సంక్షోభంలో ఇంజనీరింగ్‌ విద్య Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
సంక్షోభంలో ఇంజనీరింగ్‌ విద్య
దేశ వ్యాప్తంగా మూసివేత దిశలో 800 కాలేజీలు
ఏపీలో 19.. తెలంగాణలో 50.. అదే బాటలో మరో 64
విలీనం దిశగా మరిన్ని కళాశాలలు.. నైపుణ్యమే రక్ష

దేశవ్యాప్తంగా సుమారు 800 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడనున్నాయి. మరికొన్ని నష్టజాతక కాలేజీలు ఇతర కాలేజీల్లో విలీనం కానున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి ఆయా కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపాయి. కొన్నేళ్లుగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లు క్రమంగా తగ్గుతుండడం, ఇంజనీరింగ్‌ విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి కొరవడుతుండటం, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు క్రమంగా క్షీణిస్తుండటం వంటి కారణాల వల్ల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకొన్నాయి. ఫలితంగా, దేశంలో ఇంజనీరింగ్‌ విద్య సంక్షోభంలో పడింది. కాగా, అడ్మిషన్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మరికొన్ని కాలేజీలు మాత్రం మూసివేత కన్నా ఇతర కాలేజీల్లో విలీనమై ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
 
ఇవి కూడా తమ ప్రతిపాదనలను ఏఐసీటీఈకి పంపించాయి. దాంతో కాలేజీల మూసివేతకు అనుమతించడమా లేక విలీనాల ద్వారా కాలేజీల సంఖ్యను తగ్గించి సమస్య పరిష్కారానికి కృషి చేయడమా అనే ఆలోచనలో ఏఐసీటీఈ ఉంది. ఏఐసీటీఈ వద్ద ఉన్న సమాచారం ప్రకారం గడచిన ఐదేళ్లలో అడ్మిషన్లు బాగా తగ్గి దేశవ్యాప్తంగా 527 ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు మూతపడ్డాయి. సుమారు 4,633 కోర్సులు రద్దయ్యాయి. ఈ పరిస్థితి మహారాష్ట్రలో మరీ దారుణంగా ఉంది. అక్కడ 69 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడగా 921 కోర్సులు ఉపసంహరించుకొన్నారు. మూత పడ్డ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌, ఆర్కిటెక్చర్‌, పాలిటెక్నిక్స్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి కూడా ఉండటం గమనార్హం.
 
తెలుగు రాష్ట్రాల్లో..
ఇంజనీరింగ్‌ కాలేజీల సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో 19 కాలేజీలు మూసివేశారు. తెలంగాణలో 50 కాలేజీలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. ఏఐసీటీఈ వివరాల ప్రకారం, ఈ కాలేజీలు ఖమ్మం, కోదాడ, వరంగల్‌, యాచారం మండలం, నర్సంపేట, నిజామాబాద్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. తెలంగాణలో నిర్దేశిత కనీస సీట్లు భర్తీకాని మరో 64 కాలేజీల మూసివేతకు అనుమతివ్వాలంటూ ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకొన్నాయి. ప్రతి కాలేజీలో కనీసంగా 30 శాతం ప్రవేశాలు ఉండాలనే నిబంధనను తప్పనిసరిగా పాటించాలని ఏఐసీటీఈ చెబుతోంది. అలా కాని పక్షంలో సదరు కాలేజీ గుర్తింపు కోల్పోయే ప్రమాదముంటుంది.
 
ఈ నిబంధనతో కూడా అనేక యాజమాన్యాలు స్వచ్ఛందంగా కాలేజీల మూసివేతకు ముందుకు వస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 150 కాలేజీలను మూసివేశారు. ఐదేళ్లలో కనీసం 30 శాతం ప్రవేశాలకు కూడా నోచుకోని సుమారు 800 మంది కాలేజీలు మూసివేయాలని ఇటీవలే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయమై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చైర్మన్‌ అనిల్‌ సహస్ర బుద్దే స్పందించారు. ఈ సంక్షోభ నివారణకు రెండు మార్గాలున్నాయన్నారు. ఒకటి సంక్షోభంలో చిక్కుకున్న కాలేజీల నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం. తద్వారా అడ్మిషన్ల సంఖ్యను పెంచుకోవడానికి రెండేళ్ల గడువును విధించడం.
 
రెండోది మూసివేత కన్నా ఇతర కాలేజీల్లో విలీనం అవడం. ప్రస్తుతానికి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాలు పెంచడం పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నామని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ఇంజనీరింగ్‌ విద్యలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి ఏఐసీటీఈ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా మూసివేత ప్రతిపాదనలు పంపిన కాలేజీలకు తమ వాదనలు వినిపించుకొనే అవకాశం కల్పిస్తోంది. అయితే ప్రతి ఇంజనీరింగ్‌ కాలేజీ కూడా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నిర్దేశిత విద్యార్థి, అధ్యాపక నిష్పత్తిని మాత్రం కచ్చితంగా పాటించాల్సిందేనని, ఈ రెండూ పోగా మిగిలిన సమస్యలు ఏవైనా ఉంటే వాటి పరిష్కారంలో తాము కాలేజీ యాజమాన్యాలకు సహకరిస్తామని ఏఐసీటీఈ చెబుతోంది. కాకపోతే, ఎలాంటి పరిస్థితుల్లోనూ కాలేజీల నిర్వహణకు అంగీకరించబోమని మండలి స్పష్టం చేస్తోంది.
- ఎడ్యుకేషన్‌ డెస్క్