గురుకులాలు కొత్త.. సమస్యలు పాత! Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
గురుకులాలు కొత్త.. సమస్యలు పాత!
నీళ్లూ లేవు.. మరుగు దొడ్లూ లేవు...
సమీప వ్యవసాయ క్షేత్రాల్లోనే కాలకృత్యాలు...
ఆరుబయటే భోజనాలు.. నేల మీదే పడక
వానొస్తే గదుల్లోనే కురుస్తున్న నీళ్లు
గురుకులాల్లో ‘ఆంధ్రజ్యోతి విజిట్‌’
 
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : వనపర్తి శివారు మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రారంభం నుంచీ కోళ్లఫారంలో కొనసాగుతోంది. ఇందులో మరుగు దొడ్లు లేవు. బహిర్భూమికి, స్నానాలకు సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద విద్యార్థులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి. గత ఏడాది ఈ రేకుల షెడ్డు శిథిలావస్థకు చేరి, గోడ కూలి ఓ ఉపాధ్యాయురాలు గాయపడినా, పరిస్థితిలో మార్పు లేదు. జయశంకర్‌ జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలోని బీసీ బాలుర వసతిగృహం బూత్‌బంగ్లాను తలపిస్తోంది. భవనంలో రాత్రివేళ గబ్బిలాలు దాడులు చేస్తున్నాయి. దీంతో, విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.
 
..ప్రస్తుతం గురుకులాల పరిస్థితి ఇది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే ధ్యేయంగా ప్రభుత్వం కొత్తగా గురుకులాలను ఏర్పాటుచేస్తోంది. కానీ, వాటిలో సమస్యలు మాత్రం పాతవే కొనసాగుతున్నాయి.
 
కొన్నిటికి కొత్త భవనాలు నిర్మించారు. కానీ, చాలావరకూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. చాలావాటికి ప్రహరీలు లేవు. మరికొన్నిట్లో నీటి కొరత. ఇంకొన్నిచోట్ల మరుగు దొడ్లు లేవు. పడుకునేందుకు బెడ్స్‌ లేవు. ఆరుబయటే భోజనాలు చేయాల్సిన దుస్థితి. వెరసి గురుకులాల్లో సమస్యలు తిష్టవేశాయి. సౌకర్యాల విషయంలో హాస్టళ్లకు, గురుకులాలకు మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. అక్కడ ఎటువంటి సమస్యలున్నాయో ఇక్కడా పరిస్థితి అలాగే ఉంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ గురుకుల పాఠశాల విద్యార్థి రాకేశ్‌ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి భోంచేశాక ఒకటో అంతస్తులో కిటికీ పక్కన ఉన్న తన బెడ్‌పై నిద్రించాడు. నిద్రలో రాకేశ్‌ పక్కకు దొర్లడంతో నేరుగా కిటికీలోంచి కిందకు పడి తీవ్ర గాయాతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కిటికీలకు సలాకల్లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే ‘ఆంధ్రజ్యోతి’ బృందం శనివారం రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పర్యటించింది. కొన్ని హాస్టళ్లలో వర్షం పడితే గదుల్లోకి వర్షపునీరు చేరుతోంది. చాలీచాలని గదులు, శిథిల భవనాల్లో నిర్వహణతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
మహబూబ్‌నగర్‌ జిల్లా ఖిల్లా ఘనపురం మోడల్‌ స్కూల్‌ హాస్టల్లో ఎలక్ర్టిక్‌ స్విచ్‌ బోర్డులు పగిలిపోయి వైర్లు బయటకు తేలాయి. మరుగు దొడ్లు లేక విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళుతున్నారు. అచ్చంపేట మైనారిటీ గురుకులంలో విద్యార్థులు వరండాలోనే పడుకుంటున్నారు. నాగర్‌కర్నూలు బాలికల బీసీ గురుకుల పాఠశాలలో విషసర్పాలు విద్యార్థినులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని గురుకులాల్లోనూ మరుగుదొడ్లు, మూత్రశాలల సమస్య ఉంది.
 
మంచాలు, పరుపులు, దుప్పట్లు లేక విద్యార్థులు కటిక నేలపైనే నిద్రిస్తున్నారు. కామారెడ్డి మైనారిటీ బాలికల గురుకకుల పాఠశాలను ఏకంగా ఓ బార్‌ పక్కనే హోటల్‌ ఉన్న భవనంలో ఏర్పాటుచేశారు. మందుబాబులు, ఆకతాయిలతో విద్యార్థినులు హాస్టల్లో ఉండలేకపోతున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి గురుకులంలో కిటికీలకు సలాకల్లేవు. సిరిసిల్ల మండలం చిన్నబోనాల గురుకులంలో విద్యార్థులు మరుగు దొడ్లు, స్నానాల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలు కట్టి నిలబడే పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరి రక్షణ కరువైంది.
 
పాములు, తేళ్లు వసతి గృహాల్లోకి వస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మల్లంపల్లి గురుకులంలో భవనం పైకప్పు కురుస్తోంది. కొత్తగూడెం జిల్లా ఆనందఖని ప్రాంతంలో ఉన్న ఎస్టీ గురుకులంలో తాగునీటి సమస్య తాండవిస్తోంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి బీసీ గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానాల గదులు లేవు. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలానికి మంజూరైన గురుకులంతోపాటు శేరిలింగంపల్లి గురుకులంలో బోరు నుంచి వచ్చే నీరు బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు నీటికోసం ప్రతినెలా వంద రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక, వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అనంతగిరిపల్లి గురుకులంలో 500 మందికి వసతి ఉంటే 811 మంది ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు పాఠశాల భవనంలోని బాత్‌రూంలను వినియోగిస్తున్నారు. పెద్దేముల్‌ గురుకుల విద్యార్థులు కూడా ఇక్కడే ఉంటుండడంతో సమస్య మరింత జటిలమవుతోంది. గజ్వేల్‌, తూప్రాన్‌ గురుకులాల్లో 225 మంది విద్యార్థులకు 3 బాత్‌రూములు, 4 టాయిలెట్లు ఉన్నాయి. దాంతో, కొందరు ఉదయం, మరికొందరు ప్రార్థన కాగానే ఇంకొందరు మధ్యాహ్నం స్నానాలు చేస్తుంటారు.
 
రగ్గులు ఏవీ!?
గత ఏడాది చాలా వరకూ గురుకులాలకు రగ్గులు పంపిణీ కాలేదు. దాంతో విద్యార్థులు చలిలోనే కాలం వెళ్లదీశారు. చాదర్‌ కప్పుకొని నేలపై పడుకుని ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇంకా రగ్గుల పంపిణీ జరగలేదు.
 
సీసీ కెమెరాలు ఏవీ!?
కొన్ని గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ, చాలాచోట్ల అవి పని చేయడం లేదు. మరికొన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవి ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. విద్యార్థుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు లేనిచోట్ల భద్రత లేదు. ఉన్నచోట్ల ఉపయోగం లేదన్నట్లు పరిస్థితి మారింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల గురుకులంలో గతంలో విద్యార్థినుల అదృశ్యం ఘటన జరిగినా అధికారుల తీరు మారడం లేదు. పాఠశాలలో సోలార్‌ లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్న అధికారుల హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. 545 మంది బాలికలున్న పాఠశాలలో రక్షణ కరువైంది.