ఐఐటీ ప్లేస్‌మెంట్స్‌కు ట్రంప్‌ దెబ్బ Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఐఐటీ ప్లేస్‌మెంట్స్‌కు ట్రంప్‌ దెబ్బ
66 శాతానికి పడిపోయిన ప్రాంగణ నియామకాలు..
తగ్గిన వార్షిక వేతనం
 
దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో 2016-17 సంవత్సరానికి గానూ ప్లేస్‌మెంట్లు పడిపోయాయి. గతంతో పోల్చుకుంటే కేవలం 66 శాతం మేరకు ఐఐటీయన్లు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యాగాలు పొందారు. ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ఐఐటీల నుంచి ప్లేస్‌మెంట్‌ జాబితాను తెప్పించుకొని విశ్లేషిస్తే ఆశ్చర్య గొలిపే అంశాలు బహిర్గమయ్యారు. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై డిమానిటైషన్‌(పెద్ద నోట్లు రద్దు) తీవ్ర ప్రభావం చూపింది. 2014-15 విద్యా సంవత్సరంలో 78 శాతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నమోదయ్యాయి. 2015-16లో ఒక శాతం పెరిగి 79 శాతం మందికి వివిధ కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చాయి. అయితే 2016-17కి వచ్చే సరికి ఈ సంఖ్య ఏకంగా 66 శాతానికి పడిపోయింది. అంటే 2014-15తో పోల్చితే 2015-16లో గణనీయమైన మార్పు లేకపోయినప్పటికీ, కనీసం ఒక శాతం మేరైనా పెరుగుదల కనిపించింది. కానీ, 2016-17లో మాత్రం పరిస్థితి దారుణంగా నమోదైంది. ఏకంగా 13 శాతం పడిపోయిందంటే డిమానిటైజేషన్‌ తరవాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 17 ఐఐటీలు తమ సంస్థల్లో 2016-17కి సంబంధించిన ప్లేస్‌మెంట్ల వివరాలను కేంద్రానికి పంపాయి. మొత్తం 9104 మంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు క్యాంపస్‌ సెలెక్షన్స్‌కు నమోదు చేసుకొంటే వారిలో కేవలం 6013 మందిని మాత్రమే వివిధ కంపెనీలు ఎంపిక చేసుకొన్నట్లు ఐఐటీలు సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మాత్రం ఈ వివరాలు కేవలం ప్రయివేట్‌ కంపెనీలకు సంబంధించినవి మాత్రమేనని, గేట్‌(గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌) పరీక్ష ద్వారా పలు ప్రభుత్వ రంగ కంపెనీలు (పిఎస్‌యులు) అధిక సంఖ్యలో ఇంజనీరింగ్‌ పట్టభద్రులను నియామకం చేసుకున్నాయని, ఆ వివరాలు కూడా అందాల్సి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడే ఉద్యోగ నియామకాలు తగ్గాయా లేక పెరిగాయా అన్న విషయంపై స్పష్టత వస్తుందని, తాము మాత్రం ప్లేస్‌మెంట్స్‌ పడిపోతున్నాయని భావించడం లేదని పేర్కొన్నారు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. వీటిలో 17 పాతవి కాగా, మోదీ ప్రభుత్వం వచ్చాక మరో ఆరింటిని కొత్తగా ఏర్పాటు చేశారు.
 
ప్లేస్‌మెంట్లలో తగ్గుదల ఎందుకు?
రెండేళ్లుగా క్యాంప్‌స్ ప్లేస్‌మెంట్లలో తగ్గుదల దేశ ఆర్థిక రంగ తిరోగమనానికి అద్దంపడుతోంది. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వృద్ధి క్షయాన్ని తేటతెల్లం జేస్తోంది. 2016-15లో 7.9 శాతం ఉన్న భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 2016-17లో 7.1 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో లార్సెన్‌ అండ్‌ టూబ్రో లిమిటెడ్‌ 14,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని సమాచారం. పెద్ద నోట్లు రద్దు వల్ల ఉత్పాదకత, నిర్మాణ రంగాలకు తీవ్ర నష్టం కలిగింది. అర్థిక ఉపద్రవాలు పొడసూపినా ఇదివర్లో ఇంతటి తీవ్ర ప్రభావం మన దేశంలో ఉండేది కాదు. డిమానిటైజేషన్‌ ఆ వెసులుబాటు లేకుండా చేసిందని పరిణామాలు స్పష్టపరుస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలు సాఫ్ట్‌వేర్‌ సహా అన్ని రంగాల్లోనూ తీవ్ర ప్రబావం చూపుతోంది. ముఖ్యంగా అమెరికాలోని భారత ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న మన దేశానికి చెందిన సుమారు 56,000 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల భవితవ్యం సందిగ్ధంలో పడింది.
 
ఏటా పెరుగుతున్న కంపెనీలు, తగ్గుతున్న నియామకాలు
ఏటా ఐఐటీలను సంప్రదిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతున్నా, ప్లేస్‌మెంట్లలో ఎంపికవుతున్నవారి సంఖ్య మాత్రం తగ్గుముఖం పడుతోంది. మద్రాస్‌ ఐఐటీలో 665 మంది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు రిజిష్టర్‌ చేసుకోగా వారిలో 521 మందికి మాత్రమే ఆఫర్‌ లెటర్లు అందాయి. ఐఐటీ రూర్కీలో 83 శాతం నుంచి 63 శాతానికి ప్లేస్‌మెంట్లు పడిపోయాయి. 974 మంది క్యాంపస్‌ సెలెక్షన్స్‌కు హాజరు కాగా 653 మంది ఎంపికయ్యారు. ఇక హైదరాబాద్‌ ఐఐటీలో కూడా 2016-17 ప్లేస్‌మెంట్లు పరిస్థితి ఆశాజనకంగా లేవు. ఇక్కడ 264 మందికి మాత్రమే ఆఫర్‌ లెటర్లు వచ్చాయి. ఇక్కడి విదార్థి ఒకరికి ఏడాదికి రూ.34 లక్షల సగటు వేతనంతో ఆఫర్‌ రావడం సంతోషించదగ్గ పరిణామం.
 
ఉన్నత చదువులు, పోటీ పరీక్షలూ కారణమే
ఐఐటీల్లో తగ్గుతున్న నియామకాలపైఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్‌ ఆఫీసర్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్యాంపస్‌ సెలెక్షన్స్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఉండేది కొందరైతే, బీటెక్‌ తరవాత ఉన్నత విద్యను అభ్యసించడం లేదా సివిల్స్‌ సర్వీసెస్‌, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు ఉద్యోగాల్లో చేరడానికి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలు కూడా నియామకాల్లో జోరు తగ్గించాయని, హెచ్‌1బి వీసా సమస్య కూడా తోడయిందని వారు పేర్కొంటున్నారు. 2017-18లో పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు. ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఏటా నవంబర్‌ లేదా డిసెంబర్‌లో మొదలై జూన్‌ లేదా జూలైలో ముగుస్తాయి. మరో రెండు నెలల్లో మొదలయ్యే ప్లేస్‌మెంట్లకు సిద్ధమవుతున్నామని, డీమానిటైషన్‌ ప్రభావం కూడా తగ్గుముఖం పడుతోందని, అమెరికాలో కూడా పరిస్థితి మెరుగ్గానే ఉన్నందున ప్లేస్‌మెంట్లలో గత రెండేళ్ల కంటే అధిక వృద్దిని నమోదు చేయగలమని ఆశిస్తున్నామన్నారు.
-ఎడ్యుకేషన్‌ డెస్క్‌