వర్సిటీల్లో నాన్‌ బోర్డర్లు ఉండొద్దు Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
వర్సిటీల్లో నాన్‌ బోర్డర్లు ఉండొద్దు
ఓయూలో 23 వరకు ఖాళీ చేయాలి
యూనివర్సిటీల్లో రాజకీయాలకు చోటు లేదు
విద్య, పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి
వర్సిటీలకు పూర్వవైభవం తీసుకురావాలి
కాలేజీలు, హాస్టళ్లలో సీసీ కెమెరాలు పెట్టండి
వీసీల సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం
 
హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో కోర్సు పూర్తయిన విద్యార్థులు నాన్‌ బోర్దర్లుగా ఉండొద్దని, హాస్టళ్లను వారు ఖాళీ చేయాలని విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పాత విద్యార్థులు హాస్టళ్లలో ఉండడం వల్ల నూతన విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించలేకపోతున్నామని, అందుకే ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్‌ బోర్డర్లను ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. నాన్‌ బోర్దర్లు ఖాళీ చేసేందుకు ఈ నెల 23వ తేదీ వరకు గడువిచ్చామన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు చోటు లేదని, విద్య, పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కడియం పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. వర్సిటీలకు పూర్వవైభవం తీసుకురావాలని అన్నారు. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై వర్సిటీల వైస్‌ చాన్సలర్లతో మంత్రి కడియం ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల చరిత్ర ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడిచాయని, ఇప్పుడు ఉద్యమాలు కాకుండా విద్య, పరిశోధనపై దృష్టి సారించాలని అన్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో సభలు, సమావేశాలు నిర్వహణకు అవకాశం ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, 1550 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతిచ్చారని తెలిపారు. మొదటి దశలో 1061 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి వర్సిటీలకు ఆదేశాలు ఇచ్చినట్లు, వర్సిటీల్లో మౌలిక వసతులు, లైబ్రరీలు, ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.420 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల అంశంపై.. ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. పీహెచ్‌డీ ప్రవేశాల్లోనూ యూజీసీ నిబంధనలు పాటించాలని, ఎలాంటి విమర్శలకు తావివ్వొద్దని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్‌పాపిరెడ్డి, 11 వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
డ్రగ్స్‌ భూతాన్నివర్సిటీ చెంతకు రానివ్వొద్దు
డ్రగ్స్‌ భూతాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల దరికి చేరనివ్వొద్దని డిప్యూటీ సీఎం కడియం అన్నారు. ఇందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే వర్సిటీలు, కాలేజీలు, హాస్టళ్ల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.