గూఢచారులు, గాసిపర్స్‌తో బీ కేర్‌ఫుల్ JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
గూఢచారులు, గాసిపర్స్‌తో బీ కేర్‌ఫుల్
స్నేహితుల్ని మనం ఎంచుకునే అవకాశం ఉంటుంది కానీ కుటుంబాన్ని మాత్రం ఎంచుకోలేం. అలాగే మనకు ఇష్టమైన వృత్తిని ఎంపిక చేసుకునే అవకాశం మనకు ఉంటుంది కానీ, మనతో పాటు పనిచేసే సహోద్యోగులను ఎంపిక చేసుకునే చాన్స్‌ మాత్రం మనకు ఉండదు. చాలామందికి చేసే పని అన్నా, అక్కడి పరిస్థితులన్నా తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. కొంతమందిని కొన్ని సందర్భాలలో భరించడం కష్టంగా ఉంటుంది. మరికొందరిని చూస్తేనే సహించలేం. ఇలా రకరకాల వ్యక్తులు పని ప్రదేశాల్లో తారసపడుతుంటారు. వారంటే ఎంత అయిష్టత ఉన్నా వారితో కలిసి పనిచేయాల్సిందే! కొన్ని సంవత్సరాల పాటు వారిని భరించాల్సిందే! అలా తారసపడే కొంత మంది వ్యక్తుల గురించి....
 
వాగుడుకాయలు
ఇలాంటి వారికి పనీపాటా ఏమీ ఉండదు. మీ మూడ్స్‌తో అస్సలు సంబంధం ఉండదు. ఆఫీసులో పనిచేసే ఏడెనిమిది గంటలు మాట్లాడుతూనే ఉంటారు. కనీసం ఎదుటి వారు చెబుతున్నది అర్థం చేసుకునే మనస్తత్త్వం వీరికి ఉండదు. ఎంత సేపూ తాము ఏమి చెప్పదలుచుకున్నారో అది పూర్తి చేయందే కదలరు. ప్రపంచంలోని అన్ని విషయాలూ వీరికే కావాలి. తమ మాటలతో ఎదుటి వారు బాధపడతారేమో అన్న స్పృహ వీరికి అస్సలు ఉండదు. ఇలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమే! వీరి వాగుడు కారణంగా పనిలో ఏకాగ్రత లోపించే ప్రమాదముంది. అంతే కాకుండా వీరికి ఉండే చెడ్డపేరు మీకు కూడా అంటుకునే అవకాశం ఉంది. తద్వారా భవిష్యత్తులో ఉద్యోగాల్లో పదోన్నతికి ఆటంకం కలగవచ్చు. వీరిని ప్రమాదకర వ్యక్తుల జాబితాలోకి చేర్చుకుని సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిది.
 
అన్నీ తెలుసంటారు
ఇలాంటి వారు ప్రతి ఆఫీసులో ఒకరన్నా ఉంటూ ఉంటారు. ప్రతి విషయం తమకే తెలుసు అన్న భావన వీరిలో చాలా గట్టిగా ఉంటుంది. అందుకే సహోద్యోగుల పనిలో తరచూ కల్పించుకుంటూ ఉంటారు. అంతా తమకే తెలుసు అన్నట్టు మాట్లాడడమే కాదు. దాన్ని చేతల్లో చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. వీరి కారణంగా మీరు చేసే ప్రతిపనికీ ఆటంకం కలగవచ్చు. ఇతరుల ఆత్మవిశ్వాసం ఎలా దెబ్బకొట్టాలా? అని చూస్తుంటారు. వీరిలో అభద్రతా భావం ఎక్కువ. ఇలాంటి వారికి సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిది. వారు అడిగినా లేదా కోరిన సమాచారాన్ని వెంటనే ఇచ్చే ప్రయత్నం చేస్తే వీరి బెడద నుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చు.
 
ఓవర్‌ కమిట్‌మెంట్‌
అందరికన్నా తమకే పనిపట్ల ఎక్కువ శ్రద్ధా, నైపుణ్యం ఉన్నాయన్న భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమకు కేటాయించిన పనినే కాకుండా సహోద్యోగుల పనిలో కూడా కల్పించుకుంటూ ఉంటారు. అధికారి కేటాయించిన పని కన్నా ఎక్కువ పని చేసి వారి మెప్పును పొందాలని తెగ తాపత్రయపడుతుంటారు. అప్పటికప్పుడు చేయవలసిన పనే కాకుండా భవిష్యత్తులో చేయవలసిన పనిని కూడా ముందుగానే పూర్తి చేస్తుంటారు. వీరి ఓవర్‌ కమిట్‌మెంట్‌ కారణంగా కొన్ని సందర్బాలలో మిగతా వారికి కూడా పనిభారం అధికం అవుతూ ఉంటుంది. వీరు ఆఫీసుకు వచ్చి పోయే పనివేళలు మీ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. యజమానికి తమకన్నా నమ్మిన బంటు లేడనే భావం వీరిలో తరచూ కనిపిస్తూ ఉంటుంది.
 
 
మాజీలతో జాగ్రత్త అవసరం
ప్రతి కార్యాలయంలోనూ ఉద్యోగులు రాజీనామా చేయడం, కొత్తవారు వస్తూండడం సహజం. కొంత మంది ఉద్యోగులు సామరస్యపూర్వకంగా సంస్థ నుంచి వైదొలగితే మరికొందరు తగవు పడి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వారంటే యాజమాన్యానికి అంత మంచి అభిప్రాయం ఉండదు. ఇలాంటి మాజీలు ఆఫీసుకు వచ్చినప్పుడు వారితో సాధ్యమైనంత తక్కువ మాట్లాడి పంపితే మంచిది. వారితో ఎక్కువ సేపు మాట్లాడడం, చనువుగా మెలగడం వంటివి యాజమాన్యానికి నచ్చకపోవచ్చు. ఆఫీసు బయట వారితో మీరు ఎంత చనువుగా ఉన్నా, ఆఫీసులో మాత్రం కొంత దూరాన్ని పాటించడం మీకే మంచిది.
 
 
నిశ్చల స్వభావులు
ఇలాంటి వారు ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. మిన్ను విరిగి మీద పడినా శాంతంగా ఉంటారు. వీరిలో దుందుడుకు స్వభావం మచ్చుకైనా కనపడదు. అంతే కాదు వీరిలో నైపుణ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంత చిక్కు సమస్యనైనా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరిస్తారు. ఇలాంటి వారితో స్నేహం వృత్తిపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. వీరితో స్నేహం మీమీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపి ఆందోళన, ఒత్తిడి లాంటివి అదుపులో ఉండడానికి దోహదపడుతుంది.
 
గాసిపర్స్‌
ప్రతి ఆఫీసులోనే పదుల సంఖ్యలోనే వీరు కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఉద్యోగికి సంబంధించి వృత్తిపరమైన, వ్యక్తిగతమైన సమాచారాన్ని సేకరించడమే వీరి పని. చేసే పని మీద కన్నా ఇలాంటి పనుల మీదే వీరు ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. వీరి పని ఇతరుల విషయాలు తెలుసుకోవడంతోనే ఆగిపోదు. ఒకరి విషయాలు మరొకరికి చేరవేయందే నిద్ర పట్టదు. ఇలాంటి వారు మీ దగ్గరకు వచ్చి ఇతరుల విషయాలు మీకు చెబుతున్నారంటే, మీ విషయాలు ఇతరులకు గ్యారంటీగా చెబుతారనే అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారిని మొదట్లోనే అదుపు చేస్తే వీరి వలన కలిగే ఇబ్బందుల నుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చు. కొన్ని సార్లు వీరికారణంగా ఉద్యోగం నుంచి తప్పుకోవలసి రావచ్చు. కనుక వీరితో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం అవసరం.
 
 
అదృష్టం మీదే ఆధారం
ఆఫీసు మొత్తం మీద ఒకరో ఇద్దరో ఇలాంటి వారు ఉంటే ఉండొచ్చు. వీరికి పనిలో అంతగా నైపుణ్యం అంతగా లేకపోయినా, పదోన్నతి మాత్రం కరెక్ట్‌ సమయానికి పొందగలుగుతారు. అది వారి అదృష్టం తప్ప మరొకటి కాదు. వీరితో పోల్చుకుంటే ఉద్యోగుల నైపుణ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి వారికి పై అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి కనుక వారితో పోల్చుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటూ పోతేనే మంచిది.
 
ఆశయాలు ఉన్నవారు
వీరు తరచూ కనిపిస్తూనే ఉంటారు. చేసే పని పట్ట నిబద్ధత కలిగి ఉంటారు. ఉద్యోగంలో పదోన్నతులు త్వరత్వరగా పొందాలని తాపత్రయ పడుతుంటారు. ఆ దిశగా కృషి చేస్తుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు నిత్యం శ్రమిస్తుంటారు. వీరికి పదోన్నతులు కూడా త్వరగానే వస్తుంటాయి. పదోన్నతి పొందే క్రమంలో వీరు కొన్ని సందర్భాలలో తోటి ఉద్యోగులతో కఠినంగా వ్యవహరిస్తుంటారు కూడా! ఇలాంటి వారిలో బాస్‌ అయ్యే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరు తోటివారికి ఆదర్శంగా నిలుస్తుంటారు. వీరంటే యాజమాన్యానికి కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటి వారితో సన్నిహితంగా మెలగడం వలన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడమే కాకుండా పనిలో నైపుణ్యం పెంచుకునే అవకాశం కూడా కలుగుతుంది.
 
గూఢచారులు
ప్రతి ఆఫీసులోనూ వీరు యాజమాన్యానికి అనుకూలంగా పనిచేస్తుంటారు. వీరికి ఆఫీసులో జరిగే ప్రతి విషయమూ అవసరమే! చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకూ అందరి విషయాలూ సేకరించడమే వీరి ప్రధాన కర్తవ్యం. ఆఫీసులో జరిగే ప్రతి చిన్న విషయాన్ని సైతం బాస్‌కు లేదా యాజమాన్యానికి చేరవేయడమే వీరి పని. పనిలో అంత నైపుణ్యం కనిపించకపోయినా, తాము చేసే గూఢచార్యంతో నెట్టుకొస్తూంటారు. పైకి మంచిగా మాట్లాడుతూ ఉద్యోగుల లొసుగులు, విషయాలను కూపీ లాగడమే వీరి పని వీరు బాస్‌కు లేదా యాజమాన్యానికి అంత్యంత ఇష్టులుగా ఉంటారు. ఇలాంటి వారితో సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండడమే మంచంది. స్వవిషయాలు, పని విషయాలు వీరికి తెలపకుండా ఉంటే ఆఫీసులో ఎదురయ్యే ఇబ్బందులను కొంత వరకూ తప్పించుకోవచ్చు.
 
నటులు
పని చేయకున్నా నటించే వారు ప్రతి ఆఫీసులోనూ చాలా మందే ఉంటారు. వీరి నటనకు ఆస్కార్‌ ఇవ్వాల్సిందే! ఆఫీసులో అందరి పనిభారాన్ని తామే మోస్తున్నట్టు ఫీలవుతుంటారు. వీరికి కేటాయించిన పని పూర్తి చేయరు కానీ, మిగతా వారి పని గురించి మాత్రం ఆరా తీస్తుంటారు. ఇలాంటి వారి వలన తరచూ ఒత్తిడి, కోపం వంటివి కలుగుతుంటాయి. వీరికి తమ పని కన్నా ఇతరుల గురించిన విషయాల గురించే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారితో ఎక్కువగా మాట్లాడడం, చనువుగా తిరగడం వలన వారి ప్రభావం మీమీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే మంచి ఫలితాల్ని పొందవచ్చు.
 
రోమియోలు
కొంత మంది చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ తాము ఇంకా కాలేజీ కుర్రాళ్ళమనే భ్రమలోనే ఉంటారు. తమ తోటి మహిళా ఉద్యోగినులను ఆకర్షించడానికి పడరాని పాట్లు పడుతుంటారు ఆఫీసులో తమ సీటులో కూర్చుని పనిచేయడం కన్నా మహిళా ఉద్యోగినుల చుట్టూ తిరగడానికీ, వారితో మాట్లాడడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఇలాంటి వారు ఆఫీసుకి రాకపోవడం అంటూ జరగదు. మిన్ను విరిగి మీద పడినా ఆఫీసుకు రావడానికే ఎక్కువ ఇష్టపడతారు. పెళ్ళికాని మహిళా ఉద్యోగినుల పట్ల వీరు అత్యంత శ్రద్ధ కనపరుస్తుంటారు. వివాహితులైనన ఉద్యోగినులు కూడా వీరి పట్ల అప్రమత్తంగా ఉండడం క్షేమకరం.
 
 
డూడూ బసవన్నలు
పై అధికారులు ఏది చెప్పినా ‘ఎస్‌ బాస్‌’ అంటూ తలూపుతుంటారు. వారు జారీ చేసే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడానికి తాపత్రయపడతారు. ఈ క్రమంలో తమ కింది ఉద్యోగులు పడే ఇబ్బందులు వారికి పట్టవు. ఎంత సేపూ పై అధికారులకి విశ్వాసపాత్రుడిగా ఉండడానికే ఇష్టపడతారు. ఇలాంటి వారు ప్రతి ఆఫీసులోనూ కనపడుతుంటారు. ఈ లక్షణాలు ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారిలో నటనపాళ్ళు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. పై అధికారి చెప్పిన పని చేయకపోవడం లేదా వారి మాటను ధిక్కరించడం వీరు చేయరు. వీరి ప్రవర్తన ప్రభావం మిగతా ఉద్యోగుల మీద ఎంతో కొంత పడుతుంది.
 
తిండిపోతులు
కొందరు ఉద్యోగస్తులు ఉంటారు. వారు ఆఫీసుకు తినడానికే వస్తారు అన్నట్టు ఉంటుంది వారి ప్రవర్తన. ఆఫీసులో ఉండే ఏడెనిమిది గంటల్లో ప్రతి నిమిషం ఏదో ఒకటి తింటూనే ఉంటారు. తమ తిండి కారణంగా వచ్చే శబ్దాలు ఇతరులను ఇబ్బంది పెడతాయన్న స్పృహ కూడా వీరికి ఉండదు. ఇలాంటి వారి కారణంగా మిగతా ఉద్యోగుల పనికి కూడా అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిది.
 
వితండవాదులు
చిన్న విషయానికి కూడా వితండవాదం చేస్తుంటారు. తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే రకంగా వీరిని చెప్పుకోవచ్చు. పని ప్రదేశంలో వీరి వితండవాదన కారణంగా ఉద్యోగుల పనికి అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఇలాంటి వారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీరి వాదనల కారణంగా కొన్ని సమయాలలో అనవసర ఆందోళనకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
 
సరదా సరదాగా....
ఆఫీసులో సరదాగా జోకులేస్తూ మాట్లాడే వ్యక్తులు ఒకరిద్దరన్నా ఉంటుంటారు. తమ మాటలతో, జోకులతో ఇతరులని నవ్విస్తూ పని వలన ఏర్పడే ఒత్తిడిని కొంత వరకూ తగ్గిస్తూంటారు. వీరి మాటలను రోజులో ఓ పదినిమిషాల పాటు విని ఆనందిస్తే అవి టానిక్‌గా పనిచేస్తాయి తప్ప రోజంతా వారి మాటలే వింటూ కూర్చుంటే పనికి ఆటంకం ఏర్పడుతుంది. దాని వలన యాజమాన్యానికి మీ మీద చెడు అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. ఇలాంటి వారితో ఎక్కువ సేపు గడపకుండా ఉంటేనే మంచిది.