‘మిధ్యా’హ్న భోజనం.. తినబోతే పురుగులుండు Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
‘మిధ్యా’హ్న భోజనం.. తినబోతే పురుగులుండు
ప్రత్యేకం పేరిట స్కూళ్లకు నాసిరకం బియ్యం
నిరుపయోగంగా వేలాది కిచెన్‌ షెడ్లు
పిల్లలకు పౌష్టికాహారం తూచ్‌
వంట ఏజెన్సీల బిల్లులు పెండింగ్‌లో
కేంద్ర నిధులతోనే నెట్టుకొస్తున్న ప్రభుత్వం
విద్యా శాఖాధికారుల పర్యవేక్షణ కరువు
సెంట్రలైజ్డ్‌ కిచెన్లలో వంటకు యోచన
 
అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా తయారైంది. బడి పిల్లలకు పోషక విలువలున్న ఆహారం అందడం లేదు. పాఠశాలలకు ప్రత్యేక బియ్యం ఇస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా.. రేషన్‌ షాపుల్లో పంపిణీ చేస్తున్న నాసిరకం బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. వీటితో వండిన అన్నం తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 45,528 ప్రభుత్వరంగ పాఠశాలల్లో 34,57,124 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు అయ్యే వ్యయంలో 60శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తాయి. 9,10 తరగతుల విద్యార్థుల భోజనానికయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించాలి. కానీ కేంద్రం సమకూర్చే నిధులతోనే రాష్ట్రం మమ అనిపిస్తోందనే ఆరోపణలున్నాయి.
 
నాణ్యతకు తిలోదకాలు
రూ.1.5 లక్షల వ్యయంతో నిర్మించిన కిచెన్‌ షెడ్లలో ఎక్కువభాగం వివిధ కారణాలతో నిరుపయోగంగా ఉన్నాయి. చాలా స్కూళ్లలో వంట షెడ్లు వినియోగించేందుకు అనువుగా లేకపోవడంతో.. పలువురు తమ ఇళ్లలోనే వండి స్కూళ్లకు తీసుకువస్తున్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు వంట నాణ్యతను పరిశీలించే పరిస్థితి లేకుండా పోయింది. వారానికి రెండు గుడ్లు విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా చాలా పాఠశాలల్లో సరిగ్గా ఇవ్వడం లేదని సమాచారం.
 
సరిపోని యూనిట్‌ కాస్ట్‌
ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కూరలు, గుడ్లు, సాంబారు తదితరాలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.5.13, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.7.18 చొప్పున నిర్ణయించారు. ఇప్పటి ధరల ప్రకారం ఈ యూనిట్‌ కాస్ట్‌ ఏమాత్రం సరిపోవడం లేదు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించే అధికారం డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈవోలకు ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
 
నిర్వహణ భారం తగ్గించుకొనే యోచన
అక్షయ పాత్ర, ఇస్కాన్‌ తదితర ఏజెన్సీలు సెంట్రలైజ్డ్‌ కిచెన్లలో తయారు చేసిన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో బుద్ధవరం ట్రస్ట్‌, పశ్చిమలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌.. ఇలా పలు ఎన్‌జీవోలు కూడా మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ పథకం అమల్లో లోపాలున్నట్లు గుర్తించిన కేంద్రప్రభుత్వం నిర్వహణ భారం తగ్గించుకునేందుకు పలు మార్పులు తీసుకురాబోతోంది. ఇకపై సెంట్రలైజ్డ్‌ కిచెన్ల ద్వారా వంట చేయించి పిల్లలకు సరఫరా చేయాలని, పర్యవేక్షణ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
 
మరికొన్ని సమస్యలు...
రాష్ట్రంలోని సగం పాఠశాలకు వంటగ్యాస్‌ సరఫరా చేయడం లేదు.
చాలాచోట్ల నీటి సదుపాయం సరిగ్గా లేకపోవడంతోపాటు కొన్నేళ్లుగా వంట పాత్రలు సైతం ఇవ్వడం లేదు.
కొన్ని జిల్లాల్లో జనవరి నుంచి, మరికొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి నుంచి ఏజెన్సీలకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.