇలా అనేక కారణాలు క్యాంప్‌సలో కొలువులు దక్కకుండా అడ్డుపడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 212 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 2.74 లక్షల విద్యార్థులున్నారు. వీరిలో ఫైనలియర్‌ విద్యార్థులు దాదాపు 80 వేల వరకు ఉంటారు. మొత్తం కాలేజీల్లో 14 ప్రభుత్వ, 198 ప్రైవేటు కళాశాలలు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే కొలువుతీరాయి. రెండేళ్ల కిందటి వరకు ఇక్కడి ప్రముఖ కళాశాలల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండేవి. చిన్న, పెద్దా కంపెనీలను కలుపుకొంటే ఈ రెండు జిల్లాల్లో దాదాపు 20-25 శాతం విద్యార్థులు క్యాంపస్‌ వీడేలోపే ప్లేస్‌మెంట్‌ లెటర్‌ అందుకునేవారు. అదే జిల్లాల్లో అయితే, దాదాపు 10 శాతం ఉద్యోగాలొచ్చేవి. రాష్ట్రవ్యాప్తంగా ఉండే 80 వేల మంది ఫైనలియర్‌ విద్యార్థుల్లో రెండేళ్ల కిందట దాదాపు 20 వేల మంది క్యాంపస్‌ సెలక్షన్లకు ఎంపికైతే, ఏడాది కిందట 15 వేల మందికి కొలువులు దక్కాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 7000 దాటలేదు.
 
జిల్లాల్లో నామమాత్రమే!
రాష్ట్రంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల తర్వాత ఎక్కువ ప్రాంగణ నియామకాలు జరిగేది వరంగల్‌లోనే. జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ఎన్‌ఐటీ, కాకతీయ వర్సిటీ కారణంగా అనేక ఎంఎన్‌సీలు క్యాంప్‌సకు వచ్చేవి. గత మూడేళ్లుగా జిల్లాలోని మూడు ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలల్లోని విద్యార్థులను గూగుల్‌, టీసీఎస్‌, పోలారిస్‌, క్యాప్‌ జెమినీ, హ్యుండాయ్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ కంపెనీలు భారీ ప్యాకేజీలతో ఎంపిక చేసుకున్నాయి. కానీ, ఈ ఏడాది ఎంపికలు నామమాత్రంగానే ఉన్నాయి. ప్రముఖ కంపెనీల స్థానంలో చిన్నపాటి కంపెనీలు వస్తున్నాయి.జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ కాలేజీలో గత ఏడాది కంపెనీలు నిర్దేశించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో (కనీసం 85 శాతం మార్కులు వంటి అర్హతలు) అర్హత సాధించిన వారిలో 80ు ఉపాధి పొందగా, ఈసారి 40ు కూడా దాటలేదు. ఎంపికైన వారికి కనీస వార్షిక వేతనం కూడా గత మూడేళ్లుగా కనీసం రూ.3 లక్షలు ఉంటే.. ఈసారి రూ. 1.50 నుంచి 1.80 లక్షల వరకు మాత్రమే!
 
ఖమ్మం జిల్లాలో గతేడాది అమెజాన్‌, కోటక్‌ మహీంద్ర, వేదాంత, సువిధ కంపెనీలు దాదాపు 120 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఈ ఏడాది ఎలాంటి నియామకాలు జరగలేదు.
 
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 7 కాలేజీలుంటే, గత విద్యా సంవత్సరంలో టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థలు నియామకాలు భారీగానే చేపట్టాయి. దాదాపు 400 మంది ఎంపికయ్యారు. ఈసారి ఒక్క కళాశాలలో ఎంపిక ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 30 కాలేజీలుండగా దాదాపు 8500 మంది ఫైనలియర్‌ చదువుతున్నారు. గత ఏడాది 150 మందిని క్యాంప్‌సలో ఎంపిక చేసుకోగా ఈసారి నియామకాల్లేవు. కొన్ని కాలేజీల్లో మొదటి దశ ఎంపికలు పూర్తవగా.. తుది దశ ఇంటర్వ్యూల కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు.
 
నిజామాబాద్‌ జిల్లాలోని 3 కాలేజీల్లో 210 మంది ఫైనలియర్‌ విద్యార్థులున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్‌, క్యాప్‌ జెమినీ పలువురిని ఎంపిక చేసుకోగా, ఈ ఏడాది సున్నా. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో రెండు, మూడు కళాశాలల్లోనే ప్రక్రియ ప్రారంభమైంది.
 
భారీ ఆశలపై నీళ్లు
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరేముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువగా విచారించేది అక్కడి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ గురించే. అవి సంతృప్తికరంగా ఉంటే లక్షల్లో డొనేషన్లకూ వెనకాడేవారు కాదు. ఎలాగోలా క్యాంప్‌సలోనే ఉద్యోగం కొట్టాలన్న లక్ష్యంతో విద్యార్థులుండేవారు. కళాశాలలు సైతం తమ బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఎక్కువ కంపెనీలను ఆహ్వానించేవి. ఇప్పుడు అసలు క్యాంపస్‌ సెలక్షన్లు లేకపోవడంతో భారీ ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. క్యాంప్‌సలో అవకాశం చేజారితే బయటికి వచ్చాక ఒక్కో ఉద్యోగం కోసం వేలాది మందితో పోటీ పడాల్సి రావడం వారి ఆందోళనకు ప్రధాన కారణం.
 
మెషీన్‌ లెర్నింగ్‌ తప్పనిసరి
పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ కంపెనీల అవసరాలు మారుతున్నాయి. ఉద్యోగాలూ తగ్గుతున్నాయి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా మారిన వారికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. గతంలో ఇంగ్లిషు భాషపై పట్టును ప్రధానంగా పరిశీలించేవారు. ఇప్పుడు మెషీన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పరిజ్ఞానాన్ని చూస్తున్నారు. కోడింగ్‌ కాంటెస్టుల్లో ప్రతిభ చూపుతున్న వారికి, ప్రోగ్రామింగ్‌, అనలిటిక్స్‌లో పట్టున్న వారికి ఉద్యోగాలకు కొదవలేదు. ఈ నైపుణ్యం లేకనే విద్యార్థులు ఉపాధికి దూరమవుతున్నారు. విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచే ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తే ఉపాధి అవకాశాలకు కొదువ ఉండదు.
విక్టర్‌ శామ్యూల్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌, హైదరాబాద్‌