కొత్త ఉద్యోగంలో పాత కంపెనీ ప్రస్తావన JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కొత్త ఉద్యోగంలో పాత కంపెనీ ప్రస్తావన
కొంతమంది కొత్తగా ఉద్యోగంలో చేరిన తరువాత పాత కంపెనీ గురించి కామెంట్లు చేస్తుంటారు. అంతేకాదు తోటి ఉద్యోగులు, అక్కడి బాస్‌లపై కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా సదరు వ్యక్తిపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. వేరే చోట కొత్త పోస్టు కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ మునపటి బాస్‌పై ప్రశ్న రావచ్చు. అయితే కోపం దిగమింగుకుని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని నిజాన్ని నిష్టూరంగా వెల్లడించాల్సిన పనీ లేదు. ఒకింత సున్నితం మేళవించి నిజాన్ని నిఖార్సుగా చెప్పవచ్చు. అది ఎలా అంటే... పాత బాస్‌ కారణంగా ఎంత ఇబ్బంది పడినప్పటికీ దానిని వ్యక్తం చేసే విధానంలో మర్యాద తొంగి చూడాలి.
 
ఉద్యోగం మారిన పదిహేను వేల మందిని ఇటీవల సర్వే చేస్తే, డెబ్బయ్‌ శాతం మంది తమ బాస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి దేశం, ప్రాంతం అన్న మినహాయింపే లేదు. ‘టెరిబుల్‌’, ‘హారిబుల్‌’ అని వ్యాఖ్యానించిన వారే ఎక్కువ. అయితే ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మాత్రం జాగ్రత్తగా వెల్లడించాలి.
 
నిజాయతీ వ్యక్తం కావాలి
బ్యాడ్‌ ఎంప్లాయర్‌ గురించి అడిగినప్పుడు నిజాయతీగా చెప్పడమే ఎప్పటికైనా మంచిది. అంతా మంచి అనుభవాలే ఉంటాయని అనుకోవడం కూడా వాస్తవం కాదు. మీ పాత బాస్‌ మంచి స్నేహితుడే కావచ్చు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అవి ఇబ్బంది కరంగానూ అనిపించవచ్చు. ఉదాహరణకు కుమార్‌ అనే ఉద్యోగి తన పాత బాస్‌ను ఎంతగానో అభిమానిస్తాడు. అయితే అప్పటికప్పుడు షెడ్యూల్‌ చెప్పి, కానిచ్చేయండని తొందర చేయడం మాత్రం నచ్చేది కాదు. ఒక్కోసారి కష్టంగానూ అనిపించేది. ఆ ఒక్క విషయాన్ని మాత్రమే సగౌరవంగానే వెల్లడించడం తప్పేం కాదు. అక్కడ తనకున్న ప్రాబ్లెమ్‌ మాత్రమే వ్యక్తం కావాలి.
 
పక్కన పెట్టేశారు
మేఘన అనుభవం వేరు. బాస్‌తో కలిసి రెండేళ్ళకు పైగా పని చేసింది. సరిగ్గా ప్రమోషన్‌ ఇవ్వాల్సిన సమయంలో పక్కన పెట్టేశారు. తనకంటే తక్కువ అనుభవం ఉన్న కిషోర్‌ను ఆ స్థానంలో కూర్చోపెట్టారు. కంపెనీ చెప్పే కారణాలు ఏవైనా కావచ్చు, మేఘనలో అసంతప్తికి ఆ పరిణామం తావిచ్చింది. కొత్త ఉద్యోగం వెతుక్కుంటోంది. అయితే ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాల్సిన పనిలేదు. అక్కడ కంటే మెరుగైన జాబ్‌ కోసం ప్రయ త్నిస్తున్నట్లు చెపితే సరిపోతుంది. అనవసర సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా బాగా చెప్పాలంటే సోదంతా పూసగిచ్చినట్టు చెప్పనక్కర్లేదు.
 
నెగెటివ్‌ను పాజిటివ్‌గా మార్చుకోండి
అత్యంత దుర్భర పరిస్థితులు, ఘటనలకు సైతం సానుకూల కోణాలు ఉంటాయి. పనిలో భాగంగా చోటుచేసుకునే ప్రతి చెడు అనుభవం పాఠం నేర్పుతుంది. ఉదాహరణకు వెంకటేష్‌కు నెలలో కొన్ని రోజులు వర్క్‌లోడ్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పనికి ఆవల అంటే ఫ్రీ సమయాన్ని జాగ్రత్తగా షెడ్యూల్‌ చేసుకున్నాడు. అదే విషయాన్ని ఇంటర్వ్యూలో జాగ్రత్తగా వివరించాడు. ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రీ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటానని వెల్లడించాడు. తన ముందున్న టాస్క్‌లను ప్రాధాన్యం ప్రకారం చేసుకుంటూ వెళతానని చెప్పాడు. సమస్యలను అధిగమించడం కాదు, సక్రమంగా, సమర్థంగా పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తానని వివరించాడు. నిజానికి ఓవర్‌లోడ్‌ ఎవరికైనా కష్టమే. అదే విషయాన్ని చెప్పడంలోనే వెంకటేష్‌ జాగ్రత్తపడ్డాడు.
 
ఆనంద విషయాలను గుర్తుంచుకోండి
ఇందాకటి ఉదాహరణలో మేఘన విషయమే తీసుకుంటే, ఆమె అక్కడి పనిని ప్రేమించింది. యాజమాన్యం ఆమె చేసే పనిని సరిగ్గా అంచనా వేయలేదు. అదీ ఆమె ఫిర్యాదు. అయితే దానినే మరో రకంగా చెప్పింది. పాత బాస్‌ను గుర్తు చేసుకుంటూ, అక్కడ పనిని ఎంజాయి చేసినట్టు వెల్లడించింది. అనుత్పాదక, అనవసర విషయాలను పరిహరించింది. తద్వారా నెగెటివ్‌ను పాజిటివ్‌గా మలుచుకుంది. ఇక్కడ ఒక రకంగా అబద్దం చెప్పలేదు. అనవసర విషయాలను ప్రస్తావించ కుండా డిప్లమాటిక్‌గా ప్రవర్తించింది.
 
కొత్తదనం
కొత్త జాబ్‌ కోసం వెతుకులాట సందర్భంలో వైవిధ్యం కోరుకుంటారు. పాత ఎంప్లాయిర్‌పై అసంతృప్తి ఒక కారణం. అయితే ఎక్కువ మంది అదే జాబ్‌ను కొత్త బాస్‌ కింద పని చేసేందుకు ఉత్సాహం చూపుతారట. మేఘన సరికొత్త బాధ్యతలు కోరుకుంది. షెడ్యూల్‌ చాలా చక్కగా ఉండాలని భావించింది. పాత జాబ్‌లో ఎదురైన సమస్యలకు పరిష్కారాలను వెతుక్కుంది. నెగెటివ్‌ పరిస్థితుల్లోనూ కష్టించి పనిచేయగలనని ఆచరణాత్మకమైన పద్ధతిలో చెప్పడం ద్వారానే సరి కొత్త ఉద్యోగం పొందగలిగింది.