తెలుగు భాషా బోధన తప్పనిసరి Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
తెలుగు భాషా బోధన తప్పనిసరి
ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ సబ్జెక్టుగా బోధన
తెలుగు బోధించే విద్యా సంస్థలకే అనుమతి
వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు: సీఎం కేసీఆర్
సిలబస్‌ తయారీ బాధ్యత సాహిత్య అకాడమీకి
దానినే అన్ని పాఠశాలల్లోనూ వాడాలని నిర్దేశం
ఎవరిష్టం వచ్చినట్లు వారు ముద్రించొద్దని ఆదేశం
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులూ తెలుగులోనే
అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు మహా సభలు
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యా సంస్థలను కోరారు. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఆ భాష కూడా ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలపై ప్రగతి భవన్లో మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్‌లలో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబ్‌సను రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమీని సీఎం ఆదేశించారు. వెంటనే సిలబస్‌ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని నిర్దేశించారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబ్‌సనే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని కూడా తేల్చి చెప్పారు.
 
పాఠశాలల్లో తెలుగును సబ్జెక్టుగా బోధించడం, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన సిలబ్‌సనే బోధించడం విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ నామ ఫలకాలు (బోర్డులను) కచ్చితంగా తెలుగులోనే రాయాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల బోర్డులపై పైన స్పష్టంగా తెలుగులో రాయాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని స్పష్టం చేశారు.
 
తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాషను పరిరక్షించడంలో భాగంగా ఈ రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారు. వీటిపై త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం నిర్ణయించారు. నగరంలో డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి స్మారక మందిరం నిర్మించాలని, రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. కాగా, తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ వరకూ తెలుగును తప్పనిసరి సబ్జక్టుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రముఖ విద్యావేత్త హర్షం వ్యక్తం చేశారు.
 
సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై మహాసభల్లో చర్చా గోష్టులు నిర్వహిస్తారు. తెలంగాణలో వర్థిల్లిన తెలుగును ప్రపంచం నలుమూలలకూ తెలిపేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
 
గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఉంటాయి.
 
ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా మహాసభలు జరుగుతాయి. రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ గ్రౌండ్స్‌, భారతీయ విద్యాభవన్‌, పింగళి వెంకట్రాంరెడ్డి హాల్‌, శిల్ప కళావేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి.
 
ఉదయం సాహిత్య గోష్ఠులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి తదితర ప్రదర్శనలు, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ పాటలు, వినోద ప్రక్రియలు ఉంటాయి.
 
మహిళలు పాడే పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరో తరానికి ఎలా బదిలీ అయ్యాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.
 
తెలుగు భాషా ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించాలి.
 
తెలుగు భాషాభివృద్ధి, వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులను సన్మానం చేయాలి.
 
మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి.
మహాసభలకు వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి.
 
అతిథులకు తెలంగాణను పరిచయం చేయడానికి ‘తెలంగాణ దర్శిని’ పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేయాలి.
 
తెలంగాణ జీవన చిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరించే కళారూపాలు ప్రదర్శించాలి.
 
మహాసభలకు తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతికశాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, గ్రంథాలయ పరిషత్‌ కీలక భూమిక పోషిస్తాయి.
 
హైదరాబాద్‌ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రమంతా పండుగ వాతావరణ నెలకొనాలి.
 
ఐదు రోజులపాటు తెలుగు మహాసభలు
హైదరాబాద్‌లో డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని, ఆ మేరకు సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానించాలన్నారు. సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతలతోపాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలను ఆహ్వానించాలని సూచించారు. అతిథుల ఆహ్వానం, మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.