ప్రైవేట్ బడికి షాక్..కొత్తగా 240 గురుకులాల ప్రారంభం.. Education-Article
కర్నూలు: ప్యాపిలి మండలం నేరేడుచర్ల దగ్గర ట్రాక్టర్‌, బైక్‌ ఢీ, ఇద్దరు మృతి, తాడిపత్రి వాసులుగా గుర్తింపు|హైదరాబాద్‌: నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలోని కోకాపేట దగ్గర అదుపు తప్పి టిప్పర్‌ కింద పడ్డ బైక్‌, ఇద్దరు మృతి|విశాఖ: యారాడ బీచ్‌లో విషాదం, సముద్రంలో స్నానానికి వెళ్లి తండ్రీ, కొడుకు(3) గల్లంతు|సీఎం కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డు, పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద అవార్డుకు ఎంపిక చేసిన స్వామినాథన్ కమిటీ|బిహార్‌: ఎన్డీయేలో అధికారికంగా చేరిన జేడీయూ|అమరావతి: సీఎం ప్యాంట్రీ వాహనం మీద నిఘాపై ప్రభుత్వం సీరియస్, ఎన్నికల కమిషన్‌కు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లేఖ|కర్నూలు: గంగుల ప్రతాప్‌రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 800 మంది కార్యకర్తలు |రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం నాదర్‌గుల్‌ సమీపంలో న్యూకాన్‌ ఏరోస్పేస్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్|హైదరాబాద్‌: మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా హెల్ప్ లైన్‌ నెంబర్‌ 181ను ప్రారంభించిన మంత్రి తుమ్మల|కర్నూలు: నంద్యాలలో రెండురోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన, ఎన్నికల ప్రచారం     
ప్రైవేట్ బడికి షాక్..కొత్తగా 240 గురుకులాల ప్రారంభం..
ప్రైవేటు నుంచి భారీగా వలసలు
60 శాతం తగ్గిన విద్యార్థుల సంఖ్య
గురుకుల పాఠశాలల అడ్మిషన్లలో
80 శాతం ప్రైవేటు బడుల నుంచే
వెళ్లే వాళ్లంతా మెరిట్‌ విద్యార్థులే
మైనారిటీల్లో వంద శాతం వలస

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు పెద్ద కష్టం వచ్చి పడింది. చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాలున్నా, కష్టపడి పాఠాలు చెబుతున్నా చాలా పాఠశాలల్లో ఒక్కసారిగా విద్యార్థుల సంఖ్య అరవై శాతం మేరపడిపోయింది. కారణం నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఇంగ్లిష్‌ మీడియం గురుకుల పాఠశాలలే. ఇప్పటిదాకా పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమకు చేతనైనా కాకపోయినా ఇంగ్లిష్‌ మీడియం కోసం పిల్లల్ని ప్రైవేటు బడుల్లో చేర్పించి చదివిస్తూ వచ్చారు. ఇప్పుడు నియోజక వర్గానికి ఒక బీసీ, ఒక మైనారిటీ గురుకులాలు రావడంతో తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయం దొరికినట్లయింది.
 
ఈ మార్పుతో నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు బడులు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో ఏర్పాటు చేసిన గురుకులాల ధాటికి అవి కుప్పకూలి పోయాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న 60% మంది విద్యార్థులు పొలోమంటూ టీసీలు తీసుకొని గురుకులాలకు వెళ్లిపోతున్నారు. వెళ్లే వాళ్లంతా మెరిట్‌ విద్యార్థులే కావడం ఈ పాఠశాలలకు మరో పెద్ద సమస్య. ఇప్పటికే ఉన్న గురుకులాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 240 గురుకులాలు ఏర్పాటు చేసింది. వీటిలో ప్రవేశాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పోటీ పడ్డా 80 శాతం సీట్లు ప్రైవేటు విద్యార్థులే దక్కించుకున్నారు. ప్రతిభ ఆధారంగా 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ఎనభై వేలకు మించిన సంఖ్యలో విద్యార్థులకు గురుకులాల్లో అవకాశం లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, వసతులు బాగా లేకనే విద్యార్థులను అధిక ఫీజుల భారానికి ఓర్చి ప్రైవేటు స్కూళ్లలో చేరుస్తున్నారు.
 
గురుకులాల్లో అంతర్జాతీయ స్థాయి చదువులు అందిస్తామని, చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఒక్కొక్కరిపై రూ.1.25 లక్షలు ఖర్చు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంతో నమ్మకం పెంచుకున్న తల్లిదండ్రులు గురుకులాల వైపు మళ్లారు. మైనారిటీ గురుకులాల్లో పూర్తి స్థాయిలో పిల్లలు చేరుతున్నారు. వనపర్తిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో గత ఏడాది 1800 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది 1600కు తగ్గింది. ఇప్పటికి తగ్గినా వచ్చే ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని నాణ్యమైన విద్య అందిస్తున్న కొన్ని పాఠశాలలు ధీమాగా ఉన్నాయి.
 
మొత్తం మీద ప్రైవేటు యాజమాన్యాల్లో భయం మాత్రం కనిపిస్తోంది. పథకం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్ని దెబ్బ తీస్తున్నారంటూ యాజమాన్య సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు మాకం బీచుపల్లి వ్యాఖ్యానించారు. గురుకుల హాస్టళ్లు పూర్తి స్థాయిలో సిద్ధమైతే వలసలు భారీగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశాయి. సిద్దిపేట లాంటి జిల్లాల్లో పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలంటూ గ్రామాల్లో ఏకంగా తీర్మానాలు చేశారు. గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలల ప్రచారాన్ని కూడా అనుమతించలేదు.
నిజానికి ప్రైవేటు బడులు స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దేశిత విద్యార్హతలు లేకున్నా టీచర్లు విద్యాబుద్దులు చెప్పడంలో ఏమాత్రం తీసిపోవడం లేదు. గురుకులాల్లో ఫర్నిచర్‌, బోధన సామగ్రి విషయంలో రాజీ లేకుండా ఖర్చు పెడుతున్నారు. పౌష్టికాహారం విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నారు. డ్యూయల్‌ డెస్కులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉంటోంది. గురుకులాల్లో పూర్తి స్థాయి వసతుల్లేని చోట ప్రైవేటు బడులకు పెద్దగా సమస్య లేదు.
 
ఖమ్మంలో ప్రభావం లేనట్లే
ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రైవేటుకు గురుకులాల నుంచి ముప్పు లేదంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఇంగ్లిష్‌ మీడియం కోసం గురుకులాలకు వెళుతున్నారు. మౌలిక వసతులు మెరుగ్గా ఉంటే గురుకులాలు ప్రైవేటుకు పోటీ ఇవ్వగలవని ప్రైవేటు టీచర్లే అంటున్నారు. కొత్త గూడెం జిల్లాలో 20 శాతం వరకు ప్రైవేటుపై ప్రభావం ఉంది. నల్గొండ జిల్లాలో ప్రభావం గట్టిగానే ఉంది. కట్టంగూరులో ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 400 నుంచి వందకు పడిపోయింది.
 
ప్రభావం నామమాత్రమే
తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు. గురుకుల పాఠశాలలకు కల్పించే మౌలిక వసతుల్ని బట్టి ముందడుగు వేస్తారు. ప్రభుత్వం విజయవంతమైన చోట ప్రైవేటు బడులకు దెబ్బ తప్పదు. ప్రస్తుతమైతే ప్రభావం నామమాత్రమే అనిపిస్తోంది. మహారాష్ట్ర తరహాలో మూడేళ్లపాటు పనిచేసిన ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వమే తీసుకొని పరిహారం చెల్లించాలి.
- శ్రీనివాసగౌడ్‌, ప్రైవేటు పాఠశాలల సంఘం, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు.
 
ఉపాధి చూపించాలి
ఇటీవల గురుకులాలు సాధించిన ఉత్తమ ఫలితాలు కూడా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. గురుకులాల దెబ్బకు మూడు, నాలుగు పాఠశాలలు కలిసి ఒక పాఠశాలగా మారి నడిపిస్తున్నాయి. ప్లేస్కూళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో ప్రైవేటు హవా కొనసాగుతూనే ఉంది. మంచిర్యాల ప్రాంతంలో గ్రామీణ ప్రైవేటు హైస్కూళ్లు సగానికి సగం మూతబాటలో ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.
- ఆడమ్స్‌, అభినవ పాఠశాల కరస్పాండెంట్‌, మంచిర్యాల
 
భవిత అగమ్యగోచరం
గురుకుల విద్యతో ప్రైవేటు పాఠశాలల మూత తప్పదు. బ్యాంకుల్లో అప్పులు తీసుకొని నడుపుతున్నాం. ఇప్పుడు హఠాత్తుగా భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. అక్కడి విద్యా ప్రమాణాలు ఎలా ఉంటాయో తెలియకుండానే తల్లిదండ్రులు ఎగబడుతున్నారు. ఫ్రీగా ప్రభుత్వమే ఇంగ్లిష్‌ మీడియం చెబుతుంటే మీకు ఎందుకు ఫీజులు కట్టాలని అడుగుతున్నారు.
- అశోక్‌, లయోలా హైస్కూల్‌, హన్మకొండ.